హైదరాబాద్, వెలుగు: స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్స్ తరహాలో మెడిసిన్స్ కూడా హోమ్ డెలివరీ చేసే యాప్స్, సంస్థల సంఖ్య భారీగా పెరిగింది. కరోనా తర్వాత మెడిసిన్ వినియోగానికి పెరిగిన డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు అనేక సంస్థలు ఈ బిజినెస్‌లోకి ఎంటర్ అయ్యాయి. టాటా వన్ ఎంజీ, ఫార్మ్ ఈజీ, నెట్‌మెడ్స్, మెడ్‌ప్లస్, డంజో, మెడ్‌లైఫ్, అపోలో, ధని వంటి పెద్ద సంస్థలతో పాటు అనేక చిన్న సంస్థలు కూడా మందులను హోమ్ డెలివరీ చేస్తున్నాయి. మెడికల్ షాపుల్లో కంటే 20 నుంచి 30 శాతం తక్కువ ధరకే వీటిలో మందులు దొరుకుతున్నాయి. అదనంగా స్పెషల్ ఆఫర్లు, సీజనల్, కూపన్ డిస్కౌంట్లు కూడా ఇస్తున్నాయి. ఉదాహరణకు రూ.807 ఎమ్మార్పీ ఉన్న క్వాక్ ఫోర్ట్ క్యాప్సుల్ స్ర్టిప్ ను ఆన్‌లైన్‌లో రూ.564కు అమ్ముతుంటే, ఆఫ్‌లైన్‌లో రూ.720 నుంచి రూ.800 వరకు అమ్ముతున్నారు. మెడికల్ షాపుల ధరల్లో తేడాలున్నట్టే, ఆన్‌లైన్‌లోనూ ఒక్కో సంస్థ ఒక్కో రేటుకు మందులు విక్రయిస్తోంది. అయితే అన్నింటిలోనూ బయట షాపుల్లో కంటే తక్కువ ధరలే ఉన్నాయి.
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో మెడికల్ చెయిన్స్ నడిపే అపోలో, మెడ్‌ప్లస్ వంటి సంస్థలు.. తమ రిటైల్ స్టోర్ల కంటే ఆన్‌లైన్‌లో తక్కువ ధరకే మెడిసిన్స్ అమ్ముతున్నాయి. ఉదాహరణకు క్వాక్ ఫోర్ట్ స్ర్టిప్‌ను షాపులో ఎమ్మార్పీకి అమ్ముతున్న అపోలో, ఆన్‌లైన్‌లో రూ.685కే అమ్ముతోంది. షాపులో ఎమ్మార్పీపై 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్న మెడ్‌ప్లస్ సంస్థ, ఆన్‌లైన్‌లో 20 శాతం డిస్కౌంట్ ఇస్తోంది.
ఆన్‌లైన్‌లోనే టెస్టుల బుకింగ్...
ఈ సంస్థలు మందులు అమ్మడంతో పాటు వివిధ రకాల టెస్టులను ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకునే ఫెసిలిటీని కల్పిస్తున్నాయి. రక్త, మూత్ర పరీక్షల వంటి వాటికి ఇంటికే వచ్చి శాంపిల్స్ తీసుకుంటున్నాయి. ఇమేజింగ్ టెస్టులైతే మనకు నచ్చిన తేదీ, సమయం ఎంచుకొని స్లాట్ బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. టెస్టులకు కూడా 10 నుంచి 20 శాతం డిస్కౌంట్ ఇస్తున్నాయి. ఇప్పుడంతా కరోనా సీజన్ కావడంతో కొవిడ్ టెస్టులు, మందులపై స్పెషల్ ఆఫర్లు, ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. ర్యాపిడ్ యాంటీజెన్, యాంటీబాడీ టెస్టింగ్, ఐసోలేషన్ కిట్లను రూ.250 నుంచి రూ.500లలో ఇస్తున్నాయి. టాటా వన్ ఎంజీ యాప్‌లో ర్యాపిడ్ కిట్ ధర రూ.239 ఉండగా, అపోలో సంస్థ రూ.420కి రెండు కిట్లు ఇస్తోంది. ఐదు కంటే ఎక్కువ కిట్లు కొంటే 25 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. ప్రస్తుతం జనం ఎక్కువగా వాడుతున్న అజిత్రోమైసిన్ ట్యాబ్లెట్ స్ర్టిప్ ధర బయట షాపులో రూ.120 నుంచి 150 ఉంటే, ఆన్‌లైన్‌లో రూ.70 నుంచి 80కే అమ్ముతున్నారు.
పల్లెల్లోనూ అందుబాటులోకి...
భారీగా డిస్కౌంట్లు ఇస్తుండడంతో మెడిసిన్ హోమ్ డెలివరీ సంస్థలకు డిమాండ్ పెరుగుతోంది. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి సిటీల్లో ఆన్‌లైన్ మెడిసిన్ బుకింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. చిన్న పట్టణాలు, మున్సిపాలిటీలు, గ్రామస్థాయి వరకూ మెడిసిన్డెలివరీ చేసే సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ ఆన్‌లైన్ బిజినెస్‌ను ఫార్మసిస్టులు వ్యతిరేకిస్తున్నారు. ప్రిస్క్రిప్షన్ లేకపోయినా మెడిసిన్స్ డెలివరీ చేయడాన్ని తప్పుబడుతున్నారు. వాస్తవానికి షెడ్యూల్డ్ డ్రగ్స్‌ను ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మడం నేరం. ఇప్పటికే రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం విచ్చలవిడిగా పెరిగింది. మెడిసిన్ కొనుగోలు చేసి, వాటిని డ్రగ్స్‌గా తయారు చేసే ముఠాలు కూడా తయారయ్యాయి. ఆన్‌లైన్ మెడిసిన్ డెలివరీపై ఇప్పటికైనా నిఘా పెట్టకపోతే, డ్రగ్స్ వినియోగం మరింత పెరిగే ప్రమాదముందని ఫార్మసిస్టులు హెచ్చరిస్తున్నారు.
మెడికల్ షాపులు పెరిగినయ్..
కరోనా వల్ల మెడిసిన్ వినియోగం పెరగడం తో, ఆ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు రాష్ట్రంలో రెండేండ్లలోనే ఏకంగా 9 వేల కొత్త మెడికల్ షాపులు పుట్టుకొచ్చాయి. కరోనాకు ముందు 26 వేల షాపులు ఉంటే, ఇప్పుడు 35 వేలకు పెరిగాయి. ప్రతి జిల్లాల్లోనూ కొత్త ఫార్మసీలు ఏర్పాటయ్యాయి. విటమిన్ ట్యాబ్లెట్లు, పెయిన్ కిల్లర్లు, యాంటీ బయాటి క్స్ విపరీతంగా అమ్ముడవుతున్నాయి. చాలా మంది రోగం రాకముందే మెడిసిన్స్ కొనుక్కొని వేసుకుంటున్నారు. లాక్‌డౌన్ కారణంగా మిగిలిన వ్యాపారాలన్నీ దెబ్బతిన్నా, మెడికల్ రంగం మాత్రం లాభపడింది. కొత్త దవాఖాన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.