- 2.30 లక్షల మందికే..
- విడతల వారీగా జమ చేస్తామంటున్న అధికారులు
యాదాద్రి, వెలుగు : రుణమాఫీ చివరి విడత ప్రక్రియ ప్రారంభమై నెలన్నర గడిచినా.. సగం టార్గెట్ కూడా పూర్తి కాలేదు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు 40 శాతం మందికి మాత్రమే రుణాలు మాఫీ అయ్యాయి. 60 శాతం రైతులకు ఇంకా ఎదురుచూస్తేనే ఉన్నారు. కానీ, బీఆర్ఎస్ మాత్రం రుణమాఫీ కంప్లీట్ అయినట్లు సంబురాలు చేస్తోంది. కొందరు రైతులు ఇప్పటికే లోన్లు చెల్లించడం, కొన్ని ఖాతాలు డిఫాల్ట్ కావడం, కొన్ని బ్యాంకులు మరో బ్యాంకుల్లో విలీనం కావడం లాంటి కారణాలతో ఆలస్యం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు.
22,100 ఖాతాలు డిఫాల్ట్
ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2018 డిసెంబర్ 11 నాటికి 6,35,386 మంది రైతులు రూ. లక్ష లోపు రూ. 3015.46 కోట్లు రుణాలు తీసుకున్నారు. యాదాద్రి జిల్లాలో 118015 మంది రైతులు రూ. 629.66 కోట్లు, సూర్యాపేట జిల్లాలో 2,16,731 మంది రూ. 816.63 కోట్లు, నల్గొండ జిల్లాలో 3,00,640 మంది రూ. 1569.17 కోట్లు రుణాలు తీసుకున్నారు. వీరిలో గోల్డ్ తనఖా పెట్టి రుణాలు తీసుకున్న వారు కూడా ఉన్నారు. ఇందులో ఇప్పటి వరకు 2,30, 510 మందికి సంబంధించి రూ. 1237 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయని అగ్రికల్చర్ ఆఫీసర్లు చెబుతున్నారు.
విడతల వారీగా రూ. 1.20 లక్షల వరకూ రుణం తీసుకున్న రైతులకు రూ. లక్ష లోపు మాఫీ చేసినట్టు వెల్లడించారు. మిగిలిన వారికి విడతల వారీగా ఖాతాల్లో జమ అవుతాయని అంటున్నారు. యాదాద్రి జిల్లాలో 52110 మంది రైతులకు రూ. 282 కోట్లు, సూర్యాపేట జిల్లాలో 87200 మందికి రూ. 465 కోట్లు, నల్లగొండ జిల్లాలో 91200 మంది రైతులకు రూ. 490 కోట్లు మాపీ అయినట్టు ఆఫీసర్లు చెబుతున్నారు. అయితే మరో 22100 రైతుల ఖాతాలు డిఫాల్ట్‌గా ఉండడంతో రూ. 130 కోట్ల మాఫీ విషయంలో కొంత గందరగోళం నెలకొంది.
నాలుగేండ్లుగా..
రూ. 25 వేలు తీసుకున్న రైతులకు ప్రభుత్వం 2020 మేలో మాఫీ చేసింది. 2021లో రూ. 50 వేల రుణం తీసుకున్న వారికి మాఫీ చేస్తున్నామని ప్రకటించింది. ఆ తర్వాత మాఫీ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు ఎన్నికలు ముంచుకొస్తుండడంతో ఆగస్టు 3 నుంచి రుణమాఫీ చివరి విడత ప్రారంభమైంది. ఇప్పటివరకూ రుణాలు తీసుకున్న రైతుల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 40 శాతం మందికి పైగా రుణమాఫీ అయ్యింది.
ఆలస్యానికి కారణాలు ఇవీ
కొన్ని కారణాల వల్ల రుణమాఫీ ఆలస్యమవుతోందని ఆఫీసర్లు చెబుతున్నారు. తీసుకున్న అప్పుకు వడ్డీ పెరుగుతుందన్న ఉద్దేశంతో కొందరు రైతులు తమ అప్పు చెల్లించారు. దీంతో వారి రుణ ఖాతాలను బ్యాంకులు క్లోజ్ చేశాయి. ఈ కారణంగా వారి ఖాతాలు ఇప్పుడు కన్పించడం లేదు. వీరికి సంబంధించిన రుణం డబ్బు సేవింగ్ ఖాతాలో జమ అవుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు. అదే విధంగా యూనియన్ బ్యాంక్‌లో ఆంధ్ర బ్యాంక్ విలీనమైంది.
మరికొన్ని బ్యాంకులు కూడా ఇతర విలీనం కావడంతో కొన్ని చోట్ల బ్రాంచీలు మూసివేశారు. వీటికి సంబంధించి రైతుల ఖాతాలను గుర్తించే ప్రక్రియ సాగుతోందని ఆఫీసర్లు అంటున్నారు. రైతుల పేర్లు, తండ్రి పేర్లు, చిరునామా, ఆధార్ కార్డు నెంబర్లు కరెక్టుగా ఉన్నాయా.? లేవా..? అని పరిశీలిస్తున్నారు. అక్షర దోషాలున్నా.. నెంబర్లు కరెక్ట్‌గా లేకున్నా.. రుణమాఫీ విషయంలో ఆలస్యం జరుగుతోంది.