మున్సిపాలిటీలు, పంచాయతీల్లో పన్ను వసూళ్లకు..మిగిలింది 47 రోజులే

మున్సిపాలిటీలు, పంచాయతీల్లో పన్ను వసూళ్లకు..మిగిలింది 47 రోజులే
  • ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న బల్దియా, పంచాయతీ ట్యాక్స్ వసూళ్లు 
  • వరుస సర్వేల కారణంగా ఆస్తి పన్ను వసూళ్లలో వెనుకంజ
  • మార్చి 31లోగా వంద శాతం వసూలు చేసేందుకు చర్యలు
  • ప్రత్యేక బృందాలతో స్పెషల్ డ్రైవ్

ఆదిలాబాద్, వెలుగు : మున్సిపాలిటీలు, పంచాయతీల్లో పన్ను వసూళ్లకు 47 రోజులు మాత్రమే మిగిలాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల మీద ఆధారపడకుండా మున్సిపాలి టీలు, పంచాయతీల్లో ఆస్తి పన్నులు వసూలు చేసి కార్మికులకు జీతాలు, కార్యాలయాల నిర్వహణ తదితర పనుల కోసం వినియోగిస్తారు. అయితే ప్రతి ఆర్థిక సంవత్సరం (మార్చి 31) ముగిసేలోపు ఏడాది లక్ష్యం మేరకు పన్నులు వసూలు చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది పన్ను వసూళ్లకు ఇంకా 47 రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఈలోగా లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. 

బల్దియాల్లో పేరుకుపోయిన బకాయిలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న బల్దియాల్లోనే అధికంగా బకాయిలు పేరుకుపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఏకైక మున్సిపాలిటీ ఆదిలాబాద్​లో 49 వార్డులు ఉండగా రూ.17 కోట్ల పన్నులు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటివరకు సుమారు రూ.6 కోట్ల వరకు వసూలు కాగా.. రూ.11 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. 15 ప్రత్యేక బృందాలకు వార్డుల వారీగా బాధ్యతలు అప్పగించి పన్నులు వసూలు చేస్తున్నారు.  మంచిర్యాలలో రూ.18.27 కోట్లు లక్ష్యం కాగా.. రూ.7.60 కోట్లు, బెల్లంపల్లిలో రూ.4.86 కోట్లు లక్ష్యం కాగా రూ.1.61 కోట్లు, చెన్నూరులో రూ. 2.89 కోట్లకు గాను రూ.1.17 కోట్లు, క్యాతనపల్లిలో రూ. 4 కోట్లుకు గాను 1.99 కోట్లు, లక్సెట్టిపేటలో రూ.1.68 కోట్లుకు గాను రూ.1.06  కోట్లు, మందమర్రిలో రూ. 2.41 కోట్ల లక్ష్యానికి రూ.1.12  కోట్లు వసూలు అయ్యాయి. నిర్మల్ మున్సిపాలిటీలో రూ.10.60 కోట్ల పన్ను లక్ష్యం కాగా ఇప్పటి వరకు రూ.4.70 కోట్ల వరకు వసూలయ్యాయి. 

ఇంకా రూ. 6.35 కోట్లు పెండింగ్ ఉంది. ఖానాపూర్ రూ.2.18 కోట్లుకు రూ.69 లక్షలు, భైంసా మున్సిపాలిటీ లక్ష్యం రూ.70.97 లక్షలు కాగా రూ.2 లక్షలు వసూలు చేశారు. ఆసిఫాబాద్​ జిల్లాలోని కాగజ్ నగర్ మున్సిపాలిటీ లక్ష్యం రూ.3.92 కోట్లు కాగా రూ. 1.72 కోట్లు వసూలు చేశారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రూ.1.05 కోట్లుకు ఇప్పటివరకు రూ.52 లక్షలు వసూలయ్యాయి. మిగిలిన 47 రోజుల్లో మున్సిపాలిటీలు దాదాపు రూ.42 కోట్ల పన్నులు వసూలు చేయాల్సి ఉంది.

గ్రామ పంచాయతీల్లో ఇలా..

గ్రామాల్లోనూ పన్నులు వసూలు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 466 గ్రామ పంచాయతీలు ఉండగా ఈ ఏడాది రూ.6.84 కోట్ల పన్నులు వసూళ్లు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు రూ.3.88 కోట్లు వసూలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరో రూ. 3 కోట్ల వరకు పెండింగ్​లో ఉంది. ఇప్పటి వరకు వందశాతం పన్నులు వసూలైన గ్రామ పంచాయతీల కార్యదర్శులను డిప్యూటేషన్​పై పంపించి స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. 

దాదాపు 30 గ్రామ పంచాయతీల్లో వంద శాతం పన్నులు వసూలైనట్లు అధికారులు చెబుతున్నారు. మంచిర్యాల జిల్లాలో 311 గ్రామ పంచాయతీల్లో ఈ ఏడాది పన్నుల లక్ష్యం రూ.7.50 కోట్లు కాగా ఇప్పటివరకు 4.67 కోట్లు వసూలయ్యాయి. ఇంకా 2.82 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఆసిఫాబాద్ జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో రూ. 5.62 కోట్ల టార్గెట్​ కాగా ఇప్పటి వరకు రూ.2.77 కోట్లు వసూలయ్యాయి.

గడువులోగా పూర్తయ్యేనా..?

ప్రస్తుతం జిల్లాలోని బల్దియా, పంచాయతీల్లో పన్నుల వసూళ్లు మందకొండిగా సాగుతున్నాయి. పంచాయతీ కార్యదర్శులతో పాటు మున్సిపాలిటీ సిబ్బంది వరుసగా ప్రభుత్వ పథకాల అమలు, ప్రజాపాలన, సామాజిక సర్వే, ఇందిరమ్మ ఇండ్ల సర్వేలతో బిజీగా ఉండడంతో పన్ను వసూళ్లపై ప్రభావం పడింది. దాదాపు మూడు నెలల పాటు పంచాయతీ, బల్దియా సిబ్బంది ఈ కార్యక్రమాలతోనే బిజీగా గడిపారు. 

ఇప్పుడు ఆర్థిక సంవత్సరం ముగింపునకు 47 రోజులు గడువు ఉండటంతో పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అయితే ఏడాది నిర్లక్ష్యం చేసే అధికారులు ఆర్థిక సంవత్సరం ముగిసే టైమ్​కు పన్ను వసూళ్లలో హడావిడి చేస్తుంటారని, ఈ నిర్లక్ష్యం కారణంగా పన్నులు వందశాతం వసూలు కావడం లేదని విమర్శలున్నాయి.