మహారాష్ట్ర.. ఇప్పుడు అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే అన్ని పార్టీలకు చెమటలు పట్టిస్తున్నాయి నిత్యావసరాల ధరలు. ముఖ్యంగా ఉల్లి.. అవును.. ఇప్పుడు ముంబై సిటీలో కిలో ఉల్లి 80 రూపాయలు పలుకుతుంది. పూణెలోనే దాదాపు ఇదే ధర ఉంది. సరిగ్గా నెల క్రితం వరకు 40 రూపాయలు ఉన్న కిలో ఉల్లి.. ఇప్పుడు 80 రూపాయలకు చేరింది. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా ఉల్లి పంట దెబ్బతిన్నది. దీంతో నవంబర్ నెలలో మార్కెట్కు రావాల్సిన కొత్త ఉల్లి.. రావాల్సినంత రాలేదు.
దిగుబడి భారీగా తగ్గటంతో.. డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. దీంతో ఉల్లి ధర డబుల్ అయ్యింది. ఎన్నికల సమయం కావటంతో నిత్యవసర సరుకుల ధరల పెరుగుదల పార్టీల్లో వణుకు పుట్టిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలోని అధికార పార్టీని ఉల్లి ధరల ఎఫెక్ట్ భయాందోళనలకు గురి చేస్తుంది. దీంతో ఎన్నికల వేళ ప్రజల నుండి వ్యతిరేక రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలకు దిగుతోంది. ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఉల్లి బఫర్ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. రిటైల్, హోల్ సేల్ మార్కెట్లలో ఉల్లిస్టాక్ను స్టోర్ చేసి కృతిమ డిమాండ్ ఏర్పడేలా చేస్తోన్న వ్యాపారులపైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
ALSO READ | మహారాష్ట్ర ఎన్నికల్లో ఫ్యామిలీ వార్
పేదలకు కన్నీళ్లు తెప్పిస్తోన్న ఉల్లి ధరల పెరుగుదలను అదుపులోకి తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. నిత్యవసర సరుకుల ధరల పెరుగుదలతో ఇప్పటికే అధికార పార్టీలపై సామాన్యులు తీవ్ర ఆగ్రహంగా ఉండగా.. సరిగ్గా ఎన్నికల సమయంలోనే ఉల్లి ధర సెంచరీకి చేరువ కావడంతో మహారాష్ట్రలోని అధికార మహాయతి కూటమికి భయం పట్టుకుంది. ప్రజలు ఆగ్రహిస్తే.. ఎన్నికల్లో భారీ నష్టం తప్పదని పార్టీలు భయపడుతున్నాయి. కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో సెంట్రల్ గవర్నమెంట్ సహయంతో ఆకాశానికి ఎగబాకుతున్న ఉల్లి ధరలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
దేశ ఆర్థిక రాజధానిలో ప్రస్తుతం ఉల్లి ధర 80 రూపాయలు ఉండగా.. మరికొన్ని రోజుల్లో రేట్ రూ.100 చేరవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశంలోనే అత్యధికంగా ఉల్లి సాగు చేసే మహారాష్ట్రలోనే ఉల్లి ధరలు విపరీతంగా పెరగడం.. మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో ధరలకు ఉల్లి ధరలకు రెక్కలు రావడం ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తోంది. ఈ క్రమంలోనే ఉల్లి ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.