న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ మరోసారి కోర్టు ప్రొసీడింగ్స్ లైవ్ టెలికాస్ట్ చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. జడ్జిల మంచి, చెడు గురించి ఒక అభిప్రాయానికి రావాలంటే కోర్టు విచారణలను ప్రజలంతా చూడగలిగినప్పుడే సాధ్యమన్నారు. ఎన్ని కేసుల్లో తీర్పులు ఇచ్చారు?, కేసుల పరిష్కారం ఎంత వేగంగా జరుగుతోంది? అన్నవాటిని బట్టే జడ్జిలపై ఒక అభిప్రాయానికి (జడ్జిమెంట్‌కు) రాలేమని, కోర్టు రూమ్‌లో వారి ప్రవర్తన ఎలా ఉందన్న దానిని చూసే వారిని జడ్జ్ చేయాలని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. కోర్టు ప్రొసీడింగ్స్ ప్రజలంతా చూసే వీలు లేనంత వరకు కోర్టుల పనితీరు ఎలా ఉంటుందన్నది ప్రజలు అర్థం చేసుకోవడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రచయిత బలరామ్ కె గుప్తా రాసిన పుస్తకాన్ని వర్చువల్‌గా ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పారదర్శకత లోపిస్తే నమ్మకం కోల్పోతాం
కోర్టు ప్రొసీడింగ్స్ ప్రజలంతా చూడగలిగితే జుడిషియల్ ఇన్‌స్టిట్యూషన్స్ చట్టబద్ధతతో పాటు జవాబుదారీ తనం కూడా పెరుగుతుందని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ‘‘కేసుల డిస్పోజల్ రేటు, జడ్జిమెంట్లు లాంటి డేటా పబ్లిక్ డొమైన్‌లో సులభంగానే అందుబాటులో ఉంటుంది. కానీ కోర్టు రూమ్‌లో జడ్జిల ప్రవర్తన ఎలా ఉంటుందన్నది తెలుసుకోవడమే కష్టతరం. జడ్జిల పనితీరుకు సంబంధించిన ముఖ్యమైన ఇండికేటర్ అందుబాటులో లేకపోతే.. జడ్జిల మంచి, చెడు, పనితీరును ప్రజలు తెలియదు. దీని వల్ల జుడిషియల్ అకౌంటబులిటీకి సవాళ్లు ఎదురవుతాయి” అని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా బౌద్ధుల గురువు దలై లామా మాటలను గుర్తు చేశారు. ‘‘పారదర్శకత లోపిస్తే అపనమ్మకం, అభద్రతా భావం పెరిగిపోతాయి” అని అన్నారు. లీగల్ జర్నలిజం పెరుగుతోందని, జుడిషియల్ ప్రొసీడింగ్స్‌ను రిపోర్ట్ చేయడం ఎక్కువవుతోందని, అయినప్పటికీ ఇందులో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. కాగా, జస్టిస్ చంద్రచూడ్ కోర్టు ప్రొసీడింగ్స్ ప్రజలంతా చూడగలగాలని అనడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది అక్టోబర్‌లోనూ ఆయన కోర్టు విచారణలు లైవ్ టెలికాస్టింగ్ చేయాలని అన్నారు.
మరిన్ని వార్తల కోసం..
మూడింట రెండొంతుల మెజారిటీతో గెలుపు బీజేపీదే
మన టెకీలకు అమెరికా గుడ్ న్యూస్
ఐదు రాష్ట్రాల ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం