ఇలా పండిస్తే ఉల్లి సాగులో తిరుగు లేదు.. తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే

ఇలా పండిస్తే ఉల్లి సాగులో తిరుగు లేదు.. తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే

Onion Cultivation In Kharif Season: ఉల్లి గడ్డ... దీనిని ఉల్లిని పచ్చికూరగా, తినే పదార్ధాలకు రుచి కలిపించటానికి, గుండెజబ్బులకు, శరీరంలోని కొలెస్ట్రాలు తగ్గించటానికి, కంటికి, జ్ఞాపకశక్తికి, ఇంకా జీర్ణక్రియకు ఉపయోగిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో వాణిజ్య పరంగా సుమారు 50 వేల హెక్టర్ల విస్తీర్ణంలో సాగవుతూ, ఎకరానికి 14 నుంచి 17 టన్నుల సరాసరి దిగుబడినిస్తుంది. ఉల్లిని ఖరీఫ్, రబీ, వేసవి అన్ని కాలాల్లో సాగుచేస్తారు. ఖరీఫ్ లో ఉండే వాతావరణ ఆటుపోట్లు, వర్షాల ప్రభావం వల్ల పాయలు దుంపకుళ్లు బారిన పడటం, నిల్వలో కుళ్ళటం, మొలకలు రావటం వంటి సమస్యలు తలెత్తుతాయి. దీన్ని అధిగమించి ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో ఉల్లి నుంచి నాణ్యమైన అధిక దిగుబడులు పొందటానికి సాగులో చేపట్టాల్సిన శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు తెలుసుకుందాం.


విత్తే సమయం: సాధారణంగా ఖరీఫ్ లో ఆగష్టు లో నాటుకుంటారు.  ఆగష్టు నెలలో నాటితేనే  మంచి దిగుబడులు వస్తాయి. అదే విధంగా వాతావరణంలో పెద్దగా మార్పులు లేకుంటే వీటి ఎదుగుదల బాగుంటుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. 

నేలలు: ఉల్లి సాగుకు నీరు నిలవని సారవంతమైన ఎర్ర నేలలు, మెరక నేలలు, అధిక సేంద్రీయ పదార్ధం గల ఇసుక నేలలు అనుకూలం. ఉప్పు, చౌడు నేలలు, క్షారత్వం, నీరు నిలువ ఉండే నేలలు పనికిరావు. ఉదజని సూచిక 6.5 నుంచి 7.5 ఉన్న నేలలు అనుకూలంగా ఉంటాయి.

రకాలు: ఉల్లి సాగులో నాణ్యమైన, ఖరీఫ్ సాగుకు అనువైన రకాల ఎంపిక చాలా అవసరం. తక్కువ పంట కాలం, ముదురు ఎరుపు రంగు కలిగిన రకాలను ఖరీఫ్ సాగుకు ఉపయోగిస్తారు.

ఉల్లి పంట...ఖరీఫ్ సాగుకు అనువైన రకాలు

బళ్ళారి రెడ్: పాయలు పెద్దగా ఉంటాయి. పాయలు ఒక్కటిగా లేదా రెండుగా కలిపి గాని ఉంటాయి. ఘాటు తక్కువ. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో సాగుకు అనుకూలం.

అగ్రి ఫౌండ్ డార్క్ రెడ్: పాయలు ముదురు ఎరుపు రంగులో గుండ్రంగా, తక్కువ ఘాటుతో ఉంటాయి. ఎక్కువ రోజులు నిల్వ చేయవచ్చు. పాయలు మధ్యస్ధంగా ఉండి, 70 నుంచి 90 గ్రా.బరువు ఉంటాయి. ఎకరాకు 100 నుంచి 120 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.

అర్క కళ్యాణ్: పాయలు 100 నుంచి 120 గ్రా. బరువుండి, ముదురు ఎరుపు రంగులో గుండ్రంగా ఉంటాయి. ఎకరాకు 140 నుంచి 160 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఆకు మచ్చ తెగులును కొద్దిగా తట్టుకుంటుంది. ఖరీఫ్ కు అనువైనది. పంట కాలం 140 నుంచి 160 రోజులు. పాయలు మధ్యస్ధంగా 5-6 సెం.మీ. సైజు ఉండి, 70 నుంచి 90 గ్రా.బరువుంటాయి.

యన్-53: పాయలు మధ్యస్ధంగా, ముదురు ఎరుపు రంగులో, గుండ్రంగా ఉంటాయి. ఎకరాకు 100 నుంచి120 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఖరీఫ్ కు అనువైనది.140 రోజుల్లో కోతకు వస్తుంది.

