
- రైతుకు కిలోకు అందుతున్నది రూ.6 మాత్రమే
- మొన్నటి వరకు క్వింటాల్‌కు రూ.1,800 నుంచి రూ.2,300
- 15 రోజుల్లో క్వింటాల్‌పై రూ.1,000 దాక తగ్గిన ధర
- పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేదని రైతుల ఆందోళన
సంగారెడ్డి, వెలుగు: ఇన్నాళ్లు వినియోగదారులకు కంటతడి పెట్టించిన ఉల్లి ఇప్పుడు పంట పండించిన రైతులను కన్నీరు పెట్టిస్తోంది. పంట చేతికొచ్చే దశలో మార్కెట్లో ఒక్కసారిగా ఉల్లి ధర పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 15 రోజుల్లో ఉల్లి ధర క్వింటాల్ ఒకేసారి రూ.1,000 తగ్గడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మొన్నటి వరకు రూ.1,800 నుంచి రూ.2,300 పలికిన క్వింటాల్ ఉల్లి ధర ఇప్పుడు రూ.1,300కు పడిపోయింది.
కనిష్టంగా క్వింటాల్ ధర రూ.600కే పరిమితమైంది. సంగారెడ్డి జిల్లాలో ఈసారి 1,250 ఎకరాల్లో ఉల్లి సాగైనట్లు ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది ఇదే టైంలో క్వింటాల్ కు రూ.3,500 నుంచి రూ.4 వేల వరకు ధర పలికింది. కానీ, ఈసారి ధర తగ్గడంతో ఉల్లి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గరిష్ట ధర కొంత మందికే..
రంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, మనూర్, కొండాపూర్, సదాశివపేట, పటాన్ చెరు మండలాల్లో ఉల్లిగడ్డ ఎక్కువగా పండిస్తారు. ఉల్లి మార్కెట్లలో ప్రధానమైన సదాశివపేట మార్కెట్ యార్డులో ఈనెల 12న క్వింటాల్ ఉల్లిగడ్డ గరిష్టంగా రూ.1,369 పలికింది. కనిష్టంగా క్వింటాల్ ధర. రూ.569 పలకడం ఉల్లి మార్కెట్ తోపాటు రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. ఈ రేటు కూడా 15 శాతం మందికి మాత్రమే దక్కిందని.. 85 శాతం మంది రైతులకు క్వింటాల్ కు రూ.వెయ్యి లోపే గిట్టుబాటు అయినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
జిల్లాలోని జోగిపేట, పటాన్ చెరు మార్కెట్లలో కూడా దాదాపు సదాశివపేట మార్కెట్ లో పలికిన ధరలే ఉన్నాయి. పంట చేతికొచ్చిన టైంలో మార్కెట్లో ధర పడిపోవడం రైతులను ఆర్థికంగా దెబ్బతీస్తోంది. గత ఏడాది ఉల్లికి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో, ఈసారి పంట విస్తీర్ణం కూడా పెరిగింది. చాలామంది రైతులు అప్పు చేసి పెట్టుబడులు పెట్టారు. పెరిగిన విస్తీర్ణానికి తగ్గట్టుగా ధర లేకపోవడంతో కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇండ్ల వద్దనే అమ్మకాలు..
ఉల్లి ధర అమాంతం తగ్గిపోవడంతో రైతులు మార్కెట్ కు తీసుకుపోవడం లేదు. గిట్టుబాటు ధర లేకపోగా, రవాణా చార్జీలు మీద పడుతున్నాయి. మార్కెట్ కు బదులు ఇంటి దగ్గర కిలోల చొప్పున చిల్లరగా అమ్ముకుంటే కనీసం ఆ చార్జి డబ్బులైనా మిగులుతాయని భావిస్తున్నారు. ఉల్లినారు, పురుగు మందులు, నాట్లేసేందుకు, ఉల్లిగడ్డ తవ్వేందుకు పెట్టిన కూలీల ఖర్చులైనా మిగలాలంటే కిలోల చొప్పున చిల్లరగా అమ్ముకుంటేనే నయమని రైతులు చెబుతున్నారు.
పెట్టుబడి కూడా వస్తలేదు..
నాకున్న మూడెకరాల్లో రెండు ఎకరాల్లో వరి, ఒక్క ఎకరంలో ఉల్లిగడ్డ సాగు చేశాను. రూ.25 వేలు పెట్టి మందు, లాగోడికి ఖర్చు చేస్తే మంచిగనే దిగుబడి వచ్చింది. బోరు సరిగ్గా నీళ్లు పోయక వరి ఎండిపోతోంది. ఉల్లిలో పైసలు వస్తాయని అనుకుంటే మార్కెట్ లో ధర లేదు. మార్కెట్ కు పోతే ఆటో చార్జీలు మీద పడతయని ఊర్లనే కిలోల కాడికి అమ్ముకుంటున్న.
గంతి నగేశ్, పెద్దారెడ్డిపేట
కష్టమంతా వృథా అయింది..
నాకున్న 4 ఎకరాల్లో ఉల్లి పంట వేశాను. ఐదు రోజుల్లో క్వింటాల్ కు వెయ్యి రూపాయలు ధర తగ్గింది. పంటను ఇంట్లో ఉంచుకోలేక ధర తక్కువైనా అమ్ముకున్న. నిరుడు మంచి ధర వచ్చిందని, ఈసారి పంట ఎక్కువ వేస్తే కష్టమంతా వృథా అయింది. పెట్టుబడి కూడా చేతికి రాలే. మద్దతు ధర ఇచ్చి ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
మల్లేశం, బొబ్బిలిగామ