- బిజినెస్ లిస్ట్ నుంచి బిల్లులు తొలగించిన కేంద్రం
- ఐదు రోజుల్లో ముగియనున్న పార్లమెంట్ సమావేశాలు
- వివిధ శాఖల పద్దుల ఆమోదంపైనే దృష్టి
- సప్లిమెంటరీ బిజినెస్లిస్ట్ పెడ్తామంటున్న ఎన్డీయే వర్గాలు
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టే విషయంలో కేంద్రం పునరాలోచనలో పడింది. ఆదివారం విడుదల చేసిన రివైజ్డ్ బిజినెస్ లిస్ట్‌లో వన్ నేషన్, వన్ ఎలక్షన్‌కు సంబంధించిన 129వ రాజ్యాంగ సవరణ, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లులను తొలగించింది. శుక్రవారం రిలీజ్ చేసిన బిజినెస్ లిస్ట్‌లో మాత్రం ఈ రెండు బిల్లులు ఉన్నాయి. వీటిని కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెడ్తారని ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు ప్రకటించారు. ఈ మేరకు సోమ, మంగళవారాలు సభ్యులందరూ తప్పనిసరిగా సభకు హాజరు కావాలని బీజేపీ హైకమాండ్ విప్ కూడా జారీ చేసింది. కానీ.. ఆదివారం నాటికి బిల్లులు ప్రవేశపెట్టే అంశంపై కేంద్రం వెనక్కి తగ్గింది. జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లులను ప్రవేశపెట్టే విషయంలో కేంద్రం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తున్నది.పార్లమెంట్ సమావేశాలకు ఇంకా 5 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. వివిధ శాఖల పద్దులకు పార్లమెంట్ ఆమోదం తర్వాత.. శుక్రవారంలోపు జమిలి బిల్లులను ప్రవేశపెట్టే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలిసింది.
స్పీకర్ అనుమతితో సప్లిమెంటరీ బిజినెస్ లిస్ట్
సప్లిమెంటరీ బిజినెస్ లిస్ట్ ద్వారా ఈ వింటర్ సెషన్లోనే ఎప్పుడైనా వన్ నేషన్, వన్ ఎలక్షన్‌కు సంబంధించిన 129వ రాజ్యాంగ సవరణ, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. దీని కోసం కేంద్ర ప్రభుత్వం.. స్పీకర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కాగా, జమిలి ఎన్నికల బిల్లుకు కేబినెట్ ఆమోదించిన తర్వాత ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీనికితోడు బిల్లులు పాస్ చేయించుకునేందుకు ఉభయ సభల్లో ఎన్డీయే కూటమికి సరిపడా బలం లేదు. హడావుడిగా బిల్లులు ప్రవేశపెడితే మరింత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. అప్పటి వరకు వివిధ శాఖలకు సంబంధించిన పద్దులను క్లియర్ చేసుకోవాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. కాగా, తాజా పరిణామాలు నేపథ్యంలో.. శుక్రవారంతో ముగిసే శీతాకాల సమావేశాల్లో.. బిల్లులు పెట్టడంపై సందిగ్ధత నెలకొన్నది. అయితే, లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలి ఎన్నికల అమలు కోసం రాజ్యాంగంలో కొత్తగా ఆర్టికల్ 82ఏను చేర్చాల్సి ఉంటుంది. పార్లమెంట్ పదవీ కాలంలో మార్పు కోసం.. ఆర్టికల్ 83ని, అసెంబ్లీల పదవీ కాలం సవరణకు ఆర్టికల్ 172ని, ఎన్నికల నిబంధనల రూపకల్పన కోసం పార్లమెంట్‌కు అధికారం కల్పించే ఆర్టికల్ 327ని సవరించాల్సి ఉంటుంది.
ఈ వారంలోనే బిల్లులు ప్రవేశపెడ్తాం: బీజేపీ
లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన ఆర్టికల్ 129 రాజ్యాంగ సవరణ, శాసన సభలు ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు ఉద్దేశించిన కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లులను ఈ వారంలోనే ప్రవేశపెడ్తున్నట్లు ఎన్డీయే వర్గాలు తెలిపాయి. ఉభయ సభల్లో బిల్లులు ప్రవేశపెట్టి.. చర్చించాక వాటిని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపనున్నట్లు వివరించాయి. ఈ రెండు బిల్లులు ప్రవేశపెట్టేంత వరకు గ్రాంట్లకు సంబంధించిన సప్లిమెంటరి డిమాండ్లను క్లియర్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలిపాయి. శుక్రవారంలోపు కచ్చితంగా సప్లిమెంటరీ బిజినెస్ లిస్ట్ ద్వారా బిల్లులు ప్రవేశపెడ్తామని స్పష్టం చేశాయి.
విప్ జారీ చేసినా.. చర్చకు రాని బిల్లులు
జమిలి ఎన్నికల బిల్లును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్రం ఇప్పటి దాకా గట్టి కసరత్తులే చేసింది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి అభిప్రాయ సేకరణ చేపట్టింది. అపోజిషన్ పార్టీల మద్దతు కూడగట్టుకునేందుకు సైతం అనేక ప్రయత్నాలు చేసింది. అన్ని పార్టీలతో సంప్రదింపులు సైతం జరిపింది. ప్రభుత్వ దూకుడు చూసి.. ప్రతిపక్షాలు సైతం ఈ బిల్లు శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు రావొచ్చని భావించాయి. అందుకే.. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు సోమ, మంగళ వారాల్లో తమ సభ్యులంతా పార్లమెంట్‌కు తప్పక హాజరు కావాల్సిందేనని విప్ జారీ చేశాయి. కాగా, ప్రస్తుత పరిణామాలను చూస్తే.. శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.