వన్​ నేషన్​, వన్​ ఎలక్షన్​ ఇప్పుడు అసాధ్యం : చిదంబరం

వన్​ నేషన్​, వన్​ ఎలక్షన్​ ఇప్పుడు అసాధ్యం : చిదంబరం
  • రాజ్యాంగ సవరణ చేయాల్సిందే

చండీగఢ్: ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం వన్​ నేషన్​, వన్​ ఎలక్షన్ (ఒక దేశం, ఒకే ఎన్నికలు) అసాధ్యమని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్​ నేత పి. చిదంబరం అన్నారు. దానికోసం రాజ్యాంగానికి కనీసం ఐదు సవరణలు అవసరమని.. ఆ సవరణలను లోక్‌‌సభ/ రాజ్యసభలో ప్రవేశపెట్టే సంఖ్యాబలం ప్రధాని నరేంద్ర మోదీకి లేదని ఆయన పేర్కొన్నారు. గత నెలలో స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో మోదీ మాట్లాడుతూ.. వన్​ నేషన్​, వన్​ ఎలక్షన్ అవసరమని గుర్తుచేశారు. తరచూ ఎన్నికలు దేశ పురోగతికి అడ్డంకులు సృష్టిస్తున్నాయని స్పష్టంచేశారు. 

ఈ అంశంపై సోమవారం చండీగఢ్ లో చిదంబరం మీడియాతో మాట్లాడుతూ.. వన్​ నేషన్​, వన్​ ఎలక్షన్ కు రాజ్యాంగపరమైన అడ్డంకులు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. వన్​ నేషన్​, వన్​ ఎలక్షన్ ను ఇండియా కూటమి పూర్తిగా వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు. రిజర్వేషన్‌‌ను రద్దు చేయాలని కాంగ్రెస్ భావిస్తోందని ఇటీవల ప్రధాని మోదీ చేసిన కామెంట్​ పై అడిగిన ప్రశ్నకు చిదంబరం స్పందిస్తూ.. మేము రిజర్వేషన్లను ఎందుకు రద్దు చేయాలి? అని ప్రశ్నించారు. ‘‘50 శాతం రిజర్వేషన్ల పరిమితిని తొలగించాలని మేం చెప్తున్నాం. కుల గణన కోరేది మేమే. జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలని చెబుతున్నాం. అవన్నీ నమ్మొద్దు’’ అని చిదంబరం స్పష్టం చేశారు.