వానలతో తగ్గిన దిగుబడులు
మహారాష్ట్ర, కర్నూల్ నుంచి తగ్గిన సరఫరా
పెరిగిన హోల్ సేల్ ధరలు
ఇదే అదనుగా రిటైల్ రేట్లూ పెంచిన వ్యాపారులు
నెల, రెండు నెలలు తిప్పలే
హైదరాబాద్, వెలుగు: ఉల్లి ధరలు ఘాటెక్కిస్తున్నాయి. హోల్ సేల్ లో ఉల్లిగడ్డలను కిలోకు రూ. 30 పైనే అమ్ముతుండగా.. రిటైల్ లో దాదాపు డబుల్ రేటుకు అమ్ముతున్నారు. హైదరాబాద్ మలక్‌పేట్ హోల్‌సేల్ మార్కెట్‌లో గరిష్టంగా కిలో ఉల్లి ధర రూ.34 ఉండగా బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.50 నుంచి రూ.60 వరకు అమ్ముతున్నారు. ఆగస్టులో హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో ఉల్లిని రూ.5 నుంచి రూ.9 లోపే అమ్మారు. గత నెలతో పోలిస్తే.. ఇప్పుడు ఐదారు రెట్లు ఎక్కువ ధరలు ఉన్నాయి. డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయని మార్కెటింగ్ వర్గాలు చెప్తున్నాయి.
ఉల్లిపై వానల ఎఫెక్ట్
రాష్ట్రానికి ఎక్కువగా మహారాష్ట్ర, కర్నూల్ నుంచే ఉల్లి వస్తుంది. ఇటీవల వర్షాల వల్ల ఉల్లిపంట దిగుబడిపై ప్రభావం పడింది. వర్షాలతో ఉల్లి పంటను తీయడానికి ఇబ్బందిగా మారింది. ఉల్లి మడుల్లో నీరు నిలిచి గడ్డలు మురిగిపోయే పరిస్థితి ఉంది. ఏపీ, మహారాష్ట్రలో వర్షాలతో ఉల్లి పంట చాలా వరకు దెబ్బతిన్నది. దిగుబడి తగ్గడంతో రాష్ట్రానికి సరఫరా కూడా తగ్గింది. మహారాష్ట్రలోని నాసిక్, ఏపీలోని కర్నూల్, రాష్ట్రంలోని గద్వాల, మహబూబ్‌నగర్ ప్రాంతాల నుంచి యావరేజీగా రోజుకు కనీసం 70 లారీల వరకు ఉల్లి లోడ్లు వచ్చేవి. బుధవారం 43 లారీల్లోనే వచ్చింది. మహారాష్ట్ర, కర్నూల్, గద్వాల నుంచి 8,600 బస్తాలు మాత్రమే వచ్చాయి.
లోకల్ పంట వచ్చే వరకు తిప్పలే
రాష్ట్రంలో తాండూరు, నారాయణఖేడ్, కొల్లాపూర్, అలంపూర్, నల్గొండల్లో 40 వేల ఎకరాల్లో ఉల్లి సాగవుతోంది. ఇది అక్టోబరు, నవంబరు నెలల్లో మార్కెట్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చే నెల నుంచి పెద్ద ఎత్తన ఉల్లి పంట వస్తే కానీ ధరలు తగ్గే అవకాశం ఉండదని చెప్తున్నారు. ఉల్లి ధరలు పెరగడంతో అటు కస్టమర్లపై భారం పడుతుండగా, ఇటు రైతులకు కూడా పెద్దగా లాభం దక్కడం లేదు. పీక్ టైమ్ లో బ్లాక్ చేసి అమ్ముకునే దళారులే బాగుపడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
For More News..