సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున తెలంగాణలోని ఓ చారిత్రక కట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అదే రామప్ప. దశాబ్దం పాటు ఎంతో మంది ఈ కట్టడానికి గుర్తింపు తెచ్చేందుకు కృషి చేశారు. ఫైనల్ గా లాస్ట్ ఇయర్ జులై 25న యునెస్కో గుర్తింపును దక్కించుకొని రామప్ప రికార్డులకెక్కింది. ఈ గుడి శిల్ప సంపద ఎంతో విశిష్టమైనది కావడంతో తాజ్‌మహల్, ఎర్రకోట వంటి కట్టడాల సరసన సగర్వంగా నిలిచింది.
పునాది లేకుండా...
కాకతీయుల కళావైభవానికి విశ్వఖ్యాతి లభించి సంవత్సరం గడిచింది. రామప్పలో రుద్రేశ్వరుడు పేరుతో శివుడు పూజలందుకుంటున్నాడు. క్రీ.శ.1213లో ప్రారంభమైన ఈ కట్టడాన్ని రేచర్లరుద్రుడు నిర్మించాడు. ఈ నిర్మాణానికి సుమారు 40ళ్లు పట్టినట్టు చరిత్ర చెబుతోంది. నక్షత్రాకార మండపంపై నిర్మితమైన ఈ రామప్ప గుడి.. నీటిపై తేలియాడే ఇటుకలతో గర్భాలయాన్ని నిర్మించారు. ఇక్కడ ఉప ఆలయాలతో పాటు, పెద్ద నంది విగ్రహమూ ఉంది. ఆ పక్కనే ఉన్న రామప్ప చెరువు, ఇతర తోటలు ఆ ప్రాంతానికి మరింత వన్నె తెస్తాయి. ఇక ఈ గుడిని ప్రధానంగా ఎర్ర ఇసుక రాయి (రెడిష్ శాండ్ స్టోన్)తో నిర్మించగా.. బయటి భాగాన్ని నల్లరాయితో కట్టారు. ఈ రాయి రంగు ఇప్పటికీ మారకపోవడం గమనార్హం. అంతేకాదు పునాది లేకుండా నేరుగా ఇసుకపై ఈ గుడి నిర్మితం కావడం మరో చెప్పుకోదగిన విషయం.
17వ శతాబ్దంలో ఎన్నో యుద్దాలు, దాడులను తట్టుకొని ఇప్పటికీ ఈ గుడి స్ట్రాంగ్ గా ఉంది. అయితే గుడి పరిధిలోని కొన్ని చిన్న నిర్మాణాలు మాత్రం దెబ్బతిన్నాయి. ప్రధాన ద్వారం కూడా కాస్త దెబ్బతిన్నది. రామప్ప గుడి నిర్మాణం సాంకేతికతను శాండ్ బాక్స్ టెక్నిక్ అంటారు. ఇది ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఎన్నో భూకంపాలను సైతం తట్టుకొని ఉంది. 1310లో అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక్ కఫూర్ దక్షిణ భారత దండయాత్రల్లో ఈ గుడి కొంచెం ధ్వంసం అయినట్టు నిపుణుల అంచనా. ఆ తర్వాత ఆధునిక కాలంలో గుప్త నిధులు కోసం మరికొంత ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది.
అద్భుత శిల్పకళ...
ఇక గర్భగుడి ముందుండే మండపంలో అద్భుత శిల్పకళను గమనించవచ్చు. పురాణ గాథలు, నాట్యగత్తెలు, సంగీత వాయిద్యకారులు, పౌరాణిక జంతువులు లాంటి శిల్పాలను గుడిపై చెక్కారు. స్తంభాల నుంచి పైకప్పు మధ్యలో ఉన్న నల్లరాతిలో చెక్కిన నాట్య భంగిమలు.. మండపం పైకప్పు లోపలి భాగంలో చెక్కిన సూక్ష్మ శిల్పాలు, బయటి గోడలపైనా, స్తంభాలపైనా ఉన్న వివిధ శిల్పాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. నల్ల, ఎర్ర ఇసుక ఇటుకల మేళవింపుతో ఈ గుడి నిర్మితమవడం వల్ల మరింత ప్రత్యేకంగా ఈ ఆలయం నిలుస్తోంది. సాధారణంగా ప్రతి గుడి నిర్మాణానికీ శాసనాలు ఉంటాయి. వాటిలో కొన్ని పాడవుతుంటాయి. అయితే ఈ గుడికి సంబంధించిన శాసనం అలా పాడవకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ఆ శాసనం కోసమే ఒక మండపం కట్టించడం విశేషం.
హెరిటేజ్ హోదా
రామప్ప దేవాలయానికి ఎన్నో ప్రయత్నాల తర్వాత ప్రపంచ హోదా దక్కింది. దీంతో తెలంగాణ పర్యాటక విభాగం కూడా ఈ గుడిని ప్రమోట్ చేస్తూ వస్తోంది. ప్రస్తుతం భారత పురావస్తు సర్వే వారి ఆధీనంలో ఈ గుడి ఉంది. ఇక్కడ ప్రతి రోజూ పూజలు జరుగుతుంటాయి. శివరాత్రికి ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదా కోసం 2014లో ఈ గుడిని నామినేట్ చేశారు. 2019లో భారత ప్రభుత్వం, వారసత్వ హోదా కోసం ఈ ఒక్క గుడిని మాత్రమే పంపింది. ఐక్యరాజ్య సమితి విభాగం అయిన యునెస్కో వారి వరల్డ్ హెరిటేజ్ కమిటీ 44వ సమావేశంలో ఈ గుడికి ప్రపంచం వారసత్వ కట్టడం హోదా ఇస్తూ తీర్మానించింది. వాస్తవానికి 2020వ సంవత్సరంలోనే జరగాల్సిన ఈ సమావేశం, కరోనావైరస్ వ్యాప్తి వల్ల వాయిదా పడి 2021లో జరిగింది.
రామప్పను కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకంలో చేర్చి రూ. 60 కోట్లతో అభివృద్ధి చేపట్టేందుకు ప్రణాళికలు చేస్తున్నట్టు సమాచారం. రామప్ప సన్నిధిలో యోగా డే, ప్రపంచ వారసత్వ వారోత్సవాలను కూడా నిర్వహించారు. హెరిటేజ్ హోదా ప్రకటించిన అనంతరం.. యునెస్కో కొన్ని షరతులు విధించింది. వాటిని 2022 నాటికి పూర్తిచేయాలని సూచించింది. అందులో ముఖ్యమైనది కామేశ్వర ఆలయం పునర్నిర్మాణం, ఉపాలయాల పునరుద్ధరణ, అంతర్జాతీయ స్థాయిలో వసతుల కల్పన. ఇవన్నీ మరో ఐదు నెలల్లో పూర్తి చేయాలి.