భద్రాచలంలో ఏప్రిల్17న సీతారాముల కల్యాణ మహోత్సమానికి ముహూర్తం ఖరారు చేసింది శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం వైదిక కమిటీ. దీంతో ఏప్రిల్9(ఉగాది రోజు) నుంచి 23వ తేదీ వరకు భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సీతారాముల కల్యాణం చూసేందుకు పలు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఈ క్రమంలో
ఏప్రిల్17న జరిగే శ్రీరామనవమి సీతారాముల కల్యాణం, 18న జరిగే పట్టాభిషేకం టికెట్లను సోమవారం నుంచి ఆన్లైన్లో అందేబాటులోకి ఉంచుతున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు. దేవస్థానం అధికారిక వెబ్సైట్ <http://bhadradritemple.telangana.gov.in>లో ఆన్లైన్టికెట్లు పొందవచ్చని చెప్పారు.
శ్రీరామనవమి రోజున ఉభయ దాతల టికెట్ధర రూ.7500 కాగా దీనిపై ఇద్దరికి ప్రవేశం ఉంటుంది. అలాగే.. ఇతర సెక్టార్ రూ.2500, రూ.2000, రూ.1000, రూ.300, రూ.150 టిక్కెట్లపై ఒక్కరికే ప్రవేశం ఉంటుంది.అయితే, ఈసారి వీవీఐపీ పేరుతో రూ.10వేల విలువైన టికెట్లను కూడా అందుబాటులోకి ఉంచుతున్నట్లు తెలిపారు. 18న జరిగే శ్రీరామ పట్టాభిషేకం సెక్టార్ టికెట్ల ధరను రూ.1500, రూ.500, రూ.300గా నిర్ణయించినట్లు ఈవో వెల్లడించారు.