ఇజ్రాయెల్ -హమాస్ యుద్ధానికి ఏడాది

ఇజ్రాయెల్ -హమాస్ యుద్ధానికి ఏడాది

జెరూసలెం/గాజా:అక్టోబర్ 7, 2023. వేలాది మంది హమాస్ మిలిటెంట్లు ఒక్కసారిగా ఇజ్రాయెల్​పై దాడికి తెగబడి మారణహోమం సృష్టించిన రోజు ఇది. పారాచూట్లలో దిగుతూ, బైకులు, వెహికల్స్​పై దూసుకెళ్తూ ఇజ్రాయెల్ భూభాగంలో ఊచకోతకు పాల్పడ్డ రోజు.. ఆ రోజు1200 మంది పౌరులను హతమార్చిన హమాస్ మిలిటెంట్లు.. 250 మందిని బందీలుగా పట్టుకుని విజయగర్వంతో గాజాకు చేరుకున్నారు. 

కానీ.. ఏడాది గడిచాక గాజా నేలమట్టం అయిపోయింది. ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల్లో 42 వేల మంది పాలస్తీనియన్లు బలైయ్యారు. వేలాది మంది హమాస్ మిలిటెంట్లు అంతం కాగా.. భవనాలు నేలమట్టం అయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.

 ఇజ్రాయెల్, హమాస్ మధ్య మొదలైన ఈ పోరాటం ఇప్పుడు ప్రాంతీయ యుద్ధంగా మారిపోయింది. హమాస్​కు మద్దతుగా లెబనాన్ నుంచి హెజ్బొల్లా, యెమెన్ నుంచి హౌతీ మిలిటెంట్లు కూడా ఇజ్రాయెల్​పై దాడులు చేస్తూ వచ్చారు. 

ఈ గ్రూపులకు ఇరాన్ అండగా ఉంటూ వచ్చింది. దీంతో హెజ్బొల్లాపైనా ఇజ్రాయెల్ గురిపెట్టింది. లెబనాన్​లో బాంబుల వర్షం కురిపిస్తోంది. బీరుట్​తో పాటు టెహ్రాన్​లోనూ హెజ్బొల్లా, హమాస్ కీలక నేతలను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. దీంతో ఇటీవల ఇజ్రాయెల్​పైకి ఇరాన్ భారీ ఎత్తున మిసైళ్లు ప్రయోగించింది. ప్రతీకారంగా భారీ దాడులకు ఇజ్రాయెల్ వ్యూహం పన్నుతున్నట్టు తెలుస్తోంది.