వన్ నేషన్, వన్ టైమ్!

వన్ నేషన్, వన్ టైమ్!

భారతదేశానికి  స్వాతంత్య్రం రాకముందు దేశంలో  మూడు టైమ్ జోన్లు అమలు అయ్యేవి.  అవి  బొంబాయి, కలకత్తా,  మద్రాస్  టైమ్ జోన్లు.  స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారతదేశ అధికారిక  టైమ్ జోన్​గా  ‘ఇండియన్ స్టాండర్డ్  టైమ్’ (ఐ.యస్.టి.)ను అమలు చేయడం జరిగింది.  ఇండియన్  స్టాండర్డ్  టైమ్  ‘యూ.టి.సి+05:30’కి సమానం.  అనగా ‘సమన్వయ సార్వత్రిక సమయం’ (కోఆర్డినేటెడ్​ యూనివర్సల్​ టైమ్ (యూటీసీ)) కంటే ఐదున్నర గంటలు ముందు ఐ.యస్.టి.  ఉంటుంది. 

‘వన్ నేషన్, వన్ టైమ్’  భారత దేశం అంతటా ఒకటే సమయాన్ని అనుసరించే విధానం. ఈ విధానం ద్వారా ఇతర ప్రత్యామ్నాయ  సమయ వినియోగం నిషేధించడం జరుగుతుంది.  ప్రస్తుతం, భారతదేశం సమయాన్ని నిర్ణయించడానికి  ‘జీపీయస్  ఉపగ్రహాలను’ ఉపయోగిస్తుంది.  ఇది సమన్వయ సార్వత్రిక సమయంతో అనుసంధానమై ఉంది. 

భారత ప్రామాణిక సమయం  నియమాలు 2025ను ( ఇండియన్​ స్టాండర్డ్​ టైమ్​ రూల్స్​2025)  ప్రభుత్వం, ప్రజల అభిప్రాయాల కోసం విడుదల చేసింది . వినియోగదారుల వ్యవహారాల శాఖ వెబ్‌‌‌‌సైట్ ద్వారా ప్రజలు ఫిబ్రవరి 14 వరకు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చును.  ‘వన్ నేషన్, వన్ టైమ్’ ముసాయిదాను నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ(ఎన్​పీఎల్​),  ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సహాయంతో వినియోగదారుల వ్యవహారాల శాఖ రూపొందించింది.

ఎందుకు అవసరం?

1999 కార్గిల్ యుద్ధం సమయంలో స్వదేశీ సమయ వ్యవస్థ అవసరం అనిపించింది. విదేశీ ఉపగ్రహాల నుంచి వచ్చే సమయ డేటాపై ఆధారపడటం వల్ల భారతదేశ శత్రు స్థానాలను ఖచ్చితంగా లక్ష్యం చేసుకునే  సామర్థ్యంపై విదేశీ సమయ ప్రభావం పడిందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. 

తదనుగుణంగానే విదేశీ ఉపగ్రహాల మీద ఆధారపడకుండా స్వదేశీ పరిజ్ఞానంతో భారతదేశం అంతటా ఒకే సమయాన్ని అనుసరించాలని గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది.  అందులో భాగంగానే  ‘వన్ నేషన్, వన్ టైమ్’ విధానాన్ని  భారతదేశంలో అమలు చేయాలని నిర్ణయించింది.   

సమయాన్ని  నిర్ణయించే  పద్దతి

‘వన్ నేషన్, వన్ టైమ్’ విధానంలో సమయ ఖచ్చితత్వాన్ని  నిర్ధారించడానికి  అధునాతన  అణు గడియారాలను ఉపయోగిస్తారు.   ఈ విధానంలో భాగంగా భారతదేశం జీపీఎస్ ఆధారిత సమయాన్ని వినియోగించుకోకుండా  ఖచ్చితమైన సమయాన్ని చూపే స్వదేశీ   ‘ఎన్ఎవిఐసి’  వ్యవస్థను ఉపయోగించుకోనుంది. 

‘ఎన్ఎవిఐసి’ అంటే ‘నావిగేషన్ విత్ ఇండియన్ కాన్సటల్లేషన్’. (Navigation with Indian Constellation). ఇది  భారతదేశ అంతరిక్ష సంస్థ,  ఇస్రో అభివృద్ధి చేసిన ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ సిస్టమ్. ఇది భారతదేశం, పరిసర ప్రాంతాలలో స్థాన, సమయ సేవలను అందిస్తుంది. ‘ఎన్ఎవిఐసి’  జాతీయ భౌతిక ప్రయోగశాలతో  లింక్​ను కలిగి ఉంటుంది. ఫరీదాబాద్‌‌‌‌లోని ఉన్న  ప్రయోగశాలకు  మొదటగా  ‘ఎన్ఎవిఐసి’  సమయాన్ని పంపిస్తుంది.  

