వెలుగు బిజినెస్ డెస్క్: ఎంట్రీ లెవెల్ కార్లు, టెలివిజన్లు, హోమ్ అప్లయెన్స్‌లు, మొబైల్ఫోన్లపై దేశంలో మోజు తగ్గిపోతోంది. గత మూడేళ్లుగా ఈ కొత్త ట్రెండ్ వేళ్లూనుకుంటోంది. ఈజీ ఫైనాన్సింగ్ ఆప్షన్స్‌తో ప్రజల పర్చేజింగ్ పవర్లో మార్పులు వస్తున్నట్లు ఈ ట్రెండ్‌తో అర్ధం చేసుకోవచ్చు. మరో కోణం లోంచి చూస్తే, ఎక్కువ మార్జిన్లు దొరికే ప్రీమియం ప్రొడక్టుల తయారీవైపు మాన్యుఫాక్చరర్లు కూడా మొగ్గు చూపుతున్నారని ఎనలిస్టులు చెబుతున్నారు.
ఎలక్ట్రానిక్స్ సెగ్మెంట్లో చాలా బడ్జెట్ మోడల్స్ఈ–కామర్స్ప్లాట్ఫామ్స్కే పరిమితమవుతున్నాయని వారు పేర్కొంటున్నారు. భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేయడం ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌కి మాత్రమే సాధ్యమవుతోంది.
ఈఎంఐ మేజిక్..
ఈ కొత్త ట్రెండ్ కన్జూమర్ ఎకానమీలోని ఇతర సెగ్మెంట్లలోనూ కనిపిస్తోంది. అనుకూలమైన ఫైనాన్సింగ్ ఆప్షన్స్ అందుబాటులో ఉండటంతో ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని కార్పొరేట్లు సైతం చెబుతున్నాయి. హై మార్జిన్ ప్రీమియం ప్రొడక్టుల కొనుగోలుకే ప్రజలు ఇష్టపడుతున్నారని, ముఖ్యంగా ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉన్న ప్రొడక్టులలో ఇది కొట్టొచ్చినట్లు తెలుస్తోందని పేర్కొంటున్నాయి. భారీ డిస్కౌంట్లు ఇవ్వాల్సి వచ్చే ఎంట్రీ లెవెల్ ప్రొడక్టులలో ప్రాఫిట్ మార్జిన్లే ఉండటం లేదని ఒక రిటెయిల్ చెయిన్ కంపెనీలోని టాప్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు.
అందుకే, కస్టమర్లను ప్రీమియం ప్రొడక్టులవైపు మళ్లించడం ద్వారా లాభాలు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. కంఫర్టబుల్ ఈఎంఐ ప్యాకేజీల వల్ల ఇది సులభమవుతోందని ఆయన వెల్లడిస్తున్నారు. అఫర్డబుల్ప్రొడక్టు (ఎంట్రీ లెవెల్) కొందామనే ఆలోచనతోనే ఒక ఏసీ, ఫోన్, ల్యాప్‌టాప్, టెలివిజన్ లేదా కారును కొనడానికి కస్టమరు షోరూమ్‌లో అడుగుపెడతాడు. కానీ, ఆకర్షణీయమైన ఈఎంఐ ఆప్షన్స్ చూపించి, వారిని ప్రీమియం ప్రొడక్టులు కొనేలా మారుస్తున్నట్లు ఆ టాప్ ఎగ్జిక్యూటివ్ వివరించారు.
చాలా మంది మాన్యుఫాక్చరర్లు ఎంట్రీ లెవెల్ ప్రొడక్టులను ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌పై మాత్రమే అందిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆఫ్‌లైన్ రిటైల్ మార్కెట్ కోసం లో ఎండ్ బ్రాండ్స్‌ను తయారు చేయడం కంపెనీలు ఆపేస్తున్నాయని, అలాంటి ప్రొడక్టులు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌వంటి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌పైనే దొరుకుతున్నాయని అన్నారు. ఈఎంఐల ద్వారా అప్‌గ్రేడ్‌ను అందుబాటులోకి తేవడం వల్ల యాపిల్ వంటి కంపెనీల ప్రీమియం ప్రొడక్టుల అమ్మకాలు జోరయ్యేందుకు ఛాన్స్ ఇస్తున్నట్లు ఆ రిటెయిల్ చెయిన్ టాప్ ఎగ్జిక్యూటివ్ వివరించారు.
ఇష్టాలను మార్చేసిన కరోనా..
కరోనా మహమ్మారి కూడా ప్రజల కొనుగోళ్ల అభిరుచులలో మార్పులకు మరో ప్రధాన కారణమైందని వెల్లడించారు. బయటకు వెళ్లే అవకాశం లేకుండా, ఇంట్లోనే ఉండాల్సిన అవసరం ఏర్పడటం వల్ల 55 అంగుళాల టెలివిజన్సెట్లు, హెవీ డ్యూటీ వాషింగ్ మెషీన్లు, లార్జ్కెపాసిటీ రెఫ్రిజిరేటర్లు కొనడం పెరిగిందని ఒక అప్లయెన్సెస్ రిటైల్ చెయిన్ కంపెనీ హెడ్ చెప్పారు. కొరత కారణంగా విడిభాగాల రేట్లు పెరగడంతోపాటు, కరెన్సీ విలువ పడిపోవడం వల్లా ఎంట్రీ లెవెల్ ప్రొడక్టుల రేట్లు ఎక్కువ అయ్యాయయని అన్నారు.
ప్రీమియం ప్రొడక్టుల వైపే కంపెనీలు చూస్తుండటంతో రూ. 10 వేల లోపు స్మార్ట్ఫోన్లు మార్కెట్ నుంచి మాయమైనా ఆశ్చర్యపోవక్కర్లేదని ఆయన చెప్పారు. ఫోల్డ్, ఫ్లిప్, గెలాక్సీ 23 వంటి తన ప్రీమియం స్మార్ట్ఫోన్లను ఆఫ్‌లైన్‌లో అమ్ముతున్న శామ్సంగ్, మరోవైపు ఎం, ఎఫ్ సిరీస్ ఫోన్లను మాత్రం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌వంటి ఆన్లైన్ ప్లాట్ఫారమ్స్పైనే అమ్ముతోంది. 2018 లో రూ. 5,991 కి దొరికిన ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ ధర ఇప్పుడు రూ. 7,126 కి పెరిగినట్లు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డేటా వెల్లడిస్తోంది. ఎంట్రీ లెవెల్ ఫోన్ల అమ్మకాలు తగ్గిపోతుంటే, మరో వైపు రూ. 30 వేలకి పైన రేటుండే ప్రీమియం స్మార్ట్ఫోన్ల అమ్మకాలు మాత్రం రెట్టింపైనట్లు ఆ డేటా చెబుతోంది. అలాగే, రూ. 5 లక్షలలోపు ధర ఉండే కార్ల వాటా మొత్తం అమ్మకాలలో 1 శాతం కంటే కిందకి పడిపోయింది.
కార్ల క్వార్టర్లీ సేల్స్ డేటా చూస్తే తాజా సెప్టెంబర్ క్వార్టర్లో ఎంట్రీ లెవెల్ కార్ల సేల్స్ 35 వేల యూనిట్లకే పరిమితమయ్యాయి. గత కొన్నేళ్ల క్వార్టర్లీ అమ్మకాలలో ఇదే అతి తక్కువ కావడం విశేషం. టూవీలర్ సెగ్మెంట్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. 110 సీసీ మోటార్ సైకిల్స్ సేల్స్ తాజా సెప్టెంబర్ క్వార్టర్లో అతి తక్కువగా రికార్డయ్యాయి.
కొత్త ట్రెండ్..
పర్సనల్ మొబిలిటీ ఛాయిస్ విషయంలో కొత్త ట్రెండ్ బాగా కనిపిస్తోందని ఎనలిస్టులు వివరిస్తున్నారు. ఒకప్పుడు కార్ల కంపెనీలకు వెన్నెముకగా నిలిచిన చిన్న కార్ల అమ్మకాలు జోరుగా తగ్గిపోతుండటాన్ని ఇందుకు నిదర్శనంగా వారు చూపిస్తున్నారు. తక్కువ రేటుండే వెహికల్స్ అమ్మకాల వాటా మొత్తం సేల్స్‌లో గతంలో 85 శాతం దాకా ఉండేది. ఇప్పుడది 58 శాతానికి పడిపోయిందని మారుతి సుజుకి ఈడీ శశాంక్ శ్రీవాస్తవ చెప్పారు.
రెగ్యులేటరీ ఏజన్సీలు కొత్త రూల్స్ తేవడం సహా వివిధ కారణాల వల్ల ఇటీవల కాలంలో ఎంట్రీ లెవెల్ ప్రొడక్టుల రేట్లు పెరిగాయి. కానీ, ఈ ప్రొడక్టులు కొనుగోలు చేసే ప్రజల ఆదాయాలలో అంత పెరుగుదల రాలేదు. ఫలితంగా అఫర్డబిలిటీ తగ్గిపోయి, చిన్న కార్ల అమ్మకాలు పడిపోయాయని అంటున్నారు.