
- ఇప్పటివరకు 173 మీటర్ల మేర శిథిలాల తొలగింపు
- ఇక మిగిలింది 80 మీటర్లే.. ఇక్కడే ఆరుగురి ఆచూకీ కోసం ప్రయత్నం
- ఇది దాటితే షియర్ జోన్ ప్రారంభం.. అక్కడ రెస్క్యూకు నో చాన్స్
- ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనున్న ఆఫీసర్లు
నాగర్‌కర్నూల్, వెలుగు : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది. ప్రమాదం జరిగిన రోజు నుంచి ఇప్పటివరకు సుమారు 173 మీటర్ల మేర శిథిలాలను తొలగించగా ఇద్దరి డెడ్‌బాడీలు దొరికాయి. మిగతా ఆరుగురి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కన్వేయర్ బెల్ట్ నుంచి 253 మీటర్ల మేరకు మట్టి, రాళ్లు, ఇతర శిథిలాలు పేరుకుపోయాయి. దీంతో రెస్క్యూ సిబ్బంది ఇప్పటివరకు 173 మీటర్ల మేరకు శిథిలాలను తొలగించారు. ఇక మిగిలిన 80 మీటర్ల దూరం ప్రస్తుతం కీలకంగా మారింది. ఈ ప్రాంతంలో మిగతా ఆరుగురి ఆచూకీ దొరకకపోతే ఇక ఆశల వదులుకోవాల్సిందేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అక్కడ ‘నో’ రెస్క్యూ ఆపరేషన్
టన్నెల్‌లో ప్రమాదం జరిగిన తర్వాత ఫేస్ భాగం నుంచి 43 మీటర్ల దూరంలో డీ1 పాయింట్, అక్కడి నుంచి 20 మీటర్ల దూరంలో డీ2 పాయింట్‌గా నిర్ధారించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన సిమెంట్ సెగ్మెంట్లలో ఒకటి ఊడి కిందపడగా, మరొకటి వంగిపోయినట్లు తెలుస్తోంది. ఇక్కడ పైనుంచ నీటి ఊట వస్తోంది. సిమెంట్ సెగ్మెంట్ లేని ప్రాంతంలో మట్టి, రాళ్లు ఊడిపడే ప్రమాదం ఉందన్న కారణంతో దానిని నో ఆపరేషన్ జోన్‌గా ప్రకటించారు.
డీ2 పాయింట్ నుంచి మట్టి, రాళ్లు జారిపడకుండా స్టీల్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మిగిలి ఉన్న 80 మీటర్ల మేర మట్టి, రాళ్లు, శిథిలాలను మరో మూడు రోజుల్లో తొలగిస్తామని, ఆ తర్వాత పరిస్థితిని ప్రభుత్వానికి వివరిస్తామని ఆఫీసర్లు అంటున్నారు.
ఆ రిపోర్టులే కీలకం
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనుల కొనసాగింపు మూడు జాతీయ సంస్థలు ఇచ్చే రిపోర్ట్‌లపైనే ఆధారపడి ఉందని తెలుస్తోంది. అటవీల ప్రాంతంలోని జలపాతాలు, వాగులు, వర్షం నీరు ప్రవహించే దారులను ఎన్‌జీఆర్‌ఐ, జీఎస్‌ఐ, సిస్మాలజీ, నేషనల్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ రాక్ సంస్థలు అధ్యయనం చేయనున్నాయి. అవి ఇచ్చిన రిపోర్ట్‌ల ఆధారంగానే పనులు కొనసాగనున్నాయి. ప్రస్తుతం ప్రమాదంలో టీబీఎం పూర్తిగా ధ్వంసం అయింది. కొత్త టీబీఎంకు ఆర్డర్ ఇచ్చినా అది రావడానికి రెండేండ్లు పడుతుందని సమాచారం.
ఈ నేపథ్యంలో టన్నెల్‌లో 13.500 కిలోమీటర్ల వద్ద పనులను క్లోజ్ చేసి ఇరువైపులా 5 మీటర్ల డయాతో సొరంగాలు తవ్వి 500 మీటర్ల అవతల ఔట్‌లెట్‌కు కనెక్ట్ చేయడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఐదు మీటర్ల వ్యాసార్థంలో రెండు సొరంగాలు తవ్వాలన్నా టీబీఎం అవసరమే. వాటిని తయారు చేయడానికి ఎంత కాలం పడుతుందోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.