ఖాళీ అవుతున్న సాగర్, శ్రీశైలం.. రెండు ప్రాజెక్టుల్లో ఇంకా మిగిలింది 45 టీఎంసీలే

ఖాళీ అవుతున్న సాగర్, శ్రీశైలం.. రెండు ప్రాజెక్టుల్లో ఇంకా మిగిలింది 45 టీఎంసీలే
  • బోర్డు చెప్పినా యథేచ్ఛగా నీటిని తోడేస్తున్న ఏపీ
  • బోర్డు మీటింగ్​ జరిగినప్పటి నుంచి 12 టీఎంసీలు డ్రా 
  • సాగర్​ కుడి కాల్వ నుంచి 8 వేల క్యూసెక్కులకుపైగా తరలింపు
  • శ్రీశైలం నుంచి 6 టీఎంసీల వరకు తీసుకెళ్లిన ఏపీ
  • ఆ రాష్ట్రానికి  మిగిలి ఉన్న కోటా మరో 8 టీఎంసీలే

హైదరాబాద్​, వెలుగు: కృష్ణా జలాలను ఏపీ యథేచ్ఛగా తోడేస్తున్నది. కృష్ణా బోర్డు ఆదేశాలనూ బేఖాతరు చేస్తూ నాగార్జున సాగర్​ కుడి కాల్వ, శ్రీశైలం నుంచి నీటిని తరలించుకుపోతున్నది. నిర్దేశించిన కోటాకు మించి జలదోపిడీ చేస్తుండడంతో నాగార్జున సాగర్​, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు వేగంగా అడుగంటిపోతున్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల్లో కలిపి ప్రస్తుతం వాడుకోవడానికి ఉన్న నీళ్లు కేవలం 45.2 టీఎంసీలే. బోర్డు మీటింగ్​ జరిగిన ఫిబ్రవరి 27న రెండు ప్రాజెక్టుల్లో వాడుకోవడానికి వీలుగా 65.2 టీఎంసీల నీళ్లుండగా.. ఈ 10 రోజుల్లోనే రెండు ప్రాజెక్టుల నుంచి 20 టీఎంసీల నీళ్లు ఖాళీ అయిపోయాయి. శ్రీశైలం నుంచి ఒక్క చుక్క కూడా తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసినా.. సాగర్​ కుడి కాల్వ నుంచి 7 వేల క్యూసెక్కులకు మించి తీసుకోరాదని ఆదేశాలున్నా.. ఏపీ మాత్రం ఆ మాటలను పట్టించుకోలేదు. తన దోపిడీకి అడ్డు ఎవరన్న చందంగా ఇటు శ్రీశైలంలోని హంద్రినీవా నుంచి.. అటు నాగార్జున సాగర్​ కుడి కాల్వ నుంచి వేలకు వేల క్యూసెక్కులను తరలించుకుపోతున్నది.

2 సార్లు బోర్డు మీటింగ్​లో చెప్పినా..

ఏపీ జలదోపిడీని నియంత్రించేందుకు ఫిబ్రవరిలో 2  సార్లు కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశాన్ని నిర్వహించింది. 24న ఒకసారి.. 27న మరోసారి 2  రాష్ట్రాల అధికారులతో సమావేశమైంది. 27న జరిగిన భేటీ నాటికి ఏపీకి 23 టీఎంసీల నీళ్ల కోటానే మిగిలి ఉంది. అయితే, ఆయకట్టును దృష్టిలో ఉంచుకుని ఏపీకి 20 టీఎంసీలు ఇచ్చేందుకు బోర్డు అంగీకరించింది. సాగర్​ కుడి కాల్వ నుంచి అప్పటికే 10 వేల క్యూసెక్కులను తరలించుకుపోతున్న ఏపీకి.. కేవలం 7 వేల క్యూసెక్కులు మాత్రమే తీసుకెళ్లేలా ఆదేశించింది. మీటింగ్​ జరిగిన రోజు నుంచి 3 రోజుల పాటు 7 వేల క్యూసెక్కులకుపైగా నీటిని కుడి కాల్వ ద్వారా తీసుకెళ్లింది. ఆ తర్వాత రెండు రోజులు 6వేల క్యూసెక్కులకు తగ్గించుకున్నా.. ఆ తర్వాతి నుంచి5 రోజులుగా 8 వేల క్యూసెక్కుల నీటిని తరలించుకుంటున్నది. మీటింగ్​ జరిగనప్పటి నుంచి ఇప్పటిదాకా సాగర్​ కుడి కాల్వ నుంచి ఏపీ దాదాపు 6 టీఎంసీల నీటిని తీసుకెళ్లినట్టు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇటు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఒక్క చుక్క నీటిని కూడా తీసుకోవడానికి లేకున్నా.. హంద్రీనీవా వంటి కెనాల్స్​ ద్వారా 3 వేల క్యూసెక్కులకుపైగా జలాలను తోడుతున్నది. అక్కడి నుంచి కూడా ఏపీ ఇప్పటి వరకు ఆరేడు టీఎంసీల వరకు తోడుకున్నది. మొత్తంగా ఆ రాష్ట్రానికి మిగిలి ఉన్న వాటాలో 12 టీఎంసీలకుపైగా నీటిని వాడేసుకున్నది. అదే సమయంలో తెలంగాణ తన వాటా మేరకు ఈ పది రోజులుగా 8,500 క్యూసెక్కుల నుంచి 9 వేల క్యూసెక్కుల వరకు మాత్రమే నీటిని సాగర్​ ఎడమ కాల్వ ద్వారా తీసుకుంటున్నది. 