తరువాత  ఈ సమయం అణు గడియారాన్ని కలిగి ఉన్న   అహ్మదాబాద్,  బెంగళూరు, భువనేశ్వర్,  గౌహతి కేంద్రాలకు ఆప్టిక్ ఫైబర్ లింక్ ద్వారా చేరుతుంది. ప్రాంతీయ కేంద్రాలలో అణు గడియారాలపై  ఆధారపడటం ద్వారా, విదేశీ వ్యవస్థలపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా,  జాతీయ భద్రతను పెంచుకోవడం ద్వారా ‘వన్ నేషన్, వన్ టైమ్’  అనే లక్ష్యాన్ని నెరవేర్చుకోగలం. ‘అణు గడియారం’ అనేది  సీసీయం133  మూలక  లేక  రూబిడియం87 మూలక  పరమాణువుల నిర్దిష్ట  ప్రతిధ్వని పౌనఃపున్యాలను ఉపయోగించడం ద్వారా  అత్యంత ఖచ్చితమైన సమయాన్ని నిర్ణయించగలం. ‘అణు  గడియారం’ ప్రతి 100 మిలియన్ల సంవత్సరాలకు ఒక సెకను  మాత్రమే కోల్పోతాయి. ఇది ‘అణు గడియారం’ అత్యంత  ఖచ్చితత్వానికి  ఒక ఉదాహరణ.

వన్ టైమ్ వలన  సమస్యలు  

‘వన్ నేషన్, వన్ టైమ్’  వలన కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు  ఈశాన్య భారతదేశం, అండమాన్  నికోబార్ దీవులు  వాటి భౌగోళిక స్థితి కారణంగా, దేశంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే త్వరగా  సూర్యోదయం, సూర్యాస్తమయాన్నికలిగి ఉంటాయి.  కావున ఈ ప్రాంతాలలో   త్వరగా  సూర్యోదయం, సూర్యాస్తమయం రోజువారీ దినచర్యలకు అంతరాయం కలిగిస్తుంది. 

ఎందుకంటే, ప్రజలు అధికారిక పని గంటలకు ముందే మేల్కొని, రోజులోని ఎక్కువగా  పనిచేయాల్సిన  సమయంలో పగటి వెలుతురును కోల్పోతారు. అందువలన విద్యుత్ వినియోగం పెరిగి తద్వారా భారతదేశ 'కార్బన్ ఫుట్ ప్రింట్' పెరిగి అది వాతావరణ మార్పులను తీవ్రతరం చేస్తుంది. ప్రజలు  మేల్కొనే సమయం, నిద్రపోయే సమయం, తినే సమయం,ఉత్పాదకత, సామర్థ్యం  మొదలగు   శారీరక ప్రక్రియలు మానవ శరీర అంతర్గత  'జీవ గడియారం' పై ఆధారపడి ఉంటాయి.  

రోజువారీ కాంతి-చీకటి చక్రం ఆధారంగా 'జీవ గడియారం' పనిచేస్తుంది.  దీనినే ‘సర్కేడియన్ రిథమ్’ అని కూడా అంటారు. కాబట్టి   ‘వన్ నేషన్, వన్ టైమ్’ విధానం భారత దేశంలోని  కొన్ని ప్రాంతాల ప్రజల ‘సర్కేడియన్ రిథమ్’పై ప్రభావం చూపే అవకాశం ఉంది.

భారతదేశానికి కలిగే ప్రయోజనాలు  

‘వన్​ నేషన్​..వన్​ టైమ్​’ భారతదేశ సొంత, ఖచ్చితమైన, నమ్మదగిన సమయ పంపిణీ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ను ఏర్పాటు చేస్తుంది. ఇది విదేశీ వ్యవస్థలపై ఆధారపడదు. జాతీయ భద్రతను పెంచుతుంది.  పవర్ గ్రిడ్స్, నావిగేషన్,  టెలి కమ్యూనికేషన్స్,  5G టెక్నాలజీ,  కృత్రిమ మేధస్సు, బ్యాంకింగ్,  ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్,  రక్షణ, రవాణా వంటి కీలక రంగాలు సమర్థవంతంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. 

అదేవిధంగా  సైబర్ నేరాలను అరికడుతుంది.  ఇకనుంచి డిజిటల్ గడియారాలు,  స్మార్ట్ ఫోన్లు,  ల్యాప్​టాప్​లలో చూపే సమయం పూర్తిగా అటామిక్ క్లాక్‌‌‌‌లపై ఆధారపడి ఉంటుంది.  వివిధ సర్వీస్ ప్రొవైడర్లు సమకూర్చే జీపీఎస్ ఆధారిత సమయం ఇకనుంచి చెల్లుబాటు కాదు. అదేవిధంగా ఇది భారతదేశ జాతీయ సమగ్రతను, ఐక్యతను ప్రపంచానికి చాటిచెబుతుంది.

- డా.శ్రీధరాల రాము,ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్–