హైదరాబాద్: తెలంగాణలో ‘వన్ స్టేట్ - వన్ రేషన్’ విధానాన్ని అమలు చేయబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇకపై తెలంగాణలో ఒకరికి ఒకచోట మాత్రమే రేషన్ కార్డు ఉండాలని ఆయన అన్నారు. శుక్రవారం (జనవరి 10) డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ నెల 11 నుంచి 15 లోగా పథకాల అమలుకు కావలసిన ప్రిపరేటరీ పనులను పూర్తి చేసుకోవాలని అధికారులకు సూచించారు. రేషన్ కార్డు లబ్దిదారుల జాబితాలను కూడా గ్రామ సభల్లో బహిర్గతం చేయాలని.. ఈ నెల 24వ తేదీలోగా గ్రామ సభలు పూర్తి చేయాలని ఆదేశించారు.
గూడులేని నిరుపేదలకు ఇళ్లను నిర్మించి ఇవ్వాలనేది ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇందిరమ్మ యాప్ ద్వారా గుర్తించిన 18.32 లక్షల మంది వివరాలను జిల్లాలకు పంపించామని.. అందులో అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు. తొలి విడతలో భాగంగా నియోజకవర్గానికి 3500 ఇండ్లను మంజూరు చేశామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన వారి జాబితాలను వెంటనే సిద్ధం చేయాలని.. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అర్హుల జాబితాను జిల్లా ఇంచార్జీ మంత్రికి అందించాలని పేర్కొన్నారు. ఇంచార్జీ మంత్రి ఆమోదంతోనే కలెక్టర్లు అర్హుల జాబితాను విడుదల చేయాలని సూచించారు.
Also Read :- రైతులకు గుడ్ న్యూస్
ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ధనసరి సీతక్క , ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షులు జి.చిన్నారెడ్డి , ప్రభుత్వ సలహాదార్లు కే.కేశవరావు, షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్ , సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.