
నేటి అత్యాధునిక సాంకేతిక యుగంలో స్మార్ట్‌ఫోన్ వాడకం సర్వ సాధారణమయ్యింది. ప్రస్తుతం 4జీ, 5జీ యుగం నడుస్తున్న ఈ కాలంలో ఇంటర్‌నెట్ మనిషి విజ్ఞానానికి పనికొచ్చే సమాచారం కోసం ఉపయోగించకుండా ఆన్‌లైన్ జూదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. నెటిజన్స్ సరదాల కోసం బెట్టింగ్స్, మనీ గేమ్స్ లాంటి వాటికి ఆకర్షితులై ఆ వ్యసనం నుంచి బయటపడలేక తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ సీజన్‌లో బెట్టింగ్స్ యథేచ్ఛగా సాగుతున్నాయి. బాల్ టు బాల్.. ఓవర్ టు ఓవర్...టాస్ ప్రారంభం నుంచే బెట్టింగ్‌ల జోరు ఊపందుకుంటోంది. రోజూ లైవ్ మ్యాచ్‌తోపాటే సరదాగా డ్రీమ్ 11, మై 11సర్కిల్, క్రిక్‌ప్లే, మైటీం, వంటి ఫాంటసీ లీగ్ యాప్స్ ఆటలతో లక్షల్లో, కోట్లలో ప్రైజ్ మనీ గెలవొచ్చని ఆశచూపి యువతను ఈ రొంపిలోకి దింపుతున్నాయి.
సరదాగా ఆడే ఆటలతో యువతను బానిసలుగా మార్చి ప్రాణాలకే ముప్పు తెచ్చే పరిస్థితులు నేడు చాపకింద నీరులా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లో జరుగుతున్న పెద్ద దందా. ఇందులో నిరుద్యోగ యువతే కాకుండా ఉద్యోగస్తులు సైతం చిక్కుకుంటున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లతో సర్వస్వం కోల్పోయి ప్రాణాలు తీసుకున్నవారు కోకొల్లలు. ఆటల్లో వినోదాన్ని చూడాలి. కానీ, బెట్టింగ్‌ల రూపంలో యువత జీవితాల్లో విషాదాన్ని నింపేలా మారకూడదు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని బెట్టింగ్‌ను నియంత్రించాలి. అవసరమైతే ప్రత్యేకంగా ఒక చట్టం చేయాలి.
బుర్రి శేఖర్