భద్రాద్రి రామయ్య కళ్యాణానికి ఆన్ లైన్ లో టికెట్లు

భద్రాచలం,వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో వచ్చే నెల 9వ తేదీ నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల్లో కీలకఘట్టం హోలీ వేళ సోమవారం ఆవిష్కృతమైంది.

రామయ్యకు పంచామృతాలతో అభిషేకం, సహస్రధారలతో స్నపన తిరుమంజనం చేసి పెళ్లికొడుకుగా తయారు చేశారు. బేడా మండపంలో పూలతో అలంకరించిన ఊయలలో సీతారాములను ఆశీనులను చేసి డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహించారు.

ఆన్​లైన్​లో టిక్కెట్లు

ఏప్రిల్17న జరిగే శ్రీరామనవమి సీతారాముల కల్యాణం, 18న జరిగే పట్టాభిషేకం టికెట్లను సోమవారం నుంచి ఆన్​లైన్​లో పెట్టారు.  <http://bhadradritemple.telangana.gov.in> అనే వెబ్​సైట్​లో టికెట్లు పొందవచ్చని ఈవో రమాదేవి తెలిపారు.

శ్రీరామనవమి రోజున ఉభయ దాతల టికెట్​ధర రూ.7500 కాగా దీనిపై ఇద్దరికి ప్రవేశం ఉంటుంది. రూ.2500, రూ.2000, రూ.1000, రూ.300, రూ.150 టిక్కెట్లపై ఒక్కరికే ప్రవేశం ఉంటుంది. 18న జరిగే శ్రీరామ పట్టాభిషేకం సెక్టార్​ టికెట్ల ధరను రూ.1500, రూ.500, రూ.100గా నిర్ణయించినట్లు ఈవో వెల్లడించారు.