గద్వాల, వెలుగు: గద్వాల జిల్లాలోని పలు గ్రామాల్లో ఆన్ లైన్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ఐపీఎల్ మ్యాచ్‌లో కొందరు యువకులు ముఠాగా ఏర్పడి బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. ఇందుకోసం జిల్లాలోని శాంతినగర్, అయిజ, గద్వాలలో మూడు బోర్డులు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా యాప్ రూపొందించుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
శాంతినగర్, అయిజ టౌన్ కు చెందిన ఇద్దరు వ్యక్తులతో గద్వాలకు చెందిన ఒక ఎస్ఐ కొడుకు, ఓ రాజకీయ పార్టీ నేత ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. వారం రోజుల కింద ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసినప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఎస్ఐ కొడుకు కీలకపాత్ర పోషిస్తుండడం, ఓ పార్టీకి చెందిన లీడర్ కూడా ఉండడంతో కేసును కూడా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
డబ్బు పోగొట్టుకున్న వ్యక్తి సమాచారంతో..
క్రికెట్ బెట్టింగ్ యాప్ లో రూ.50 లక్షల వరకు పోగొట్టుకున్న గద్వాల మండలం కొత్తపల్లి విలేజ్ కి చెందిన సమాచారం ఇవ్వడంతో బెట్టింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నటికీ ఎంక్వైరీపై దృష్టి పెట్టడం లేదనే విమర్శలున్నాయి.
కోట్లలో బెట్టింగ్..
రూ.3 కోట్లకు పైగా ఆన్‌లైన్‌లో బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈశ్వర్ అనే వ్యక్తి ద్వారా రూ.కోటికి పైగా లావాదేవీలు జరిగినట్లు సమాచారం. దీంతోపాటు వడ్డేపల్లికి చెందిన ఓ వ్యక్తి దగ్గర 80 లక్షలు, గద్వాలకు చెందిన ఇద్దరి వద్ద రూ.50 లక్షల చొప్పున బెట్టింగ్ నిర్వహించినట్లు తెలిసింది. బెట్టింగ్ వ్యవహారంలో 300 మంది భాగస్వాములు కాగా, పోలీసుల బంధువులు, రాజకీయ పార్టీ లీడర్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
బెట్టింగ్‌కు ప్రత్యేక యాప్
ఆన్ లైన్ బెట్టింగ్‌కు ప్రత్యేక యాప్ రూపొందించారంటే ఏ మేర బెట్టింగ్ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్, ప్రో కబడ్డీతో పాటు ఏ ఆటలు ఆడుతున్నా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. రాజోలి, వడ్డేపల్లి, శాంతినగర్, అయిజ, గద్వాలతో పాటు గ్రామాల్లోనూ బెట్టింగ్ జోరుగా నడుస్తోంది. గద్వాలలోని పిల్లిగుండ్ల కాలనీలో ఓ ఇల్లు తీసుకొని బెట్టింగ్ వ్యవహారాన్ని నిర్వహిస్తున్నారు.