ఆలయాల్లో ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ సేవలు

ఆలయాల్లో ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ సేవలు
  • అభిషేకాల నుంచి ఆర్జిత సేవల వరకు ముందుస్తు బుకింగ్‌‌‌‌‌‌‌‌లు
  • ప్రముఖ ఆలయాల్లో ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ సేవలపై ప్రభుత్వం కసరత్తు 
  • రాష్ట్రవ్యాప్తంగా 39 ఆలయాల్లో అందుబాటులోకి  తేవాలని నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాల్లో సేవలను భక్తులకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ముఖ్యమైన సేవలను ముందస్తుగా బుక్‌‌‌‌‌‌‌‌ చేసుకునేందుకు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌ను అందుబాటులోకి తేనుంది. ఆలయాల్లో భక్తుల రద్దీ, క్యూలైన్లను తగ్గించేందుకు ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఇంతకుముందు ఆలయాల్లో అభిషేకాలు, ఆర్జిత సేవలు, అన్నదానాలు, వసతి సౌకర్యం కోసం దేవస్థానాలకే వెళ్లి రిజిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ సేవలన్నీ ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో బుక్‌‌‌‌‌‌‌‌ చేసుకునేందుకు భక్తులకు వీలు కల్పించనుంది.

రాష్ట్రంలో 39 ప్రధాన ఆలయాల్లో ఈ సేవలను ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో బుక్‌‌‌‌‌‌‌‌ చేసుకునేందుకు దేవదాయ శాఖ కసర్తతు చేస్తున్నది. గతంలో 8 ఆలయాలు వేములవాడ, కొండగట్టు, బాసర, యాదగిరిగుట్ట, భద్రాచలం, బల్కంపేట ఎల్లమ్మ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి ఆలయం, కొమరవెల్లి మల్లన్న ఆలయాల్లో ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిగిలిన ఆలయాల్లో కూడా ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కార్యాచరణ రూపొందించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇటీవల అధికారులతో నిర్వహించిన సమావేశంలో పేర్కొన్నారు.  

అర్చన నుంచి అన్నదానాల వరకు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లోనే.. 

మొబైల్‌‌‌‌‌‌‌‌ ఫోన్‌‌‌‌‌‌‌‌లో టీ యాప్‌‌‌‌‌‌‌‌తో పాటు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ కేంద్రాలు, ఈ సేవ, మీ సేవ కేంద్రాల్లో కూడా దేవాలయాల్లో కావాల్సిన సేవలను ముందస్తుగా బుక్‌‌‌‌‌‌‌‌ చేసుకోవచ్చు. ఆలయాల్లో ఆర్జిత సేవలు, అభిషేకాలు, అర్చన, కల్యాణం, అన్నదానాలతో పాటు దేవుడి ప్రసాదాన్ని కూడా బుక్ చేసుకొని నేరుగా ఇంటికి తెప్పించుకోవచ్చు. మేడారం సమ్మక్క - సారలమ్మ సేవలను కూడా జాతర సమయంలో ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో పొందవచ్చు.

నాచారం గుట్టలోని శ్రీలక్ష్మినరసింహ స్వామి, చెరువు గట్టులోని పార్వతి జడల రామలింగేశ్వర స్వామి, మన్యంకొండలోని శ్రీలక్ష్మివేంకటేశ్వర స్వామి కురవిలోని వీరభద్రస్వామి, జమలాపురంలోని వెంటేశ్వర స్వామి, ధర్మపురి లక్ష్మి నరసింహ స్వామి, హనుమకొండలోని భద్రకాళి, గుడిమల్కాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఆలయం, అలంపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని జోగులాంబ, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని పెద్దమ్మ తల్లి, వినాయకుడి ఆలయం, కీసర గుట్ట ఆలయాల్లో ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. మొత్తం 23 రకాల సేవలు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో పొందవచ్చు. సుప్రభాతం, అభిషేకం, అంతర్యాల అర్చన, సహస్త్రనామార్చన, నిత్య కల్యాణం, తదితర సేవలు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.