ఆన్‌లైన్‌‌లో అప్పాలు.. ఇండ్లలో తయారీ తగ్గించుకున్న ప్రజలు

వరంగల్‍, వెలుగు : గతంలో పండుగ వస్తుందంటే ప్రతి ఇంట్లో అప్పాల తయారీ కనిపించేది. ఇండ్ల ముంగట ప్రత్యేకంగా పొయ్యిలు ఏర్పాటు చేసుకొని సకినాలు, గారెలు, మడుగులతో పాటు గరిజలు, అరిసెల వంటి నాలుగైదు రకాల పిండి వంటలు తయారు చేసుకునేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారడంతో సిటీలతో పాటు గ్రామాల్లోనూ పిండి వంటల తయారీ తగ్గిపోయింది. ఒక వేళ అప్పాలు చేసుకోవాల్సి వచ్చినా ఏదో ఒకటి రెండు రకాలతో సరిపెట్టేస్తున్నారు. అవి కూడా చేసుకోలేని వారు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆర్డర్లు పెట్టుకుంటున్నారు.

కిలోల చొప్పున ఆర్డర్‍ పెడుతున్రు

పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ అప్పాల తయారీ తగ్గినా అవి లేకుండా పండుగ సాగడం లేదు. దీంతో సకినాలతో పాటు మిగతా రకాల పిండి వంటలను సైతం కిలోల చొప్పున ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టుకొని తెప్పించుకుంటున్నారు. గతంలో పండుగకు ఊళ్లకు వచ్చిన వారంతా అప్పాల సంచులతో సిటీ బాట పడితే.. ప్రస్తుతం సిటీ నుంచే రెడీమేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్పాలతో గ్రామాలకు వస్తున్నారు.

భారీ సంఖ్యలో పెరిగిన అప్పాల తయారీ దుకాణాలు

ప్రజలు రెడీమేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్పాల వైపు మొగ్గు చూపుతుండడంతో అవి తయారు చేసే దుకాణాల సంఖ్య భారీగా పెరిగింది. వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నాలుగేండ్ల కిందట పిండి వంటలు తయారు చేసే షాపులు 10 లోపే ఉండగా ప్రస్తుతం గల్లీకి రెండు, మూడు చొప్పున వెలిశాయి. క్వాలిటీని బట్టి సకినాల ధర కిలో రూ.380 నుంచి 450 వరకు ఉండగా, గారెలు రూ.320 నుంచి 400 వరకు అమ్ముతున్నారు. పార్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావాలంటే బరువు ఆధారంగా రూ.50 నుంచి రూ. 100 అదనంగా తీసుకుంటున్నారు. ప్రస్తుతం పండుగ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావడంతో మామూలు రోజుల్లో కంటే ఎక్కువ గిరాకీ ఉన్నట్లు నిర్వాహకులు తెలుపుతున్నారు. 

సకినాలు పోయడం వస్తలే...

సంక్రాంతి పండుగ వచ్చిందంటే తప్పనిసరిగా సకినాలు పోయాల్సిందే. కాస్త అనుభవం ఉన్న వారు తమ వేళ్లతో ఈజీగా సకినాలు పోస్తుంటే మిగతా వారు వారికి సహకరించేది. గతంలో ప్రతి ఇంట్లో అమ్మాయికి వంటలతో పాటు సకినాలు పోయడం కూడా నేర్పించేవారు. కానీ ప్రస్తుత తరం వారు సకినాల తయారీకి దూరంగా ఉంటున్నారు. అమ్మాయిలు చదువులు, ఉద్యోగాల పేరుతో ఇండ్లకు దూరంగా ఉంటుండడంతో సకినాలు పోయడం అంటేనే వింతగా చూస్తున్నారు.