
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఇవాళ(బుధవారం) రెండు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ఇందులో ఇటీవల తీవ్ర చర్చనీయాంశమైన సినిమాటోగ్రఫీ బిల్లు కూడా ఉంది. మరొకటి వాహన పన్నుల చట్ట సవరణ బిల్లు. సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం ఇకపై సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లోనే అమ్మనున్నారు. బెనిఫిట్ షోల పేరుతో ఇష్టా రాజ్యంగా టికెట్ ధరలను పెంచుతుండటంతో..0 ఆన్‌లైన్ టికెటింగ్ విధానాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ సినిమాస్ రెగ్యులరైజేషన్ సవరణ బిల్లును మంత్రి పేర్ని నాని సభలో ప్రవేశపెట్టారు. సినిమా పరిశ్రమ ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా నడవాలని తెలిపారు. సినిమా కలెక్షన్లు, కడుతున్న టాక్సులకు సంబంధం లేదని చెప్పారు.
దీని ప్రకారం ఇకపై ప్రభుత్వ ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా మాత్రమే టికెట్ కొనుగోలు చేయాలి. ఇకపై నేరుగా థియేటర్‌కు వెళ్లి టికెట్ కొనుగోలు చేసి సినిమా చూసే వెసులుబాటు లేనట్టే. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తరపున ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టిన మంత్రి నాని.. బిల్లు లక్ష్యాన్ని చదివి వినిపించారు.
కొత్త వాహనాల లైఫ్ ట్యాక్స్‌ను పాత వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ పెంచుతూ సవరించారు. కొత్త వాహనాల లైఫ్ ట్యాక్స్‌ను 1 నుంచి నాలుగు శాతం వరకు పెంచారు. దీంతో రాష్ట్ర ప్రజలపై అదనంగా రూ. 409 కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉందని చెబుతున్నారు.