కరోనా మహమ్మారి ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా దేశాన్ని ఎంతో బలహీనపరిచింది. దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా విద్యా వ్యవస్థను, విద్యార్థి లోకాన్ని గాయపర్చింది. దేశాన్ని తమ భుజాలపై వేసుకుని నడపాల్సిన నవసమాజ నిర్మాతలైన విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదపు అంచున పడేసింది. టెక్నాలజీ వేగంగా పరుగులు పెడుతున్న కాలంలో కూడా సంప్రదాయ టీచింగ్ పద్ధతుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో విద్యా భోదన జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుత విద్యా విధానం, మౌలిక సదుపాయాల లేమి, అధునాతన పద్ధతుల ఆవశ్యకతను గుర్తించలేకపోవడం లాంటివి దీనికి కారణాలుగా చెప్పవచ్చు. సరిగ్గా ఈ బలహీనతలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కరోనా కూడా విద్యా వ్యవస్థను దెబ్బకొట్టింది.
2020లో అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్ ఆంక్షలు విద్యా సంస్థలను దీర్ఘకాలం పాటు మూతపడేలా చేశాయి. విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు ఆన్‌లైన్ టీచింగ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. చాలాకాలంగా క్లాస్ రూమ్ టీచింగ్‌కు అలవాటుపడిన స్టూడెంట్లు ఒక్కసారిగా మొబైల్, శాటిలైట్ టీచింగ్ అమలులోకి వచ్చేసరికి చదువులో వెనకబడిపోయారు. గ్రామీణ ప్రాంతాల స్టూడెంట్ల పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. ఆన్‌లైన్ క్లాసులకు దూరమైన వారిలో ఎక్కువ మంది గ్రామీణ పేద స్టూడెంట్లే. దీనికి కారణం మారుమూల గ్రామాల్లోని స్టూడెంట్స్‌కు పేదరికం వల్ల స్మార్ట్ ఫోన్, నెట్ సౌకర్యం లేకపోవడమే.
మోడ్రన్ టీచింగ్ ను ప్రోత్సహించాలి
సుదీర్ఘ లాక్ డౌన్ వల్ల ఎగ్జామ్స్ సరైన టైమ్‌కు జరగలేదు. అంతేకాదు ఆన్‌లైన్ క్లాసులు అందరికీ చేరలేదు కూడా. దీంతో స్టూడెంట్లను పాస్ చేయడం, కొన్ని తరగతుల వారిని ప్రమోట్ చేయడం లాంటి నిర్ణయాలు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకున్నాయి. ఇప్పుడు లాక్‌డౌన్ ఆంక్షలు తొలగిపోవడంతో ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్‌కు పరీక్షలు నిర్వహించడం, ఉత్తీర్ణత శాతం పడిపోవడం, కొన్నిచోట్ల స్టూడెంట్లు ఆత్మహత్యలు చేసుకోవడం, పేరెంట్స్, ప్రజా సంఘాలు, పార్టీలు నిరసనలతో పాస్ మార్కులు వేసి అందరిని పాస్ చేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. ఈ పాస్ మార్కులు స్టూడెంట్లకు భవిష్యత్తులో ఉపయోగపడతాయా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఇంప్రూవ్‌మెంట్ సౌకర్యం కల్పించినా ఇంకో 15 శాతం మార్కులు పొందగలుగుతారా? అంటే అసాధ్యమే అని చెప్పొచ్చు. అప్పటికే, సెకండ్ ఇయర్ పరీక్షలకు రెడీ అవుతున్న స్టూడెంట్లు, అదనంగా ఫస్ట్ ఇయర్ పరీక్షలకు ప్రిపేర్ కావడం కష్టమైన పని. ఈ ఆన్‌లైన్ విధానంతో స్టూడెంట్లు కాగితంపై చెప్పుకోవడానికి పైక్లాసులకు ప్రమోట్ అయ్యారే తప్ప పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబర్చడానికి కానీ, జాతీయస్థాయిలో నీట్, జిప్ మర్, క్యాట్, మ్యాట్ లాంటి పరీక్షల్లో మెరిట్ సాధించడానికి అవసరమైన విషయ పరిజ్ఞానం పొందట్లేదనే చెప్పాలి. కరోనా ముప్పు ఇంకా పొంచి ఉండటంతో ఎడ్యుకేషన్ సిస్టంను, స్టూడెంట్లను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించి మేధావుల సంప్రదింపులతో ఆన్ లైన్ టీచింగ్‌పై రివ్యూ చేయాలి. స్కూల్ స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు సంప్రదాయ టీచింగ్ కొనసాగిస్తూనే మోడ్రన్ టీచింగ్ విధానాన్ని ప్రోత్సహించాలి. సెల్ఫ్ లెర్నింగ్ సామర్థ్యాన్ని పెంచాలి. - ఎండీ ఖ్వాజా మొయినొద్దీన్, కరీంనగర్