ఒకే దేశం.. ఒకే ఎన్నికలు.. ప్రక్రియ మొదలైందా?

మరోసారి జమిలి ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం  కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్టీఏ ప్రభుత్వమే  ఒక దేశం.. ఒకే ఎన్నికల ప్రక్రియను అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తుందని సమాచారం అందుతోంది.  మూడోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులైంది.  జమిలి ఎన్నికల ప్రతిపాదనకు ఇతర రాజకీయ పార్టీల మద్దతు లభిస్తుందని బీజేపీ వర్గాలు విశ్వాసాన్ని వ్యక్తపరిచాయి.  2024 ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని బీజేపీ చేర్చింది.  

దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు అధ్యయనం చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ నేతృత్వంలో ఏర్పడిన కమిటి.. తన నివేదికను 18 వేల 626 పేజీలతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది.   వివిధ సామాజిక, రాజకీయ అంశాలను పరిగణనలోనికి తీసుకొని సమగ్రంగా చర్చించి నివేదికను తయారు చేశారు. ఈ నివేదికలో 47 రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడించాయి.  32 రాజకీయ పార్టీలు జమిలీ ఎన్నికలకు మద్దతు ప్రకటించాయి.  ప్రజలనుంచి 21 వేల 558 ప్రతిస్పందనలు రాగా వాటిలో 80 శాతం మంది అనుకూలంగా ఉన్నారని నివేదికలో తెలిపారు.   

నలుగురు మాజీ ప్రధాన న్యాయమూర్తులు, నలుగురు మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌లతో సహా న్యాయ నిపుణులు అభిప్రాయాలను కూడా సేకరించారు,  ఇంకా, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII), ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (FICCI), మరియు అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (ASSOCHAM) వంటి అగ్రశ్రేణి వ్యాపార సంస్థలు, ప్రముఖ ఆర్థికవేత్తలతో కలిసి  చర్చించారు. దేశ వ్యాప్తంగా  ప్రతి సంవత్సరం ఏదో ఒకరమైన ఎన్నికలు వస్తున్నాయని..వీటి ప్రభావం దేశ పురోగతిపై పడుతుందని .. ప్రజాధనం అనవసరంగా ఖర్చు అవుతుందని తెలిపారు. తొలుత లోక్​సభ, శాసనసభ ఎన్నికలు జరపాలని ఆ తరువాత 100 రోజుకు లోకల్​ బాడీ ఎలక్షన్స్​ జరపాలని సిఫారస్​ చేసింది.  ఇందుకోసం రాజ్యాంగంలో కనీసం ఐదు ఆర్టికల్స్‌ను సవరించాలని కమిటీ సూచించింది. మూడు స్థాయిల ఎన్నికలకు ఉమ్మడిగా ఓటర్ల జాబితా ఉండాలని తెలిపింది.