తిరుమల స్వామివారి సర్వ దర్శనానికి 48 గంటల సమయం

తిరుమల స్వామివారి సర్వ దర్శనానికి 48 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సప్తగిరులు శ్రీవారి భక్తులతో నిండిపోయాయి. స్వామివారి సర్వ దర్శనానికి 48 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. పెరటాసి మాసం కావడంతో భక్తుల రద్దీ పెరిగినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పెరటాసి మాసం మూడో శనివారం కావడంతో తమిళ భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. భక్తుల గోవింద నామ స్మరణతో తిరుమల మార్మోగుతోంది. వరుస సెలవులు, పెరటాసి మాసంతో పాటు వీకెండ్ కూడా కావడంతో స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. 

వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లతో పాటు, నారయణ గిరి ఉద్యానవనంలోని షెడ్లన్ని భక్తులతో నిండి పోయాయి. గోగర్భం డ్యాం క్యూలైన్స్ వరకు భక్తులు నిండిపోయారు. టీటీడీ యాత్ర సదన్, కల్యాణ కట్ట, అన్నదాన సత్రం, లడ్డూ వితరణ కేంద్రంతో పాటు ఇతర యాత్రా ప్రదేశాలన్ని భక్తులతో కిటికిటలాడుతున్నాయి. వేలాది సంఖ్యలో భక్తులు వివిధ మార్గాల నుంచి కొండకు చేరుకుంటున్నారు.

భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేస్తోంది టీటీడీ. భక్తులకు అల్పాహారం, తాగునీటిని అందిస్తోంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఇవాళ, రేపు సిఫార్సు లేఖలను రద్దు చేసింది టీటీడీ. రద్దీని దృష్టిలో పెట్టుకొని తిరుమలకు వచ్చేలా భక్తులు ప్లాన్ చేసుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.