- ఈస్ట్ ఆసియాన్ సమ్మిట్‌లో ప్రధాని స్పీచ్
వియంటియాన్ (లావోస్): యుద్ధాలతో దేశాల మధ్య ఉన్న సమస్యలకు పరిష్కారం లభించదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. చర్చలు, దౌత్య విధానాల ద్వారా మాత్రమే సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. గ్లోబల్ సౌత్ దేశాలపై అత్యంత ప్రతికూల ప్రభావాలు చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా.. లావోస్‌లో శుక్రవారం జరిగిన 19వ ఈస్ట్ ఆసియా సమ్మిట్‌లో మోదీ మాట్లాడారు. యురేషియా, వెస్ట్ ఆసియా దేశాల్లో వీలైనంత త్వరగా శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించాలని కోరారు.
‘‘యుద్ధాలతో ఏమీ సాధించలేం.. దేశాల మధ్య ఎలాంటి సమస్యలు ఉన్నా.. వాటిని చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి. దక్షిణ చైనా సముద్రంలో శాంతి, భద్రతలనేవి ఇండో పసిఫిక్ ప్రాంత ప్రయోజనాల కోసమే అన్నది గుర్తు పెట్టుకోవాలి. సముద్ర మార్గంలో వాణిజ్యానికి ఏ అడ్డూ లేకుండా ఉండేందుకు అన్ని దేశాలు ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాలను పాటించాలి. ప్రాంతీయ దేశాల విదేశీ విధానాలపై ఆంక్షలు విధించకూడదు. మా దృష్టి అంతా అభివృద్ధిపైనే ఉంటుంది.. విస్తరణవాదంపై కాదు..’’అని చైనాను ఉద్దేశిస్తూ పరోక్షంగా ప్రధాని మోదీ చురకలు అంటించారు.
శాంతి స్థాపనకు ఎప్పుడూ సహకరిస్తం
‘‘నేను బుద్ధుడి బోధనలను అనుసరించే దేశం నుంచి వచ్చాను. ఇది యుద్ధాల యుగం కాదు. యుద్ధంతో సమస్యలకు పరిష్కారాలు లభించవు. ప్రతి దేశం ఇతర దేశాల సార్వభౌమత్వం, సరిహద్దులు, అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలి. సమస్యలు వస్తే దౌత్య విధానాలతో, మానవీయ కోణంలో చర్చలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
శాంతి స్థాపన కోసం ఇండియా ఎప్పుడూ తన సహకారం అందిస్తూనే ఉంటుంది. ఇండో పసిఫిక్ దేశాలు అభివృద్ధి, సంక్షేమం కోసం నియమాలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది. గ్లోబల్ పీస్‌కు టెర్రరిజం పెద్ద సవాల్ గా మారింది. ప్రపంచ దేశాలన్నీ మానవత్వం కోసం కలిసి వస్తే.. టెర్రరిజాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు’’అని ప్రధాని అన్నారు.
‘విశ్వబంధు’గా బాధ్యతలు నిర్వర్తిస్తం
‘విశ్వ బంధు’గా ఇండియా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఎప్పుడూ ముందుంటదని మోదీ అన్నారు. నలందలో నిర్వహించనున్న ‘హయ్యర్ ఎడ్యుకేషన్ కాన్క్లేవ్లో’ పాల్గొనాల్సిందిగా ఆయా దేశాలను ఆహ్వానించారు. సమిట్ లో భాగంగా థాయిలాండ్ ప్రధాని పీటోంగ్‌టార్న్ షినవత్రా, కెనడా ప్రధాని ట్రూడో, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తో మోదీ భేటీ అయ్యారు. తర్వాత శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరారు.