నాంపల్లి/సికింద్రాబాద్, వెలుగు : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వన్ స్టేషన్ వన్ ప్రాడక్ట్’ స్టాల్ నాంపల్లి రైల్వే స్టేషన్ లో ఏర్పాటైంది. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ మనోజ్ లంక శుక్రవారం ఈ స్టాల్ ను ప్రారంభించారు. ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం (పీఎంఈజీపీ) ద్వారా లబ్ధి పొందిన యూనిట్లవారు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు, ప్రదర్శించేందుకు ఈ స్టాల్ ఏర్పాటు చేశామని మనోజ్ తెలిపారు. దీంతో యూనిట్లకు మార్కెటింగ్ సహకారం జరుగుతుందని చెప్పారు. అలాగే మిల్లెట్ ఉత్పత్తులను కూడా ప్రారంభిస్తామని, పీఎంఈజీపీ ద్వారా లబ్ధి పొందిన వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. మరిన్ని వివరాల కోసం గ్రామీణ పరిశ్రమల కమిషన్ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో సంప్రదించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి రైల్వే స్టేషన్ ఇన్ చార్జ్ కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రికార్డు స్థాయిలో 1,017 కిలో మీటర్ల విద్యుదీకరణ
దక్షిణ మధ్య రైల్వే 2022–-23లో తన నెట్‌వర్క్‌ని విద్యుదీకరించడంలో అత్యుత్తమ పనితీరు నమోదు చేసింది. 2022---–23 ఆర్థిక సంవత్సరంలో 1017 రూట్లలో విద్యుదీకరణ పూర్తి చేసింది. అందులో 286.4 కిలో మీటర్లు తెలంగాణ పరిధిలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 133.7 కిలోమీటర్లు, మహారాష్ర్టలో 546 కి.మీ, కర్నాటకలో 50.8 కిలో మీటర్ల రూట్ల మేర విద్యుదీకరణ పూర్తి చేశారు. జోన్‌లోని సిబ్బంది, అధికారులు అంకితభావంతో పనిచేసి విద్యుదీకరణ పనులు పూర్తిచేశారని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో దక్షిణ మధ్య రైల్వేకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని తెలిపారు. అలాగే విద్యుత్ శక్తిని ఆదా చేయడంపై ఈ నెల 9 వరకు విద్యుత్ భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు.