అప్పటివరకు ఆనందం..ఇంతలోనే విషాదం..అన్నబిడ్డ, అల్లుడిని ఫ్లైటెక్కించి వస్తూ..

అప్పటివరకు ఆనందం..ఇంతలోనే విషాదం..అన్నబిడ్డ, అల్లుడిని ఫ్లైటెక్కించి వస్తూ..
  • అన్న బిడ్డ, అల్లుడిని ఫ్లైటెక్కించి వస్తుండగా..  యాక్సిడెంట్​లో ఒకరు మృతి
  • మరొకరికి తీవ్ర గాయాలు

కీసర, వెలుగు: కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన యాక్సిడెంట్​లో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. మంచిర్యాలకు చెందిన విజయ్ (50) వ్యవసాయం చేస్తున్నాడు. తన అన్న బిడ్డ, అల్లుడు విదేశాలకు వెళ్తుండడంతో..వారిని ఫ్లైట్ఎక్కించడానికి అన్న రాములు, వదిన విజయ, అక్క లక్ష్మి, మరో స్నేహితుడు కొమురయ్యతో కలిసి మంగళవారం రాత్రి స్విఫ్ట్​కారులో శంషాబాద్​ఎయిర్​పోర్టుకు వచ్చారు. ఫ్లైట్ ఎక్కించి బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు ఓఆర్ఆర్​మీదుగా తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. 

ఈ సమయంలో కొమురయ్య కారు నడుపుతుండగా, విజయ్ పక్కనే కూర్చుకున్నాడు. కీసర పరిధిలోని యాద్గార్‌‌పల్లి దాటిన తర్వాత తనకు నిద్ర వస్తుండడంతో పక్కనే కూర్చున్న విజయ్​ను బండి నడపమని కొమురయ్య కారును పక్కకు ఆపాడు. దీంతో విజయ్ కారు డోర్ తీసి, వెనుక నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన కంటైనర్ అతడితోపాటు కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో విజయ్​అక్కడికక్కడే మృతి చెందగా, లక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 

సంఘటన స్థలానికి చేరుకున్న కీసర పోలీసులు విజయ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్​కు తరలించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. కంటైనర్ డ్రైవర్​ను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆటో డ్రైవర్..

ఎల్బీనగర్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆటో డ్రైవర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. నాగోల్ నువ్వులబండకు చెందిన నేనవాత్ ఉషారామ్​నాయక్(50) ఆటో డ్రైవర్. గత నెల 26న జైపురికాలనీ నుంచి నాగోలు వైపు ఆటోలో వెళ్తూ, రాంగ్ రూట్​లో బైక్​ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైకర్​చంద్రగిరి శ్రీనుతోపాటు ఉషారామ్​కు గాయాలయ్యాయి. గాయపడిన శ్రీను అదే రోజు నాగోలు పీఎస్​లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఉషారామ్ గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. 

అయితే, చికిత్స పొందుతుండడంతో ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ఫిర్యాదు చేస్తే, పోలీసులు తమ ఫిర్యాదును తీసుకోలేదని ఉషారామ్ కుటుంబసభ్యులు ఆరోపించారు. రాంగ్ రూట్ వచ్చి ఢీ కొట్టి, మళ్లీ ఎలా ఫిర్యాదు చేస్తారని నిర్లక్ష్యం చేశారని నాగోలు పీఎస్​ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు కలగా చేసుకొని, ఇరువర్గాలతో మాట్లాడారు. ఉషారాం నాయక్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలు..

శామీర్ పేట, వెలుగు: శామీర్​పేటలో ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలు మృతి చెందింది. సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్క పల్లికి చెందిన చీరబోయిన శివమ్మ (70) ఇటీవల శామీర్​పేటలోని తన తల్లిగారింటికి వచ్చి మల్లన్న కల్యాణ వేడుకల్లో పాల్గొంది. బుధవారం తన ఇంటికి వెళ్లడానికి, శామీర్ పేట బస్టాప్​కు వెళ్లింది. ఈ క్రమంలో బస్సు డ్రైవర్ ఆజాగ్రత్తగా వాహనం నడిపి, ఆమెను ఢీకొట్టి ముందు టైర్ ను ఎక్కించాడు. దీంతో తీవ్ర గాయాలతో ఆమె స్పాట్​లోనే చనిపోయింది.