మునుగోడుపై జోరుగా బెట్టింగ్​లు

రూ.5 లక్షల నుంచి కోటి దాకా పందాలు
జూబ్లీహిల్స్ కేంద్రంగా ఆన్ లైన్, ఆఫ్ లైన్​లో దందా 
నల్గొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్​లోనూ బెట్టింగ్​ల జోరు 

హైదరాబాద్, వెలుగు : మునుగోడు ఉప ఎన్నికకు ఇంకా 20  రోజులు ఉండగానే బెట్టింగ్ దందా షురూ అయింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ కేంద్రంగా అటు ఆన్ లైన్, ఇటు ఆఫ్ లైన్ లో ఈ దందా జోరుగా సాగుతోంది. ఇందులో తెలంగాణ, ఏపీకి చెందిన రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లతో పాటు వివిధ రంగాల ప్రముఖులు పాల్గొంటు న్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నోళ్లతో పాటు విదే శాల్లోని తెలుగోళ్లు కూడా బెట్టింగ్ పెడుతున్నారు. హైదరాబాద్ తో పాటు నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోనూ..  ఏపీలోని విజయ వాడలోనూ ఈ దందా నడుస్తోంది.

ఒక్కొక్కరు కనీసం రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు బెట్టింగ్ వేస్తున్నారు. కొందరు రూ.కోటి దాకా బెట్టింగ్ కాసేందుకు ముందుకొస్తున్నారు. దీన్ని బట్టి బెట్టింగ్​ ఏ రేంజ్​లో సాగుతుందో, మునుగోడు ఎన్నికపై జనంలో ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతోంది. కొందరు తెలిసినోళ్లందరూ ఒక గ్రూపుగా ఏర్పడి, వీరిలో ఒకరు మీడియేటర్​గా వ్యవహరిస్తూ ఆఫ్​లైన్​లో ఈ దందా నిర్వహిస్తుండగా.. మరికొందరు పరిచయం ఉన్నోళ్లతో సోషల్ మీడియా గ్రూపులు ఏర్పాటు చేసి దందా కొనసాగిస్తున్నారు. 

గుట్టుచప్పుడుగా దందా.. 

గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోనూ ఇదే మాదిరిగా జోరుగా బెట్టింగ్ దందా నడిచింది. అయితే మునుగోడు ఉప ఎన్నికపై చాలా ముందుగానే బెట్టింగ్ మొదలైంది. ఆఫ్ లైన్, ఆన్ లైన్ లో సాగుతున్న ఈ దందా గురించి బయటకు తెలియకుండా నిర్వాహకులు జాగ్రత్త పడుతున్నారు. ఇందులో మీడియేటర్ గా వ్యవహరించే వారు అప్రమత్తంగా ఉండి పందెం రాయుళ్లను ఎంపిక చేసుకుంటున్నారు. గుట్టుచప్పుడు కాకుండా దందా నిర్వహిస్తున్నారు.

టీఆర్ఎస్, బీజేపీపైనే ఎక్కువ బెట్టింగ్ లు.. 

ఈ బెట్టింగ్ వివిధ రకాలుగా నిర్వహిస్తున్నారు. ఏ పార్టీ గెలుస్తుంది? గెలిచే పార్టీకి ఎంత మెజారిటీ వస్తుంది? రెండో స్థానంలో ఏ పార్టీ ఉండొచ్చు? మూడో స్థానంలో ఏ పార్టీ ఉండొచ్చు? తదితరాలపై బెట్టింగ్ కాస్తున్నారు. అయితే 60 నుంచి 70 శాతం మంది టీఆర్ఎస్, బీజేపీల గెలుపు పైనే భారీగా బెట్టింగ్ కడుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ గెలుపుపై బెట్టింగ్ కడుతున్నోళ్ల సంఖ్య పెద్దగా ఉండడం లేదని బెట్టింగ్ లో పాల్గొన్న ఒకాయన చెప్పారు. గెలిచే పార్టీకి ఎంత మెజారిటీ వస్తుందనే దానిపైనా ఎక్కువ మంది బెట్టింగ్ వేస్తున్నట్లు పేర్కొన్నారు.

3వేల నుంచి 5వేల మెజారిటీపైనే ఎక్కువ మంది బెట్టింగ్ కాస్తున్నట్లు తెలిసింది. మరికొందరు 5వేల నుంచి 10 వేల మెజారిటీపై బెట్టింగ్ వేస్తుండగా... ఇంకొందరు 30 వేల మెజారిటీ వరకు పందాలు వేస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీలో ఏ పార్టీకి 80 వేల నుంచి 90 వేల ఓట్లు వస్తాయి? ఏదైనా పార్టీ లక్ష ఓట్లు సాధిస్తుందా? అనే దానిపైనా కూడా పందెం కాస్తున్నారు.