
గండిపేట, వెలుగు: ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసగా మారిన ఓ బీటెక్ విద్యార్థి ఉరి వేసుకోని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్అత్తాపూర్ ఏరియాలో చోటుచేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన పవన్(30).. తన ఫ్రెండ్స్ గౌతమ్, రోహిత్ లతో కలిసి అత్తాపూర్‌లో నివసిస్తున్నాడు. కొంతకాలంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడిన పవన్.. స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల వద్ద డబ్బులు తీసుకుని బెట్టింగ్ పెట్టాడు.
వ్యవసాయంలో తండ్రి పెద్ద నర్సింహులు సంపాదించిన డబ్బులను కూడా తీసుకొచ్చి ఆన్‌లైన్ బెట్టింగ్‌కు పాల్పడ్డాడు. అక్కడితో ఆగకుండా తన బుల్లెట్ బైకును, ఐఫోన్‌ను కూడా విక్రయించి మరీ బెట్టింగ్ పెట్టాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో డబ్బులు రాకపోగా..ఫ్రెండ్స్, బంధువుల వద్ద తీసుకున్న డబ్బులు కూడా పొగొట్టుకోవడంతో పవన్ మానసికంగా కుంగిపోయాడు.
మనస్తాపంతో బుధవారం సాయంత్రం స్నేహితులు లేని సమయాన్ని చూసుకోని ఫ్యాన్‌కు ఉరి వేసుకోని పవన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్రెండ్స్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు పవన్ మృతదేహాన్ని అందజేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు జరుపుతున్నారు.