Viral Video: షాకింగ్ ఘటన.. లంచ్ టైంలో విద్యార్థులు తింటుండగా.. సడన్గా ఏమైందంటే..

Viral Video: షాకింగ్ ఘటన.. లంచ్ టైంలో విద్యార్థులు తింటుండగా.. సడన్గా ఏమైందంటే..

వడోదర: గుజరాత్లోని వడోదరలో షాకింగ్ ఘటన జరిగింది. వడోదరలోని గురుకుల్ క్రాస్ రోడ్స్ సమీపంలో ‘శ్రీ నారాయణ్ విద్యాలయ్’ అనే స్కూల్ ఉంది. ఒక స్వచ్ఛంద సంస్థ నడపుతున్న ఆ స్కూల్లో అకస్మాత్తుగా జరిగిన ఓ ఘటన విద్యార్థుల్లో భయాందోళనకు కారణమైంది. ఏం జరిగిందో కాసేపు ఎవరికీ ఏం అర్థం కాలేదు. ఊహించని పరిణామంతో విద్యార్థులు గజగజ వణికిపోయారు. ఇంతకీ ఆ స్కూల్లో ఏం జరిగిందంటే.. శుక్రవారం మధ్యాహ్నం 7వ తరగతి విద్యార్థులు గదిలో కూర్చుని లంచ్ టైంలో భోజనం చేస్తున్నారు. కొందరు విద్యార్థులు అప్పటికే త్వరత్వరగా తినేసి గ్రౌండ్లోకి వెళ్లి ఆడుకుంటున్నారు. మరికొందరు విద్యార్థులు తిన్న తర్వాత అక్కడే కూర్చుని ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు. ఇంకొందరు బెంచ్లపై కూర్చుని తింటూ ఉన్నారు. అందరూ ఎవరి పనిలో వాళ్లు ఉండగా స్కూల్ గోడ ఫ్లోర్తో సహా అకస్మాత్తుగా కూలిపోయింది.

ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న గది కావడంతో బెంచ్లతో సహా కొందరు విద్యార్థులు కిందపడిపోయారు.ఆ పక్కనే ఉన్న విద్యార్థులకు షాక్తో ఏం జరిగిందో కాసేపు అర్థం కాలేదు. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. మధ్యాహ్నం 12.30కు ఈ ఘటన జరిగింది. ఒక విద్యార్థికి గాయాలు కాగా మూడు కుట్లు పడ్డాయి. లంచ్ టైం కావడంతో విద్యార్థులు ఎక్కువ మంది తరగతి గదిలో లేరు. చాలా మంది గ్రౌండ్ లో ఆడుకుంటూ ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

ఈ ఘటనపై స్కూల్లో సీనియర్ టీచర్ అయిన రూపాల్ షా మీడియాకు వివరాలను వెల్లడించారు. స్టాఫ్ రూంలో ఉండగా ఉన్నట్టుండి పెద్ద శబ్దం వినిపించిందని.. హుటాహుటిన అక్కడికి వెళ్లి చూడగా గోడ కూలిపోయి ఉందని.. విద్యార్థుల భయంతో కేకలు వేశారని చెప్పారు. స్కూల్ సిబ్బంది సాయంతో విద్యార్థులను కాపాడే ప్రయత్నం చేశామని తెలిపారు. ఈ ఘటనపై స్కూల్ సమీపంలో నివాసం ఉండే స్థానికులు మాట్లాడుతూ.. స్కూల్ బిల్డింగ్ 2001లో ఒక ట్రస్టీ ఇచ్చారని.. చాలా చోట్ల పెచ్చులు ఉండే స్థితిలో ఉందని చెప్పారు. అయినప్పటికీ ఆ పెచ్చులను కవర్ చేశారు తప్ప బిల్డింగ్కు సరైన మరమ్మతులను చేయలేదని తెలిపారు. ఈ ఘటనపై కాంగ్రెస్ విమర్శల దాడికి దిగింది. ‘ది గ్రేట్ గుజరాత్ మోడల్’ అని ఎద్దేవా చేసింది.