
మనకు కూరగాయలు, ఉల్లిగడ్డలు కావాలంటే మార్కెట్‌కు వెళ్లాల్సిందే. అయితే ఇప్పుడు ఆ అవసరం లేకుండా పోయిందంటూన్నారు నిజామాబాద్ వాసులు. కారణం ఉల్లి రైతులే నేరుగా ఇంటీంటీకీ అమ్ముతుండటం. పండించిన ఉల్లిని మార్కెట్ యార్డుకి తీసుకెళ్తే సరైన ధరలు రావటం లేదని రైతులే నేరుగా ట్రాక్టర్లు, ఆటోల్లో తీసుకెళ్ళీ అమ్ముతున్నారు. ఉల్లి ధర ఎప్పుడు ఎలా వుంటుందో ఎవరికీ తెలియని పరిస్థితి. మొన్నటివరకు కిలో 50 నుంచి 80 రూపాయల వరకు పలికిన ఉల్లి ధర .. ఇప్పుడు అమాంతం పడిపోయింది. ఈసారి దిగుబడి బాగా రావడంతో లాభాలు వస్తాయని భావించిన రైతులకు నిరాశే మిగిలింది.
నిజామాబాద్ జిల్లాలో 18 వేల ఎకరాల్లో ఉల్లి పంట సాగవుతోంది.కూలీల రేట్లు కలుపుకొని ఎకరానికి 65 వేల వరకు పెట్టుబడి ఖర్చవుతోంది. ఎకరానికి 80 నుంచి 100 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. అయితే ఈసారి దిగుబడి పెరిగినా రేటు లేకపోవడంతో రైతులు దిగాలు పడ్డారు. 50 కిలోల బస్తా 1000 ధర పలుకుతుందని భావించారు రైతులు. కానీ పంట చేతికొచ్చే సమయానికి గుజరాత్, మహరాష్ట్ర, మద్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి జిల్లాకి పెద్ద ఎత్తున ఉల్లి దిగుమతి అయింది. దీంతో ఒక్కసారిగా రేటు పడిపోయింది. 50కిలోల ఉలిగడ్డల బస్తాకు ప్రస్తుతం మార్కెట్ లో 450 నుంచి 600 వరకు ధర పలుకుతోంది.
పల్లెల్లో రేటు లేకపోవడతో ఊళ్ళలోంచి ట్రాక్టర్ల మీద ఉల్లి పంటను పట్టాణాలకు తెచ్చి అమ్ముకుంటూన్నారు రైతులు. నిజామాబాద్ రూరల్, మోపాల్, డిచ్పల్లి, మాక్లూర్, మోస్రా, జక్రాన్ పల్లి, ఇందల్వాయి, దర్పల్లి మండలాల నుంచి నగరానికి ఉల్లిని తీసుకొస్తున్నారు రైతులు. బైక్ లు,ట్రాక్టర్లు, ట్రాలీలు,ఆటోలలో ఇంటింటికీ తిరుగూ ఉల్లిని అమ్ముకుంటున్నారు. మార్కెట్ కంటే తక్కువ ధరకే వస్తుండటంతో రైతుల దగ్గర ఉల్లిగడ్డలు కొంటున్నారు జనం. ఉల్లిపంటకు మార్కెట్లో స్థిరమైన రేటు లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామంటున్నారు రైతులు.