జమ్మూ కాశ్మీర్‎లో భారీ ఎన్ కౌంటర్.. ఉగ్రవాదుల కాల్పుల్లో జవాన్ వీర మరణం

జమ్మూ కాశ్మీర్‎లో భారీ ఎన్ కౌంటర్.. ఉగ్రవాదుల కాల్పుల్లో జవాన్ వీర మరణం

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‎లోని పహల్గాంలో నరమేధం సృష్టించిన ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భద్రతా దళాలు వేట కొనసాగిస్తున్నాయి. టెర్రరిస్టులు అడవుల్లో నక్కి ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారం మేరకు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో ఉధంపూర్ జిల్లాలో గురువారం (ఏప్రిల్ 24) భారీ ఎన్ కౌంటర్ జరిగింది. డూడు-బసంత్‌గఢ్ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ భారత జవాన్ వీర మరణం పొందినట్లు అధికారులు వెల్లడించారు. ఇద్దరు ముష్కరులు నక్కి ఉన్నారన్న సమాచారం మేరకు సెర్చ్ ఆపరేషన్ చేపట్టగా.. భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. 

ఈ కాల్పుల్లో సోల్జర్ మరణించాడని తెలిపారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ జరుగుతోన్న ఏరియా దట్టమైన అటవీ ప్రాంతమని.. ఇక్కడ అనేక సహజ గుహలు, ఉగ్రవాదుల రహస్య స్థావరాలను గుర్తించామని తెలిపారు. ఒక రకంగా ఉగ్రమూకలకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉండటంతో భద్రతా దళాలపై ఆకస్మిక దాడులు జరిగే అవకాశం ఉందని.. దీంతో భద్రతా దళాలు జాగ్రత్తగా ముందుకు కదులుతున్నాయని పేర్కొన్నారు. ఘటన స్థలంలో ప్రస్తుతం సెర్చ్ అపరేషన్ కొనసాగుతోందని.. భారీగా పారా మిలటరీ బలగాలను మెహరించినట్లు అధికారులు వెల్లడించారు. 

కాగా, జమ్ముకాశ్మీర్‎లోని పహల్గాం ప్రాంతం బైసారన్ మైదాన ప్రాంతంలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. పర్యాటకులపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో 26 మంది అమాయక ప్రజలు మృతి చెందగా.. మరికొందరు బుల్లెట్ గాయాలకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో యావత్ దేశమంతా ఉలిక్కిపడింది. కుటుంబంతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లిన వారిపై ఉగ్రమూకలు విచక్షణరహితంగా కాల్పులు జరిపి చంపడంతో దేశ ప్రజలు మండిపోతున్నారు. ఈ క్రమంలో పహల్గాంలో నరమేధం సృష్టించిన ముష్కరులు కోసం భద్రత దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.