అగ్రిఫౌండ్ రోజ్: గుండ్రటి, చిన్న ఉల్లి రకం. టి.యస్.యస్ 15 నుంచి 16% గల పిక్లింగ్ రకం. ఎగుమతికి అనువైనది. కడప, కర్నాటకలో ఖరిఫ్ లొ సాగుకు అనువైనది.

ఇతర రకాలైన అగ్రి ఫౌండ్ లైట్ రెడ్, అర్క నికేతన్, అర్క ప్రగతి, కళ్యాణ్ పూర్ రెడ్ రౌండ్, నాసిక్ రెడ్, రాంపూర్ రెడ్ రకాలు కూడా అధిక దిగుబడినిస్తాయి.

విత్తన మోతాదు: ఎకరాకు సుమారుగా పొలంలో నేరుగా విత్తుకోవటానికి 3 నుంచి4 కిలోల విత్తనం, నారు పెంచి నాటుకోవడానికి 2 నుంచి 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. కానీ ఖరీఫ్ లో నేరుగా విత్తుకోవటం కన్నా...  నారు ప్రధాన పొలంలో నాటుకోవటం వల్ల తొలి దశల్లో ఉండే తెగుళ్ళు, కలుపు సమస్యను అధిగమించి మేలైన దిగుబడులను పొందవచ్చు.

నారు పెంపకం: నారు పెంపకానికి నీరు నిలువని, ఎత్తెన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న నేలను బాగా దున్ని, 120 సెం.మీ వెడల్పు, 1 మీ. పొడవు, 15 సెం.మీ ఎత్తు గల నారుమళ్ళను తయారు చేసుకోవాలి. రెండు మడుల మధ్య ఒక్క అడుగు దూరం ఉంచుకుంటే నారు మడుల మధ్య నడుస్తూ సస్య రక్షణ చర్యలు చేపట్టడానికి అనువుగా ఉంటుంది. ఒక్క ఎకరాలో నాటడానికి సుమారుగా (2 నుంచి 2.5 కిలోల విత్తనం, 10 నారుమళ్ళు), 200 నుంచి 250 చ.మీ. నారు మడిలో పెంచిన నారు సరిపోతుంది. 

రైతులు 50 శాతం నీడ నిచ్చే అగ్రిషేడ్ నెట్ల కింద నారు పెంచినట్లయితే మొలక శాతం, నారు నాణ్యత బాగుంటాయి. నారు మడులపై విత్తనం విత్తే ముందు మెదటగా కిలో విత్తనానికి 8 గ్రా. ట్రైకోడెర్మా విరిడితో తర్వాత 3 గ్రా. థైరమ్ లేదా కాప్టాన్ తో విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల చీడ పీడల నుంచి పైరును రక్షించుకోవచ్చు. నారుమడిలో విత్తనాన్ని పలుచగా 10 సెం.మీ.ఎడంగా వరుసల్లో 2 నుంచి 3 సెం.మీ. లోతులో విత్తుకొని ఎండు గడ్డితో కప్పాలి. మొలకెత్తిన తర్వాత ఎండు గడ్డిని తీసివేయాలి.

 నారు కుళ్ళు తెగులు సోకకుండా 10 రోజులకోకసారి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా./ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. నారు పెరుగుదల దశలో రసం పీల్చేపురుగలు ఆశించకుండా కార్బోఫ్యూరాన్ 3 జి. గుళికలు 1 చ.మీ. నారుమడికి 100 గ్రా.చొప్పున సన్నని ఇసుకతో కలిపి నారుమడిలో చల్లి నీరు కట్టాలి. ఇలా పెంచితే 40 నుంచి 45 రోజులకు ప్రధాన పొలంలో నాటడానికి అవసరమైన ఆరోగ్యవంతమైన నారు పొందవచ్చు.

నారు నాటడం: నారు నాటే ముందు ప్రధాన పొలాన్ని 2 నుంచి 3 సార్లు దుక్కిదున్ని, చదునుచేసుకోవాలి. నాటే ముందు నారును 1% బోర్డో మిశ్రమం ద్రావణంలో ముంచి నాటడం వల్ల నారుకుళ్ళు సోకకుండా వుంటుంది.

సాధారణంగా ఉల్లిని 3 పద్ధతుల్లో…  పద్ధతుల్లో నాటుకోవచ్చు.

