మహబూబ్‌నగర్/కామారెడ్డి, వెలుగు : ఉల్లిగడ్డ ధరలు దారుణంగా పతనమయ్యాయి. పంటను మార్కెట్‌కు తెస్తున్న రైతులకు కిలోకు రూ. 4 నుంచి 8 మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత యాసంగిలో ఉల్లిగడ్డకు మంచి రేట్ రావడంతో ఈ ఏడాది రైతులు ఎక్కువగా ఉల్లిని వేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 4 వేల ఎకరాలు, కామారెడ్డి జిల్లాలో 6 వేల ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు. సెప్టెంబరులో రైతులు ఉల్లి నార్లు పోసుకోగా ఫిబ్రవరి మూడో వారం నుంచి పంటను మార్కెట్‌కు అమ్మకానికి తీసుకొస్తున్నారు. అప్పటివరకు క్వింటాల్ఉల్లిగడ్డ రూ.3,500 నుంచి నుంచి రూ.4 వేల మధ్య ఉండగా పంట చేతికొచ్చే సమయంలో ఒక్కసారిగా వ్యాపారులు రేట్లను తగ్గించారు. మంచి ధర వస్తుందనే ఆశతో పంటను మార్కెట్‌కు తెస్తున్న రైతులు రేట్లను చూసి కంగుతింటున్నారు. ఇంత అన్యాయం ఏంటని వ్యాపారుల ముందే కన్నీరు పెడుతున్నారు.
ఉల్లి కుప్పలను చూసి రేట్ ఫిక్స్
దేవరకద్ర వ్యవసాయ మార్కెట్‌కు ప్రతి బుధవారం మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల నుంచి రైతులు ఉల్లిగడ్డను అమ్మకానికి తీసుకొస్తుంటారు. వీరిని దళారులు, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు నిలువునా మోసం చేస్తున్నారు. పేరు మోసిన ఎనిమిది మంది ఉల్లిగడ్డ వ్యాపారులు రింగ్‌గా ఏర్పడి.. వారి అనుచరులతో మార్కెట్‌కు వచ్చిన ఉల్లి కుప్పలను ముందుగానే చెక్ చేయించి ఫొటోలు తీయిస్తున్నారు. ఫొటోలను చూసి, అందులో ఏ కుప్పకు ఏంత రేట్ కట్టాలో ముందే అందరూ కలిసి రేట్ఫిక్స్చేస్తున్నారు. టెండర్ స్టార్ట్ అయ్యాక వారు కుప్పల వద్దకు వచ్చి ముందే అనుకున్న రేట్ ప్రకారం వేలం పాడుతున్నారు. గడ్డ చిన్నగా ఉంటే క్వింటాల్‌కు రూ.250 నుంచి రూ.350, పెద్దగా ఉంటే క్వింటాల్‌కు రూ.400 నుంచి రూ.800 చెల్లిస్తున్నారు.
