బషీర్ బాగ్, వెలుగు: టీవీ రిమోట్ పనిచేయట్లేదని ఫోన్ చేస్తే, మహిళ అకౌంట్ నుంచి సైబర్ చీటర్స్ రూ.1.90 లక్షలు కొట్టేశారు. సిటీకి చెందిన 45 ఏండ్ల మహిళ ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. ఆమె ఇంట్లోని జియో సెట్ ఆఫ్ బాక్స్ రిమోట్పనిచేయకపోవడంతో ఆన్లైన్లో సర్వీస్ సెంటర్ నంబర్ కోసం వెతికింది. అందులో భాగంగా 8008557816 డయల్ చేసి, సమస్యను తెలిపింది. అయితే, సర్వీస్ కోసం తొలుత రూ. 30 పంపించాలని ఆమెతో స్కామర్స్ నమ్మబలికారు.
దీంతో బాధితురాలు గూగుల్ పే ద్వారా డబ్బులు పంపగా, ఆమె వాట్సాప్ నంబర్ కు ఓ లింక్ పంపి, ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఆపై కొద్దిసేపటికే బాధిత మహిళ అకౌంట్ నుంచి రూ. 1,90,707 డబ్బులు డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఈ బదిలీలో ఓటీపీ కూడా రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు.. న్యాయం కోసం సైబర్ క్రైమ్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఏసీపీ శివమారుతి తెలిపారు.