వరద సాయం కోసం కొనసాగుతున్న ఆందోళనలు

వరద సాయం కోసం కొనసాగుతున్న ఆందోళనలు

ఉన్నోళ్లకు ఇచ్చి.. గరీబోళ్లను వదిలేస్తరా?

సిటీలో పలు చోట్ల ఆందోళనలతో దిగొచ్చిన సర్కార్

బాధితులకు నేటి నుంచి సాయం పంపిణీకి నిర్ణయం

హైదరాబాద్​,వెలుగు:సాయం కోసం వరద బాధితుల ఇంకా రోడ్డెక్కుతున్నారు.  ఆదివారం కూడా ఆందోళనలు కంటిన్యూ అయ్యాయి. జీహెచ్​ఎంసీ ఆఫీసు ఎదుట, రోడ్లపై కూర్చొని అధికారులు, టీఆర్​ఎస్​ నేతలపై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బస్తీలకు ఎలా వస్తారో చూస్తామని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఉన్నోళ్లకే డబ్బులు పంచి గరీబోళ్లను వదిలేశారని ఆరోపించారు.  రోజురోజుకు బాధితుల ఆందోళనలు మరింత ఎక్కువవుతుండడంతో సర్కార్​ దిగొచ్చింది. ఆదివారం సీఎస్​ సోమేష్​కుమార్​ బల్దియా కమిషనర్​తో సమీక్షా సమావేశం నిర్వహించారు. వరద బాధితుల ఇంటి వద్దకే వెళ్లి సాయం అందించాలని నిర్ణయించారు. బాధితులను గుర్తించడంలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని ఆదేశించారు. సోమవారం నుంచి తిరిగి బాధితులకు రూ.10వేల ఆర్థిక సాయం పంపిణీ చేస్తారు.

3 లక్షల 87 వేల మందికే పంపిణీ

రెండు వారాలుగా  వరద సాయం అందజేస్తుండగా ఇప్పటివరకు 3,87, 900 కుటుంబాలకు రూ.387.90కోట్లు అందించారు. ఇంకా 2 లక్షల మంది ఉన్నట్లు జీహెచ్​ఎంసీ అధికారులు అంచనా వేసినా, అంతకు రెట్టింపుగానే ఉన్నారు. తక్షణసాయం కింద ప్రభుత్వం రూ.550కోట్లు రిలీజ్​చేసింది. బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండటం, ఇప్పటికే అనర్హుల చేతికి డబ్బులు పోవడంతో ఈ నిధులు సరేపోయేలా లేవు. అనర్హులకు సాయం అందడంతో అర్హులైన బాధితులు  రోడ్డెక్కారు.

ఆధార్​ కార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన 

నిజమైన వరద బాధితులకు ఆర్థిక సహాయం అందలేదని ముషీరాబాద్ నియోజకవర్గం బీజేపీ జాయింట్ కన్వీనర్ ఎం. నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో  పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.  బాపూజినగర్ ,భరత్ నగర్, మోరాంబోండా, జాంభవినగర్ , మోహన్​ నగర్ తదితర ప్రాంతాల బాధితులు ర్యాలీగా వచ్చి జీహెచ్​ఎంసీ వార్డు ఆఫీస్​ వద్ద ధర్నాకు దిగారు. సాయం అందలేదని మహిళలు ఆధార్ కార్డులను ప్రదర్శిస్తూ  కార్పొరేటర్​,అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిజమైన వరద ముంపు బాధితులకు ఆర్థిక సాయం అందలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.  టీఆర్ఎస్​ కార్యకర్తలకు మాత్రమే సాయం అందించారని మండిపడ్డారు.