ఎకరాకు రూ.40 వేలకు పైగా పెట్టుబడి
ఉల్లి సాగుకు పెట్టుబడులు భారీగా పెరిగాయి. ఎకరాలో ఉల్లి నారు పోసుకోవడానికి నాలుగు కిలోల విత్తనాలు అవసరం అవుతుండగా, కిలో విత్తనాల ప్యాకెట్ రూ.3 వేలు ఉంది. ఉల్లి నారు పెట్టడానికి 20 మంది కూలీలకు ఒక్కొక్కరికి రూ.300 చొప్పున రూ.6 వేలు, మూడు సార్లు కలుపు తీయడానికి కూలీలకు రూ.18 వేలు, పురుగు మందులు, పిండి సంచులకు రూ.3 వేలు, గడ్డలను పీకేందుకు కూలీలకు రూ.12 వేలు, ఇతర ఖర్చులు అన్ని కలిపి దాదాపు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు పెట్టుబడులు అవుతున్నాయి. మార్కెట్‌కు పంటను తీసుకెళ్లినపుడు సైతం రైతులపైనే అన్ని ఖర్చుల భారం పడుతోంది. పంటను వెహికల్నుంచి దింపినందుకు హమాలీ చార్జి కింద బస్తా(45 కిలోలు)కు రూ.10 చొప్పున చెల్లిస్తున్నారు. మార్కెట్లో కుప్పలుగా పోసి పంటను ఆరబెట్టినందుకు చాట కూలీలకు కుప్ప(5 క్వింటాళ్లు)కు రూ.8 చొప్పున, ఉల్లిగడ్డలను సంచిలో పోసేందుకు ఒక సంచికి రూ.10 ఖర్చు చేస్తున్నారు. సంచిలో ఉల్లిగడ్డలు పోసి కాంటా చేసినందుకు కూలీలకు బస్తాకు రూ.10 చొప్పున ఇస్తున్నారు. రైతు నుంచి వ్యాపారులు పంట మొత్తం కొన్నాక.. కమీషన్ కింద ఏజెంట్లు నూటికి ఏడు రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. తైబజార్ కింద వెహికల్‌కు రూ.25, పంటను ట్రాలీ ఆటోలు, ట్రాక్టర్లు, జీపుల్లో తీసుకొచ్చినందుకు రవాణా చార్జీ కింద ఒక సంచికి రూ.50 చొప్పున కడుతున్నారు. ఉల్లి ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో ప్రస్తుతం రైతులకు ఎకరా మీద రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు నష్టం వస్తోంది.
తిప్పగేరి శరణప్పది నారాయణపేట జిల్లా శేర్నపల్లి గ్రామం. అర ఎకరాలో రూ.30 వేలు పెట్టుబడి పెట్టి దీపావళికి ముందు ఉల్లి సాగు చేశాడు. పంట చేతికి రాగా, బుధవారం పాలమూరు జిల్లా దేవరకద్ర మార్కెట్‌కు 40 బస్తాల(45 కిలోలు) ఉల్లి గడ్డను తీసుకొచ్చాడు. ఉదయం టెండర్ వేయగా వ్యాపారులు క్వింటాల్‌కు రూ.800 రేట్కట్టారు. 40 బస్తాల్లో 18 క్వింటాళ్ల ఉల్లిగడ్డ ఉండగా రూ.14,400 దక్కింది. రూ.15,600 నష్టం వచ్చింది.
రఘురామేశ్వర్రెడ్డిది నారాయణపేట జిల్లా అప్పిరెడ్డిపల్లి గ్రామం. నాలుగున్నర ఎకరాల్లో ఉల్లి సాగు చేశాడు. రూ.4 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. కలుపు తీయడానికి రూ.60 వేలు ఖర్చు చేశాడు. బుధవారం ఎకరా పంటకు సంబంధించిన ఉల్లిగడ్డను దేవకరద్ర మార్కెట్‌కు తీసుకురాగా వ్యాపారులు క్వింటాల్‌కు రూ.800 ధర కట్టారు. వంద బస్తాల్లోని 45 క్వింటాళ్లకు రూ.36 వేలు చెల్లించారు.
ఒక్కసారిగా రేటు తగ్గించిన్రు
ఎకరం విస్తీర్ణంలో ఉల్లి పంట సాగు చేసిన. పది రోజుల క్రితం కిలో రూ.15 చొప్పున కొన్నరు. ఇప్పుడు ఒక్కసారిగా రేటు తగ్గించిన్రు. రూ. 10 కూడా ఇస్తలేరు. పంట కోసి అమ్మకానికి తీసుకెళ్లగానే రేటుతగ్గుతోంది. నిల్వ పెట్టి ఉంచుదామంటే గోదాములు లేవు. అందుకే తక్కువ రేటు వచ్చినా అమ్మేస్తున్నాం.
- పరశురాం, యాచారం తండా, కామారెడ్డి జిల్లా