నిర్మల్ జిల్లాలో ఓ వ్యక్తి నిర్వాకం
అతడు.. తన చుట్టుపక్కల వాళ్లు మర్కజ్ వెళ్లి వచ్చిన వివరాలను ఆఫీసర్లకు చేరవేయడంలో సహకరించాడు. వాళ్ల కాంటాక్ట్స్ ట్రేస్ చేయడంలో, హాస్పిటల్ కు తరలించడంలో, క్వారంటైన్ కు పంపించడంలో సాయపడ్డాడు. కరోనాపై ఆఫీసర్లు నిర్వహించిన సమావేశాల్లోనూ పాల్గొన్నాడు. కానీ..తాను మర్కజ్ వెళ్లి వచ్చిన విషయాన్ని మాత్రం దాచిపెట్టాడు. తీరాచూస్తే అతడికి కరోనా పాజిటివ్ అని తేలింది.
నిర్మల్, వెలుగు: నిర్మల్ పట్టణానికి చెందిన 45 ఏండ్ల ఓ వ్యక్తి మార్చిలో ఢిల్లీలోని మర్కజ్లో జరిగిన మత ప్రారన్థల్లో పాల్గొన్నాడు. అదే నెలలో తిరిగి సొంతూరుకు చేరుకున్నాడు. ఇంతలో మర్కజ్ రిలేటడ్ కరోనా కేసులు రాష్ట్రంలో పెరుగుతుండటంతో అతడు పోలీసులను, అధికారులను కలిశాడు. తాను మర్కజ్ వెళ్లివచ్చిన విషయాన్ని దాచి.. తన ప్రాంతంలోని మర్కజ్ వెళ్లి వచ్చినవారి వివరాలు అధికారులకు అందజేశాడు. ఇదే పనిలో బహిరంగంగా తిరిగేవాడు. ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన కరోనా అవగాహన సమావేశాల్లోనూ పాల్గొన్నాడు. రెండు రోజుల క్రితం స్థానిక అధికారులకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు ఓ సమాచారం చేరవేశారు. ఇన్నాళ్లూ మర్కజ్ వ్యక్తుల వివరాలు అందించిన ఆ 45 ఏండ్ల వ్యక్తి కూడా మర్కజ్ వెళ్లి వచ్చినట్లు పేర్కొన్నారు. దీంతో స్థానిక అధికారులు అతడ్ని హోంక్వారంటైన్ చేసి.. బ్లడ్ శాంపిల్స్ హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ కు పంపించారు. తీరా చూస్తే అతడికీ పాజిటివ్ అని శనివారం తేలింది. అతడి ఫ్యామిలీ మెంబర్స్, కాంటాక్ట్ పర్సన్స్ ను 33 మందిని గుర్తించిన అధికారులు.. క్వారంటైన్ సెంటర్ కు తరలించారు. ఇంకా ఎవరితోనైనా కాంటాక్ట్ అయ్యడా అని ఆరా తీస్తున్నారు. మర్కజ్ వెళ్లి వచ్చిన తర్వాత సదరు వ్యక్తి ఉన్నతాధికారులతో, పోలీసులతో కూడా కాంటాక్ట్ అవడం, వారు నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనడం ఆందోళనకు దారితీసింది. ఆ అధికారులకు, పోలీసులకూ టెస్టులు చేయనున్నట్లు తెలుస్తోంది. వీళ్లను కూడా క్వారంటైన్ కు తరలించే అవకాశం ఉంది.
నిర్మల్‍లో 18కి చేరిన కరోనా కేసులు
నిర్మల్ జిల్లాలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. రోజుకు 50 శాంపిళ్లను పరీక్షల కోసం అధికారులు పంపిస్తూనే ఉన్నారు. శనివారం నిర్మల్ పట్టణంలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ తేలిందని కలెక్టర్ ప్రకటించారు. ఈ ఇద్దరూ మర్కజ్ వెళ్లివచ్చిన వాళ్లే. ఇందులో 45 ఏండ్ల వ్యక్తి తాను మర్కజ్ వెళ్లివచ్చిన విషయాన్నిదాచి తన ప్రాంతంలోని మర్కజ్ వెళ్లివచ్చిన వారి వివరాలను అధికారులకు అందజేశాడు. తాజా రెండు కేసులతో కలిపి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 18కి చేరింది. ఒకరు మృతి చెందారు. నిర్మల్ పట్టణంలోనే తొమ్మిది కేసులు నమోదయ్యాయి. మర్కజ్ కు వెళ్లొచ్చిన వారిలో కొంత మంది ఇంకా తప్పించుకొని తిరుగుతున్నట్లు తెలుస్తోంది. శనివారం కరోనా పాజిటివ్ వచ్చిన 45 ఏండ్ల వ్యక్తే ఇందుకు ఉదాహరణ. ఇటీవల భైంసాలో సైతం కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల కుటుంబ సభ్యులను క్వారంటైన్ కు తరలించేందుకు ప్రయత్నించగా.. హెల్త్ సిబ్బంది, పోలీస్ అధికారులతో చాలా సేపు వాగ్వాదానికి దిగారు.
For More News..