ఎడపల్లి, వెలుగు: ఆన్లైన్ బెట్టింగ్స్ ఓ పచ్చని కుటుంబాన్ని బలితీసుకున్నాయి. బెట్టింగ్స్‌కు బానిసై కొడుకు రూ. 18 లక్షల అప్పులు చేయడంతో.. అవి తీర్చేదారి లేక, తీవ్ర మనస్తాపంతో కొడుకుతో కలిసి దంపతులు ఉరివేసుకొని ప్రాణాలు వదిలారు. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన రంగణవేణి సురేశ్(50), హేమలత (45) దంపతులు కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగించేవారు. వీరి ఒక్కగానొక్క కొడుకు హరీశ్(25 ). ఇంటర్ వరకు చదివి ఎడ్యుకేషన్‌ను ఆపేశాడు.
జీవనోపాధి కోసం హరీశ్‌కు తల్లిదండ్రులు కిరాణషాపు పెట్టించారు. కిరాణషాపు నడుపుతూ.. ఆన్ లైన్ బెట్టింగ్స్‌కు హరీశ్ అలవాటుపడ్డాడు. ఇందుకోసం తెలిసినవాళ్ల దగ్గర లక్ష, రెండు లక్షల చొప్పున మొత్తంగా రూ. 18 లక్షల వరకు అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చాలంటే జీవితాంతం కష్టపడ్డా తీర్చలేమన్న మనోవేదనతో శనివారం తెల్లవారే సరికి సురేశ్, హేమలత, వాళ్ల కొడుకు హరీశ్ ఇంట్లో ఉరివేసుకొని చనిపోయారు. ఉదయమే 8 గంటలైనా ఆ ఇంటి తలుపులు తీయకపోవడంతో పక్కింటివాళ్లు కిటికీ నుంచి చూడగా.. ముగ్గురూ ఉరికి వేలాడుతూ కనిపించారు. వెంటనే ఎడపల్లి పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.