- సంస్థ చేతికి 6 వేల ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ మెషీన్లు
- వీటి పనితీరును పరిశీలిస్తున్న అధికారులు
- మొదట హైదరాబాద్లో.. తర్వాత రాష్ట్రమంతటా అమలుకు కసరత్తు
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ బస్సుల్లో ఇకపై ఆన్ లైన్ లో చెల్లింపులకు అవకాశం రానుంది. ఆన్ లైన్ పేమెంట్స్ కోసం సంస్థ యాజమాన్యం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఆన్ లైన్ చెల్లింపులు జరిపేందుకు ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ (ఏఎఫ్‌సీఎస్) మెషీన్లు ఇప్పటికే సంస్థకు చేరాయి. గత కొన్ని నెలల కింద వీటికోసం ఆర్టీసీ ఆర్డర్ పెట్టగా ఇటీవలే ఈ ఆన్ లైన్ పేమెంట్ మెషీన్లు సంస్థ చేతికి వచ్చాయి. ఇక త్వరలోనే ప్రయాణికులు అన్ని రకాల బస్సుల్లో ఆన్ లైన్ పేమెంట్ చేసే వీలు ఉంటుంది. దీంతో ఇక ఆర్టీసీలో ప్రయాణికులకు చిల్లర సమస్య తీరనుంది.
ముఖ్యంగా ప్రయాణికులు కండక్టర్ కు టికెట్ కోసం పెద్ద నోట్లు ఇచ్చిన సందర్భంలో ఆయన టికెట్ వెనకాల మిగితా రావాల్సిన మొత్తాన్ని రాయడం, బస్సు దిగేటప్పుడు హడావుడిలో మరిచిపోవడం జరిగేది. ఇప్పుడు ఇక మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే చాలు ఫోన్ పే, గూగుల్ పే, పేటీయం, వాట్సప్ పేమెంట్ ద్వారా టికెట్ కు సరిపడా చెల్లింపులు చేసే వీలు కలుగుతుంది. వీటితో పాటు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కూడా చెల్లింపులకు అవకాశం ఉండనుంది. ప్రస్తుతం ఈ మెషీన్ల పనితీరును అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పుడు 6 వేల మెషీన్లు అందుబాటులో ఉండడంతో మొదటి దశలో హైదరాబాద్ మెట్రో పరిధిలో వీటిని వినియోగించి, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఆర్టీసీ అధికారులు ఉన్నారు.
ALSO READ : ఏడాది పాలనలో ఏ పేజీ తిప్పినా మోసం,అవినీతే : కేటీఆర్
డ్రైవర్లకు, కండక్టర్లకు కూడా వీటిపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే సిటీలోని ఒకటి, రెండు డిపోల్లో ప్రయోగాత్మకంగా వీటిని అమలు చేస్తున్నారు. ఇకపై సిటీలో పూర్తిస్థాయిలో వీటిని వినియోగించనున్నారు. త్వరలోనే మిగితా ఏఎఫ్‌సీఎస్ మెషీన్లు సంస్థకు చేరనున్నాయి. అవి రాగానే రాష్ట్రంలోని పల్లె వెలుగు వంటి గ్రామీణ ప్రాంత బస్సుల్లో సైతం వీటి ద్వారా ఆన్ లైన్ చెల్లింపులు చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం దూర ప్రాంత రూట్లలో నడిచే ఏసీ బస్సుల్లో ఆన్ లైన్ పేమెంట్ విధానం ఉన్నా, అది టెంపరరీ బేసిస్ లో కొనసాగుతోంది. ఏఎఫ్‌సీఎస్ మెషీన్లు అమలులోకి వస్తే ఇటు ప్రయాణికులకు, అటు ఆర్టీసీకి మరింత సౌలభ్యంగా మారనుంది.