వేగంగా పడిపోతున్నయ్..

రెండు ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు వేగంగా పడిపోతున్నాయి. బోర్డు మీటింగ్​ జరిగిన ఫిబ్రవరి 27న సాగర్​ ప్రాజెక్టులో 170 టీఎంసీల నీళ్లుండగా.. అందులో వాడుకోవడానికి వీలుగా 29.6 టీఎంసీలు ఉన్నట్టు బోర్డు నిర్ధారించింది. ప్రస్తుతం 158 టీఎంసీల నీళ్లే ఉన్నాయి. అందులో లైవ్​ స్టోరేజ్​లో ఉన్న జలాలు 17.6 టీఎంసీలే. మినిమమ్​ డ్రా డౌన్​ లెవెల్​ను 515 అడుగులుగా నిర్ధారించగా.. ప్రస్తుతం సాగర్​ నీటి మట్టం 524.8 అడుగులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో మీటింగ్​ నాటికి మొత్తం నిల్వ 79 టీఎంసీలు ఉండగా.. లైవ్​ స్టోరేజ్​లో 35.6 టీఎంసీలు ఉన్నట్టు బోర్డు స్పష్టం చేసింది. ప్రస్తుతం మొత్తం స్టోరేజ్​ 71.9 టీఎంసీలుండగా.. లైవ్​ స్టోరేజ్​లో ఉన్న నీళ్లు 27.6 టీఎంసీలే. బోర్డు మీటింగ్​లో శ్రీశైలం మినిమమ్​ డ్రా డౌన్​ లెవెల్​ను 820గా నిర్ణయించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం 846 అడుగులుగా ఉన్నది. ఈ పది రోజుల్లోనే సాగర్​లో 12 టీఎంసీలు, శ్రీశైలంలో 8 టీఎంసీల నీళ్లు ఖాళీ అయిపోయాయి.

గోదావరి బేసిన్​లోనూ తగ్గుతున్నయ్​..

కృష్ణా బేసిన్​తో పాటు ఇటు గోదావరి బేసిన్​లోని ప్రధాన ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. గోదావరి బేసిన్​లో ప్రధాన ప్రాజెక్టైన శ్రీరాంసాగర్​లో పూర్తి స్థాయి సామర్థ్యం 80.50 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 29.27 టీఎంసీల నీళ్లే ఉన్నాయి. మిడ్​మానేరులో 27.5 టీఎంసీలకుగానూ 14.28 టీఎంసీలు, లోయర్​ మానేరులో 24 టీఎంసీలకుగానూ 11.09 టీఎంసీలు, నిజాంసాగర్​లో 17.8 టీఎంసీలకుగానూ 8.35 టీఎంసీలు, ఎల్లంపల్లిలో 20.18 టీఎంసీలకుగానూ 12.50 టీఎంసీల జలాలే అందుబాటులో ఉన్నాయి.  సింగూరు ప్రాజెక్టులో 29.91 టీఎంసీలకుగానూ.. 22.34 టీఎంసీలు ఉన్నాయి.