
- ఆదివారాలతో కలిపి 12 రోజులు హాలీడేస్
హైదరాబాద్, వెలుగు: రోజూ పనేనా.. ఒక్కరోజు సెలవు దొరికితే బాగుండు ’ అని ఉద్యోగులు ఒక్కోసారి నిట్టూరుస్తుంటారు. ఏప్రిల్ నెలను తలచుకుంటే ఆ నిట్టూర్పులన్నీ పటాపంచలైపోవడం ఖాయం. ఈ నెలలో అన్ని సెలవులున్నాయి మరి. ఈ నెలంతా కలిపి 18 రోజులే పని దినాలు. 12 రోజులు సెలవులే. ఆదివారాలు, సెకండ్ శనివారం సహా మొత్తం 30 రోజుల్లో 12 రోజులు ఏప్రిల్లో సెలవులు రావడం విశేషం.
ఈ నెల 1న రంజాన్ పండుగ తెల్లారి ప్రభుత్వం సెలవు ఇవ్వగా.. తాజాగా ఐదో తేదీన బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా సెలవు వచ్చింది. తెల్లారి ఆదివారం.. ఈ ఆదివారమే శ్రీరామనవమి కూడా వచ్చింది. ఆ ఒక్క సెలవు మిస్ అయిపోయింది. ఇక, ఆ తర్వాత ఈ నెల 10న మహవీర్ జయంతి ఉంది. అది ఆప్షనల్ హాలీడేనే అయినా.. చాలా మంది సెలవు తీసుకుంటున్నారు. ఇక, ఈ నెల 12న రెండో శనివారం, 13న ఆదివారం, 14న సోమవారం అంబేద్కర్ జయంతి కలిపి వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి.
ఆ సెలవులు అయిపోగానే మళ్లీ ఈ నెల 18న గుడ్ ఫ్రైడేకి హాలీడే ఉంది. ఆ వెంటనే 20న ఆదివారం మినహా.. ఆ వారంలో అదనపు ప్రభుత్వ సెలవులేమీ లేవు. ఇక, 27న ఆదివారంకాగా.. 30న బసవ జయంతి/అక్షయ తృతీయ సెలవులు (ఆప్షనల్) కలిసి రానున్నాయి.