ఇక నుంచి మా కంపెనీ టీవీలను ఇండియాలో అమ్మం.. ఇప్పటి వరకు తయారు చేసి.. మార్కెట్ లో ఉన్న టీవీలను మాత్రమే విక్రయిస్తాం.. ఇక నుంచి కొత్తగా ఇండియాలో టీవీలను తయారు చేయం.. ఇండియా వాళ్లకు అమ్మం.. మేం ఇండియన్ మార్కెట్ లోని టీవీ వ్యాపారం నుంచి తప్పుకుంటున్నాం.. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు.. టాప్ బ్రాండ్ కంపెనీలు అయిన వన్ ప్లస్, రియల్ మీ... అవును.. ఈ రెండు కంపెనీలు టీవీ మార్కెట్ నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకు, ఏమిటీ.. కారణాలు ఏంటీ అనేది ఆ రెండు కంపెనీలు అధికారికంగా ప్రకటించకపోయినా.. దీనికి సంబంధించిన వార్తలు మాత్రం జాతీయ మీడియాలో వస్తున్నాయి.
భారతదేశంలో స్మార్ట్ టీవీ మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతుంది. ఈ క్రమంలోనే చాలా మొబైల్ కంపెనీలు.. టీవీ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఇందులో రియల్ మీ ఒకటి.. 10 వేల రూపాయలకే స్మార్ట్ టీవీ అంటూ స్టార్టింగ్ లో ప్రకటించి సంచలనం రేపింది. ఆ తర్వాత ప్రీమియం బ్రాండెండ్ సెల్ ఫోన్ల తయారీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వన్ ప్లస్ కంపెనీ సైతం స్మార్ట్ టీవీ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. సెల్ ఫోన్ మార్కెట్ లోనూ హవా కొనసాగిస్తున్న ఈ రెండు కంపెనీలు.. టీవీ మార్కెట్ లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి అనేది మార్గెట్ వర్గాల విశ్లేషణ.
రోజురోజుకు స్మార్ట్ టీవీ మార్కెట్ లో పోటీ తీవ్రంగా ఉండటం.. చాలా కంపెనీల రాకతో.. వన్ ప్లస్, రియల్ మీ టీవీల సేల్స్ తగ్గాయి అనేది మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. శాంసంగ్, ఎల్జీ, సోనీ, టీసీఎల్, యూవీ వంటి కంపెనీల నుంచి గట్టి పోటీ ఉండటంతో.. కొన్నాళ్లుగా వీటి సేల్స్ తగ్గినట్లు బిజినెస్ అనలిస్టుల మాట. ఈ క్రమంలోనే మొబైల్ మార్కెట్ కంపెనీపై మరింత దృష్టి పెట్టే విధంగా.. టీవీ రంగం నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే ఇప్పటికే వన్ ప్లస్, రియల్ మీ టీవీలు కొనుగోలు చేసిన కస్టమర్లకు సర్వీస్ ఎలా అందిస్తారు.. మరో కంపెనీతో టై అప్ అవుతారా లేదా.. టీవీ స్పేర్ పార్ట్స్ విషయం ఏంటీ.. అనే విషయాలపై ఆ రెండు కంపెనీలు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. రాబోయే కొన్ని రోజుల్లోనే వన్ ప్లస్, రియల్ మీ టీవీలు అనేది మార్కెట్ నుంచి అదృశ్యం కావటం ఖాయంగా కనిపిస్తుంది.