- త్వరలో పల్లె వెలుగు సహా అన్నింటిలోనూ అమలు
- ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా రెండు డిపోల్లో ఏఎఫ్సీ సిస్టమ్
- 13 వేల ఐటిమ్స్ మెషీన్లకు ఆర్డర్
- ఇకపై బస్‌పాస్‌ల స్థానంలో డిజిటల్ కార్డులు
హైదరాబాద్, వెలుగు : ఆర్టీసీ బస్సుల్లో చిల్లర సమస్యకు చెక్ పెట్టేందుకు యాజమాన్యం చర్యలు తీసుకుంటున్నది. ఇకపై పల్లె వెలుగు మొదలు అన్ని బస్సుల్లోనూ డిజిటల్ పేమెంట్స్ విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. త్వరలోనే ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ (ఏఎఫ్‌సీఎస్)ను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.ఈ సాఫ్ట్‌వేర్ ఆధారంగా బస్సుల్లో టికెట్లు ఇచ్చేందుకు
13 వేల ప్రత్యేక మెషిన్లను కూడా కొనుగోలు చేస్తున్నది. వీటికోసం ఇప్పటికే ఆర్డర్ కూడా ఇచ్చింది. వీటిని ఇంటెలిజెన్స్ టికెట్ ఇష్యూయింగ్ మెషిన్స్ (ఐటీఐఎం/ఐటిమ్స్) అంటారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 9 వేల పైచిలుకు బస్సుల్లోనూ ఐటిమ్స్ ను అందుబాటులోకి తేనున్నారు. మరో 4 వేల మెషిన్లను ఆర్టీసీ అధికారులు తమ వద్ద స్పేర్ లో ఉంచుకోనున్నారు.
త్వరలో హైదరాబాద్ అంతటా..
ఇప్పటికే హైదరాబాద్ లోని రెండు డిపోల్లో ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ (ఏఎఫ్‌సీఎస్)ను పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. దిల్‌సుఖ్ నగర్, బండ్లగూడ డిపోల బస్సుల్లో ప్రయాణికులకు డిజిటల్ పేమెంట్స్ విధానంలో టికెట్లు ఇస్తున్నారు. ఇది విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 9 వేల బస్సుల్లోనూ అమలు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం హైఎండ్ బస్సుల్లో
అది కూడా ప్రయాణికుల అభ్యర్థన మేరకు మాత్రమే ఆన్ లైన్ పేమెంట్ పద్ధతిలో టికెట్లు ఇస్తున్నారు. ఇంద్ర, గరుడ, రాజధాని, సూపర్ లగ్జరీ లాంటి హైఎండ్ బస్సుల్లోనే యూపీఐ విధానం అమలు చేస్తున్నారు. ఇది తాత్కాలిక పద్ధతిలోనే కొనసాగిస్తున్నారు. ఇప్పుడు సంస్థ కొత్తగా తీసుకొస్తున్న డిజిటల్ పేమెంట్స్ విధానం అమలైతే, అన్ని బస్సుల్లోనూ కొత్త మెషిన్లు అందుబాటులోకి వస్తాయి.
ఆర్టీసీకి అందుబాటులోకి డేటా..
డిజిటల్ పేమెంట్స్ విధానం అమలైతే బస్ పాస్ ల స్థానంలో డిజిటల్ కార్డులు ఇస్తారు. ప్రస్తుతం జర్నలిస్టులు, స్టూడెంట్లు, దివ్యాంగులు, స్వాతంత్ర్య సమరయోధులు తదితర వర్గాలకు అమలవుతున్న బస్ పాస్ ల స్థానంలో ఆయా వర్గాలకు డిజిటల్ కార్డులు అందిస్తారు. వీటిని ఆర్టీసీ రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా స్కాన్ చేయాల్సి ఉంటుంది. దీంతో బస్ పాస్ లను ఎక్కువగా వినియోగిస్తున్నోళ్ల డేటా కూడా ఆర్టీసీ వద్ద ఉండనుంది.
ఈ డిజిటల్ పేమెంట్ విధానం అమలైతే రాష్ట్రవ్యాప్తంగా ఏయే రూట్లలో? ఏయే సమయాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందనేది కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని రియల్ టైమ్ డేటా అంటారు. దీని ద్వారా రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లను, రద్దీ ఎక్కువగా ఉన్న సమయాలను తెలుసుకోవచ్చు. దీంతో ఆయా రూట్లలో, ఆయా సమయాల్లో ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులను నడిపేందుకు అవకాశం ఉంటుంది.