- 84 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేసే పనిలో బల్దియా
- ప్రజాపాలన’ దరఖాస్తుల పరిశీలిన
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ లో ఇందిరమ్మ ఇండ్ల సర్వే షురూ అయింది. కుటుంబ సర్వే పూర్తికాగానే ఈ సర్వే మొదలైంది. సర్వే బాధ్యతలను బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు, కమ్యూనిటీ ఆర్గనైజర్లకు అప్పగించారు. వీరికి ప్రత్యేకంగా లాగిన్ ఐడీలు ఇచ్చి సర్వే చేయిస్తున్నారు. కొన్నిప్రాంతాల్లో మంగళవారం ఇండ్ల సర్వే ప్రారంభం కాగా, ఇంకొన్నిచోట్ల బుధవారం మొదలుపెట్టారు. ఇంకొందరికి లాగిన్ ఐడీ అందాల్సి ఉంది. లాగిన్ ఐడీలు అందరికి వచ్చిన తరువాత సర్వే స్పీడప్ కానుంది.
ప్రభుత్వం రూపొందించిన ఇందిరమ్మ ఇండ్ల యాప్ లో సర్వే వివరాలను పొందపర్చుతున్నారు. సర్వేలో భాగంగా దరఖాస్తులు దారులు ఇక్కడే ఉంటున్నారా? అన్నది అడిగి దరఖాస్తుదారుడి ఫొటో తీసి యాప్ లో అప్ లోడ్ చేస్తున్నారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా సర్వే జరుగుతోంది. గ్రేటర్ లో మొత్తం 10 లక్షల70 వేల దరఖాస్తులు వచ్చాయి. ఈ సర్వే తరువాత లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. గ్రేటర్ లో 24 నియోజకవర్గాలు ఉండగా, ఇందులో నియోజకవర్గానికి 3,500 మందిని ఎంపిక కానున్నారు. మొదటి విడతలో గ్రేటర్ పరిధిలో 84 వేల మంది లబ్ధదారులను ఎంపిక చేయనున్నారు. నెలరోజులపాటు సర్వే జరగనుంది.
పద్మారావునగర్: బన్సీలాల్ పేట డివిజన్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ సూపరింటెండెంట్ఇంజనీర్ వెంకటదాస్‌రెడ్డి గురువారం పరిశీలించారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ఇండ్లు అందజేస్తామన్నారు. బన్సీలాల్‌పేట డివిజన్‌నుంచి 9,200 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఆయనతో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, ఏఎంసీ కిరణ్‌రెడ్డి, ఏఈ లలిత, నర్సరాజు, కార్పొరేటర్హేమలత పాల్గొన్నారు.