కొన్న ఐదు రోజుల‌కే పేలిన వ‌న్ ప్ల‌స్ నార్డ్ 2 ఫోన్

కొన్న ఐదు రోజుల‌కే పేలిన వ‌న్ ప్ల‌స్ నార్డ్ 2 ఫోన్

బెంగ‌ళూరు: ఇండియాలో కొత్త‌గా రిలీజ్ అయిన వ‌న్ ప్ల‌స్ నార్డ్ 2 ఫోన్ అంత‌లోనే ఓ యూజ‌ర్ దగ్గ‌ర పేలింది. జులై చివ‌రి వారంలో రిలీజ్ అయిన ఈ 5జీ ఫోన్‌ను బెంగ‌ళూరుకు చెందిన అంకూర్ శ‌ర్మ భార్య ఐదు రోజుల క్రిత‌మే కొనుగోలు చేసింది. అయితే ఆదివారం ఉద‌యం ఆమె బ‌య‌ట‌కు వెళ్లిన స‌మ‌యంలో త‌న హ్యాండ్ బ్యాగ్‌లో ఫోన్ పేలింది. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా వ‌న్ ప్ల‌స్ క‌స్ట‌మ‌ర్ స‌పోర్ట్‌కు రిపోర్ట్ చేశాడు. త‌న భార్య ఆదివారం ఉద‌యం సైక్లింగ్ చేస్తూ వ‌న్ ప్ల‌స్ నార్డ్ 2 ఫోన్‌ను హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుని వెళ్లింద‌ని, ఆ స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి పేలుడు శ‌బ్ధం రావ‌డం వ‌ల్ల‌ ఉలిక్కిప‌డ‌డంతో ఆమెకు యాక్సిడెంట్ అయింద‌ని అంకూర్ తెలిపాడు. వెంట‌నే తేరుకున్న ఆమె త‌న బ్యాగ్‌లో నుంచి పొగ‌లు రావ‌డం చూసి షాక్ అయింద‌ని పేర్కొంటూ.. పేలిన ఫోన్‌కు సంబంధించిన ఫొటోలను అత‌డు ట్వీట్ చేశాడు.

స్పందించిన వ‌న్ ప్ల‌స్

వ‌న్ ప్ల‌స్ క‌స్ట‌మ‌ర్ స‌పోర్ట్ వాళ్లు అంకూర్ చేసిన ట్వీట్‌కు స్పందించారు. దీనిపై డైరెక్ట్ మెసేజ్ చేయాల్సిందిగా సూచించారు. అయితే ప్ర‌స్తుతం ఆ ఫోన్ పేలుడుకు సంబంధించి బాధితుడికి ఏమైనా ప‌రిహారం ఇచ్చారా లేదా తెలియాల్సి ఉంది. వ‌న్ ప్ల‌స్ కంపెనీ క‌స్ట‌మ‌ర్ స‌పోర్ట్ సిబ్బంది ఆ ఫోన్‌ను తీసుకుని అది త‌యారీ లోపం వ‌ల్ల పేలిందా లేక వాడ‌కంలో తేడా వ‌ల్ల పేలిందా అన్న దానిపై ఎంక్వైరీ కోసం పంపిన‌ట్లు ఆ కంపెనీ వ‌ర్గాల ద్వారా తెలిసింది.

2019లో తొలిసారి పేలుడు

వ‌న్ ప్ల‌స్ నార్డ్ 2 ఫోన్‌ను ఆ కంపెనీ గ‌త నెల‌లో లాంచ్ చేసింది. దీనిని ఇండియాలో జులై చివ‌రి వారంలోనే సేల్‌కు పెట్టింది. ఈ ఫోన్ 4500 ఎంఏహెచ్ బ్యాట‌రీతో ఉంటుంది. 2019 జులైలో తొలిసారి వ‌న్ ప్ల‌స్ స్మార్ట్ ఫోన్ పేలింది. అయితే ఈ చైనా కంపెనీ ఆ స‌మ‌యంలోనూ సేమ్ ఇదే ర‌క‌మైన స్టేట్‌మెంట్ ఇచ్చింది.