రసవత్తరంగా నిజామాబాద్ డీసీసీబీ .. అవిశ్వాస రాజకీయం

రసవత్తరంగా నిజామాబాద్ డీసీసీబీ .. అవిశ్వాస రాజకీయం
  • పోటాపోటీగా క్యాంపులు
  • హైదరాబాద్​ నుంచి గోవా తరలిన వైస్ చైర్మన్​ రమేశ్​రెడ్డి గ్రూప్​
  • మద్దతిచ్చే డైరెక్టర్లతో భాస్కర్​రెడ్డి సీక్రెట్​ క్యాంప్​ 
  • నంబర్ గేమ్​లో పై చేయికి ఎత్తులు
  • ఈ నెల 21న నోకాన్ఫిడెన్స్​ మీటింగ్​కు అధికారుల ఏర్పాట్లు

నిజామాబాద్​, వెలుగు: డీసీసీబీ చైర్మన్​ పోచారం భాస్కర్​రెడ్డికి వ్యతిరేకంగా కొనసాగుతున్న అవిశ్వాస రాజకీయాలు హీటెక్కాయి. ఆయన్ను గద్దెదింపేందుకు అవసరమైన డైరెక్టర్లతో వైస్ చైర్మన్​ రమేశ్​ ​రెడ్డి క్యాంప్​లు మారుస్తుండగా, చైర్మన్​ భాస్కర్​రెడ్డి సైతం తన మద్దతు డైరెక్టర్లతో రహస్యంగా క్యాంప్​ నిర్వహిస్తున్నారు. పదవి నుంచి దింపాలనే పంతంతో ఒక వర్గం, అవిశ్వాసం వీగిపోయేలా చేయాలని మరో వర్గం పట్టుదలతో ఉన్నారు. మరోపక్క ఈ నెల 21న నోకాన్ఫిడెన్స్​ మీటింగ్​ ఏర్పాటుకు ఆఫీసర్లు రెడీ అయ్యారు.  

డైరెక్టర్లను లాక్కునేందుకు వేట..

గత బీఆర్​ఎస్ గవర్నమెంట్​లో స్పీకర్​గా పనిచేసిన పోచారం శ్రీనివాస్​రెడ్డి తన పలుకుబడితో కొడుకు భాస్కర్​రెడ్డికి డీసీసీబీ చైర్మన్​ పదవి ఇప్పించారు. భాస్కర్​ రెడ్డి తీరుపై మెజార్టీ డైరెక్టర్లు మొదటి నుంచి గుస్సాగా ఉన్నారు. తనకు దక్కాల్సిన పదవిని ఎగరేసుకుపోయాడన్న కోపంతో ఉన్న వైస్​ చైర్మన్​ కుంట రమేశ్​​రెడ్డి సరైన టైం కోసం ఎదురుచూశారు.

రాష్ట్రంలో అధికారం మారడంతో పరిస్థితులు అనుగుణంగా ఉన్నాయని అంచనా వేసిన రమేశ్​రెడ్డి, చైర్మన్​పై అవిశ్వాసానికి అవసరమైన మద్దతు కూడగట్టారు. ఈనెల 5న 14 మంది డైరెక్టర్లు డీసీవో శ్రీనివాస్​కు అవిశ్వాస లేఖ ఇచ్చారు. డైరెక్టర్లు వెంటనే క్యాంపునకు తరలించారు. ప్రత్యర్థులకు జాడ తెలవొద్దనే ఉద్దేశంతో గడిచిన వారం రోజుల పాటు హైదరాబాద్​లో కొనసాగిన శిబిరాన్ని తాజాగా గోవాకు మార్చారు.

కుటుంబ సభ్యులతో తప్పా, బయటి వారికి ఫోన్లలో మాట్లాడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైస్​ చైర్మన్​ క్యాంప్​లోని ఒక్క డైరెక్టర్​ను లాక్కున్నా అవిశ్వాసం వీగిపోయే ఛాన్స్​ఉండడంతో చైర్మన్​ భాస్కర్​రెడ్డి తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఓ వైపు తన మద్దతుదారులతో క్యాంప్​ నిర్వహిస్తూనే, ప్రత్యర్థి క్యాంప్​ సభ్యుల జాడను కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు.

2/3 ఓట్ల గేమ్​

డీసీసీబీలో మొత్తం 25 మంది డైరెక్టర్లు ఉండగా వారిలో సింగిల్​ విండోలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 20 మందికి మాత్రమే ఓటు హక్కు ఉంది. నిబంధనల ప్రకారం ఓటు ఉన్న మొత్తం డైరెక్టర్లలో సగం కంటే ఎక్కువ అంటే 11 మంది కోరం అటెండ్​ అయితేనే నోకాన్ఫిడెన్స్​ మీటింగ్​ నిర్వహిస్తారు. లేకుంటే అవిశ్వాసం వీగిపోతుంది. అయితే అవిశ్వాసానికి మద్దతుగా 2/3 మెజార్టీ అంటే 14 మంది ఓటేస్తేనే అవిశ్వాసం నెగ్గుతుంది. నోకాన్ఫిడెన్స్​ లెటర్​పై సంతకాలు చేసిన 14 మంది డైరెక్టర్లు క్యాంపులో ఉన్నారు.

వైస్​ చైర్మన్​ శిబిరంలోని ఒక్క డైరెక్టర్​ను తన వైపు లాక్కున్నా అవతలి వైపు బలం 13కు తగ్గి నోకాన్ఫిడెన్స్​ వీగిపోతుంది. ఆ దిశగా భాస్కర్​రెడ్డి ముమ్మర ప్రయత్నాలు చేస్తుండగా, అతడికి ఎవరూ చిక్కకుండా వైస్​ చైర్మన్​ రమేశ్​​రెడ్డి పావులు కదుపుతున్నారు. ఒకసారి ప్రతిపాదించిన అవిశ్వాసం వీగిపోతే మరో ఏడాది వరకు అవిశ్వాసం ప్రతిపాదించే అవకాశం ఉండదు. ప్రస్తుత పాలకవర్గ పదవీకాలం వచ్చే ఫిబ్రవరి దాకా ఉంది. కాబట్టి బయటపడాలనే వ్యూహంతో భాస్కర్​రెడ్డి ఉన్నారు. 

 రెండువైపులా రాజీనామా చర్చ

మెజార్టీ డైరెక్టర్ల సంతకాలతో అవిశ్వాస తీర్మానానికి లెటర్ ఇచ్చాక పోచారం భాస్కర్​రెడ్డి తన చైర్మన్ పదవికి రిజైన్ చేస్తారని వైస్ చైర్మన్ రమేశ్​రెడ్డి మద్దతుదారులు భావించారు. బీఆర్ఎస్​నుంచి జహీరాబాద్ ఎంపీ టికెట్​వస్తే నోకాన్ఫిడెన్స్ మీటింగ్​కు ముందే తన పదవికి రాజీనామా చేయాలని భాస్కర్​రెడ్డి ప్లాన్​వేశారు. పై రెండు జరగనందున ఉత్కంఠ కొనసాగుతోంది.