1.ఎత్తుమడుల పద్ధతి: ఈ పద్ధతిలో 120 సెం.మీ వెడల్పు,15 సెం.మీ ఎత్తు, మడికి మడికి మధ్య 45 సెం.మీ ఉండేటట్లు ఎత్తుమడులు తయారు చేసుకోవాలి. వరుసల మధ్య 15 సెం.మీ, మొక్కల మధ్య 10 సెం.మీ ఎడం ఉండేలా నాటుకోవాలి. ఈ పద్ధతిలో మాత్రమే డ్రిప్ లేదా స్ప్రింక్లర్ ద్వార నీటిని అందిచటానికి వీలుగా ఉంటుంది. పాయలు బాగా ఊరుతాయి. గడ్డలు కుళ్ళి పోవడము ఉండదు.

2.బోదె సాళ్ళ పద్ధతి: 30 సెం.మీ ఎడం ఉండేటట్లు బోదెలు చేసుకొని ఇరువైపులా నాటుకోవాలి. గడ్డలు కుళ్ళి పోవడం తక్కువగా ఉంటుంది.

3.సమతల మడుల పద్ధతి: 2మీ. వెడల్పు గల మడులు చేసుకొని వరుసల మధ్య 15 సెం.మీ, మొక్కల మధ్య 10 సెం.మీ ఎడం ఉండేలా నాటుకోవాలి. గడ్డలు కుళ్ళి పోవడం సమస్య అధికంగా ఉంటుంది.

ఖరిఫ్ లో నాణ్యమైన అధిక దిగుబడులు పొందటానికి గాను ఎత్తుమడుల పద్ధతిలో డ్రిప్ లేదా స్ప్రింక్లర్ ఏర్పరచుకొని సాగు చేయడం ఉత్తమం.

ఎరువుల వాడకం: ఉల్లి ఎకరాకు 10 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువుతో పాటు 2నుంచి 3 టన్నుల వర్మికంపోస్ట్, 250 కిలోల వేపపిండి, 24-32 కిలోల భాస్వరం, 20 కిలోల సల్ఫర్ నిచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నాలి. ఎకరాకు 60  నుంచి 80 కిలోల నత్రజని, 24 కిలోల పోటాష్ నిచ్చే ఎరువులను రెండు సమపాళ్లుగా చేసుకొని నాటేటప్పుడు ఒక సారి, నాటిన 30 రోజులకు రెండో సారి వేసి నీటి తడివ్వాలి.

వీటితో పాటు జీవన ఎరువులైన అజోస్పెరిల్లమ్ లేదా అజటోబాక్టర్, ఫాస్పోబాక్టిరియాను ఎకరాకు 2 కిలోల చొప్పున వేసుకుంటే గడ్డ బాగా ఊరుతుంది. జీవన ఎరువుల వాడకం వల్ల రసాయనిక ఎరువులను 50 శాతం తగ్గించి వాడుకోవచ్చు. ఎకరాకు 2 కిలోల సూక్ష్మధాతువు మిశ్రమాన్ని నాటిన 60నుంచి  70 రోజులకు పిచికారి చేయాలి.

నీటి యాజమాన్యం: నారు నాటిన తర్వాత నుంచి నారు కుదురుకునేంత వరుకు వారానికి రెండు సార్లు తేలికపాటి నీటి తడులివ్వాలి. ఆ తర్వాత 60 రోజుల వరకు 12 నుంచి15 రోజుల వ్యవధితో 4 నుంచి 5 తడులివ్వాలి. గడ్డ ఊరే దశలో 6నుంచి 7 రోజుల వ్యవధితో 7, 8 తడులివ్వాలి. కోతకు 15 రోజుల ముందుగా నీరు పెట్టడం ఆపాలి. నాణ్యమైన దిగుబడుల కోసం బిందు సేద్యం అన్ని విధాలా మంచిది.

ఫెర్టిగేషన్: డ్రిప్ ద్వార ఎరువులు వేయదలచినప్పుడు ఎకరాకు 50 కిలోల నత్రజని, 20 కిలోల పోటాష్ నిచ్చే ఎరువులను 10 సమపాళ్లుగా చేసి 10 రోజుల వ్యవధితో అందించాలి.

కలుపు నివారణ: నారు నాటే ముందు ఎకరాకు పెండిమిథాలిన్ 1.25 లీ. లేదా ఆక్సీఫ్లోరోఫిన్ 200 మి.లీ. పిచికారి చేయాలి. నారు నాటిన 20 రోజులకు కైజలోపాప్ఇథైల్ 250 మి.లీ, 40 రోజులకు ప్రోపక్వైజోపాప్ 400 మి.లీ. పిచికారీ, 60 రోజులకు కలుపు తీసి మొదళ్ళకు మట్టిని ఎగదోయాలి.

