చుక్కల్లో ఉల్లి ధరలు .. 50శాతం వరకు పెరుగుదల

చుక్కల్లో ఉల్లి ధరలు .. 50శాతం వరకు పెరుగుదల

న్యూఢిల్లీ: పెరిగిన డిమాండ్ కారణంగా గత 15 రోజుల్లో దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు 30–-50 శాతం పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం ధరల నియంత్రణ చర్యలను సడలించవచ్చనే అంచనాతో వ్యాపారులు ఉల్లిని నిల్వ చేసుకుంటున్నారని ఎకనమిక్​టైమ్స్​వార్తాసంస్థ పేర్కొంది. మహారాష్ట్ర నాసిక్‌‌‌‌లోని లాసల్‌‌‌‌గావ్ మండీలో ఉల్లిపాయల సగటు హోల్‌‌‌‌సేల్ ధర సోమవారం కిలోకు రూ. 26గా ఉంది. అయితే గత నెల 25న రూ. 17గా ఉంది.  ఎక్కువ నాణ్యత కలిగిన ఉల్లిపాయల ధరలు వేగంగా పెరిగాయి.

రాష్ట్రవ్యాప్తంగా పలు హోల్ సేల్ మార్కెట్లలో కిలోకు రూ.30 వరకు పలుకుతున్నాయి. ఇటీవలి ధరల పెరుగుదలకు ప్రధాన కారణం డిమాండ్– సరఫరా మధ్య భారీ తేడాయే కారణం. జూన్‌‌‌‌ నుంచి మార్కెట్‌‌‌‌కు వచ్చే ఉల్లిపాయలు రైతులు, వ్యాపారుల వద్ద ఉన్న నిల్వల నుంచి వస్తున్నాయి. 2023–-24 రబీ పంటలో తగ్గుదల ఉన్నప్పుడు ధరలు పెరుగుతాయని ఆశించిన రైతులు తమ స్టాక్‌‌‌‌ను విక్రయించడానికి వెనుకాడుతున్నారు. అంతేకాకుండా, కేంద్రం నిషేధాన్ని ఎత్తివేసిన తర్వాత ఎగుమతులు తిరిగి ప్రారంభమయ్యాయి.

నాసిక్ జిల్లా నుంచి సగటున రోజుకు 100 కంటెయినర్ల ఉల్లిపాయలు (ఒక్కొక్కటి 30 టన్నులు) ఎగుమతి అవుతున్నాయి. దీంతో ఉల్లికి డిమాండ్ పెరిగింది. మహారాష్ట్ర ఉల్లిపాయలకు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి చాలా డిమాండ్ ఉంది. కేంద్రం ఎగుమతి సుంకాన్ని తొలగించవచ్చని రైతులు,  స్టాకిస్టులు భావించడం ధరలు పెరగడానికి ప్రధాన కారణాలలో ఒకటని వ్యాపారులు చెబుతున్నారు.