కొట్టేసి తక్కువ రేటుకు అమ్మిన ఇద్దరు యువకులు
రూ.60 వేల సరుకు కేవలం 6 వేలకే.. రెండు గంటల్లో ఖాళీ
దేశంలో ప్రస్తుతం సీఏఏ రగడ నడుస్తోంది కానీ, అంతకన్నా ముందు జనాన్ని తెగ ఇబ్బంది పెట్టిన సమస్య మాత్రం ఉల్లిగడ్డలే. అవును, మరి కిలో ఉల్లిగడ్డలు మొన్నటిదాకా 160 రూపాయలపైనే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే దిగి వస్తున్నా, సామాన్యుడికి అందనంత ఎత్తులోనే ఉంది ఉల్లిగడ్డ రేటు. కొన్ని చోట్ల క్వింటాళ్ల కొద్దీ ఉల్లిగడ్డలను దొంగలు ఎత్తుకెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇలాంటి సందర్భంలో కిలో ఉల్లిగడ్డ రూ.10కే వస్తే ఎట్లుంటది? పది రూపాయలేనా అని చాలా మంది ఎగిరి గంతేస్తారు.. క్యూ కట్టైనా తెచ్చుకుంటారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఇద్దరు వ్యక్తులు అలాంటి పనే చేశారు. కిలో ఉల్లిగడ్డను రూ.10 నుంచి రూ.20 రేటుతో అమ్మారు. కానీ, అందులో ఓ ట్విస్ట్ ఉంది. వాళ్లు దొంగతనం చేసి తెచ్చిన ఉల్లిని తక్కువ రేటుకు అమ్మారు మరి. ఉల్లిగడ్డ రేటు చూసి చిర్రెత్తుకొచ్చిన అజయ్ జాతవ్, జిత్తూ వాల్మీకి అనే ఇద్దరు వ్యక్తులు ఓ గోడౌన్లో రూ.60 వేల విలువైన ఉల్లిగడ్డలను చోరీ చేశారు. శనివారం ఛత్రి సబ్జి మండిలోని గోడౌన్ నుంచి 12 బస్తాల (50 కిలోలవి) ఉల్లిగడ్డ, రెండు బస్తాల వెల్లుల్లిగడ్డలను దోచేశారు.
తక్కువ రేటుకు అమ్మి దొరికిపోయారు
ఇయ్యాలరేపట్ల పది రూపాయలకే కిలో ఉల్లి వస్తోందంటే ఎవరు నమ్ముతారు! ఆ ఇద్దరు యువకులు అంత తక్కువకు ఉల్లిగడ్డలను అమ్ముతుండడం చూసి ఓ కస్టమర్‌కు అనుమానమొచ్చింది. ఏదో తేడా ఉందని గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులొచ్చే లోపు ఆ ఇద్దరు అక్కడి నుంచి మూటాముల్లె సర్దేశారు. దీంతో పోలీసులు ఆ మిస్టరీని ఛేదించే ప్రయత్నం చేశారు. చివరకు వాళ్ల జాడను పట్టేసి అరెస్ట్ చేశారు. ఎక్కువ రేట్లు ఉండడంతో దోచేసి, జనానికి తక్కువ రేటుకు అమ్మామని నిందితులు ఒప్పుకున్నారు. రూ.60 వేల విలువైన ఉల్లిగడ్డలను జస్ట్ రూ.6 వేలకే అమ్మేశారని పోలీసులు చెప్పారు. జస్ట్ రెండు గంటల్లోనే స్టాక్ అంతా అయిపోయిందన్నారు. జనానికి తక్కువ రేటుకు ఉల్లిగడ్డలను అమ్మాలన్న ఉద్దేశం మంచిదే అయినా, ఇలా దొంగతనం చేయడం మాత్రం పెద్ద నేరమని అన్నారు. వాళ్లను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు పోలీసులు.