నారు నాటిన 75 రోజుల తర్వాత మాలిక్ హైడ్రోజైడ్ 0.25% ద్రావణాన్ని చల్లడం వల్ల ఉల్లి గడ్డ మొలకెత్తటం వల్ల కలిగే నష్టాన్ని అరికట్టవచ్చు. నారు నాటిన 100 నుంచి  110 రోజులకు 1గ్రా. కార్బండిజమ్ లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేస్తే నిల్వలో ఉల్లి కుళ్ళటం చాలా వరకు తగ్గుతుంది.

సస్య రక్షణ:  తామర పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చటం వల్ల తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. మజ్జిగ చల్లినట్టుగా వుండడం వల్ల దీనిని మజ్జిగ తెగులు అని కూడా అంటారు. తెగులు ఉధృతమైతే ఆకుల కోసలు ఎండిపోతాయి. తామర పురుగుల నివారణకు డైమిథోయైట్ లేదా ఫిప్రోనిల్ 2 మి .లీ./ లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారి చేయాలి. పొలంలో అక్కడక్కడ పసుపు రంగు జిగురు అట్టలను ఎకరానికి 2 చొప్పున అమర్చితే రసం పిల్చే పురుగులు వీటికి అతుక్కొని చనిపోతాయి. పెరుగుదల దశలో ఉల్లి పైరు పై 5% వేపగింజల కషాయం మందు జాగ్రత్తగా పిచికారి చేయటం వల్ల తామర పురుగులును నియంత్రించవచ్చు.

ఆకుమచ్చ తెగులు: ఆకులపై ఊదారంగు మచ్చలు ఏర్పడి ఆకులు ఎండిపోతాయి. వాతావరణంలో తేమ ఎక్కువైనప్పుడు తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు మాంకోజేబ్ 3గ్రా. లేదా కార్బండిజిమ్ + మాంకోజేబ్ 2 గ్రా, క్లోరోథలోనిల్ 2.5గ్రా./ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పంటకోత, ఆరబెట్టటం: 50శాతం ఆకులు పొలంలో రాలిన తర్వాత గడ్డ తవ్వితే నిల్వ చేయడంలో కలిగే నష్టాన్ని అధిగమించి నాణ్యమైన ఉత్పతులు పొందవచ్చు.

క్యూరింగ్: గడ్డలు పీకిన తర్వాత పోలంలోనే వీటిని ముందుగా వరుసలో పేర్చుకోవాలి. అంటే మెదటి వరుస కాడల మీద రెండో వరుస గడ్డలు ఉండేటట్లు వరుసలో 3 నుంచి 4 రోజులు పొలం మీదే ఆరబెట్టాలి. దీనివల్ల ఆకుల్లోని పోషకాలు గడ్డలలోకి చేరుతాయి తర్వాత 2.5 సెం.మీ. కాడ ఉంచి ఉల్లి ఆకులను కోయాలి. దీని వల్ల కాడలోని గాఢత గడ్డలోకి చేరి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. తర్వాత 10 నుంచి 12 రోజులు నీడలో పల్చగా పోసి ఆరనివ్వాలి. దీనినే క్యూరింగ్ అంటారు. దీని వల్ల పొర రంగు అభివృద్ధి చెందుతుంది. ఖరీఫ్ కాలంలో బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండనందు వల్ల సూర్యరశ్మి ద్వార క్యూరింగ్ చేయవచ్చు.

గ్రేడింగ్, నిల్వ: ఉల్లి గడ్డలను సైజుల వారిగా గ్రేడింగ్ చేసి, మార్కెటింగ్ చేసుకున్నట్లయితే అధిక ధరను పొందవచ్చు. ధర తక్కువగా ఉన్న సమయాల్లో రైతులు గోదాముల్లో నిల్వ చేసుకోవచ్చు. పరిపక్వం గాని చిన్న చిన్న పాయలను ఎప్పుడూ నిల్వ ఉంచరాదు. సుమారుగా 4 నుంచి 6 సెం.మీ.సైజు కలిగిన మధ్యస్థ పాయలు మంచి నిల్వ గుణం కలిగి ఉంటాయి.

దిగుబడి: హెక్టారుకు 250 నుంచి  300 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. చిన్న ఉల్లి గడ్డలు అయితే 160  నుంచి 200 క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది.