యువకుడి ప్రాణం తీసిన ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ రమ్మీ

యువకుడి ప్రాణం తీసిన ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ రమ్మీ

శంకరపట్నం, వెలుగు : ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో రమ్మీ ఆడిన ఓ యువకుడు చివరకు అప్పులపాలయ్యాడు. అవి తీర్చే మార్గం లేక మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్‌‌‌‌ జిల్లా కేశవపట్నం మండలం గద్దపాక గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. ఎస్సై రవి తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బూస శంకర్‌‌‌‌ కుమారుడు కార్తీక్ (25)  కొన్నాళ్లుగా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో రమ్మీ ఆడుతున్నాడు.

గేమ్‌‌‌‌లో నష్టపోవడంతో రూ. 15 లక్షల వరకు అప్పు చేశాడు. దీంతో ఆరు నెలల కింద 20 గుంటల పొలం అమ్మి అప్పు తీర్చేశాడు. తర్వాత మరోసారి రూ. 2.50 లక్షలు అప్పు చేసి రమ్మీ ఆడడంతో ఆ డబ్బులు కూడా పోయాయి. దీంతో మనస్తాపానికి గురైన కార్తీక్‌‌‌‌ గ్రామ సమీపంలోని వాగు వద్ద పురుగుల మందు తాగి తన ఫ్రెండ్‌‌‌‌ జక్కుల రాజ్‌‌‌‌కుమార్‌‌‌‌కు సమాచారమిచ్చాడు.

అతడు కార్తీక్‌‌‌‌ తండ్రి శంకర్‌‌‌‌కు చెప్పడంతో ఘటనాస్థలానికి చేరుకొని కార్తీక్‌‌‌‌ను జమ్మికుంటలోని మమత హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హనుమకొండలోని ఓ ప్రైవేట్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌కు తరలించగా అక్కడ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకుంటూ గురువారం రాత్రి చనిపోయాడు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు కేశవపట్నం ఎస్సై కొత్తపల్లి రవి తెలిపారు.